
ఆయన సూచనలతోనే తెరపైకి జోగి రమేష్ పేరు
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరం రూరల్: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇందులో భాగంగానే ఈ కేసులో అరెస్టయి, రిమాండులో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతో వైఎస్సార్‌సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ పేరును చెప్పిస్తూ వీడియో లీక్ చేయించారని అన్నారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
మంగళవారం రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో వేణు మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు వరుసగా అరెస్టవుతున్నా, సిగ్గు లేకుండా వైఎస్సార్‌సీపీకి ఈ బురద అంటించాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, దీంతో భయపడ్డ చంద్రబాబు దీనిని డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ పేరును తెరపైకి తీసుకువచ్చారన్నారు. హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించి ‘దీనిలో కుట్రకోణం ఉంది.
దాని కోసం సిట్ వేశాను. కొత్త పాత్రలను ప్రజలకు చూపిస్తాను’ అన్నట్టుగా చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వెంటనే జనార్దనరావు వీడియో విడుదలైందన్నారు. జోగి రమేష్ చెప్తేనే తాను నకిలీ మద్యం రాకెట్ నడిపించానంటూ ఈ వీడియోలో అతడు ఆరోపించాడన్నారు. సీఎం తన అనుకూల అధికారులతో వేసిన సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగదని స్పష్టం చేశారు.
ఈ సందేహాలకు బాబే జవాబు చెప్పాలి
‘జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? అంతకుముందే ఆయన తన ఫోన్ పోయిందని పోలీసులకు స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఫోన్‌లేని వ్యక్తి వీడియో ఎలా రికార్డ్ చేశాడు? జుడీషియల్ రిమాండ్‌లో ఉండే ఈ వీడియో రికార్డ్ చేశాడని భావించినా, ఆయనను విచారించే అధికారులు చుట్టూ ఉంటారు. ఆయన నిలబడి, వినమ్రతతో మాట్లాడతాడు. కానీ.. ఈ వీడియో చూస్తే ఆయన చాలా స్వేచ్ఛగా కుర్చీలో కూర్చుని ఉన్నట్టు, పక్కనుంచి ప్రాంప్టింగ్ తీసుకుంటూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చేటప్పుడు రికార్డ్ చేసిన వీడియోగా కూడా దీనిని భావించే పరిస్థితి కనిపించడం లేదు.
అందువల్ల జనార్దనరావుతో ఉద్దేశపూర్వకంగానే కావాల్సిన విధంగా చెప్పించి, వీడియో చిత్రీకరించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సందేహాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి’ అని వేణు అన్నారు. జైలులో రిమాండులో ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి, బయటకు విడుదల చేశారంటే, దీనికి ఏ అధికారి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జోగి రమేష్ కు జనార్దనరావు సన్నిహితుడంటూ ఓ కట్టుకథ అల్లారన్నారు. 2024లో తంబళ్లపల్లి టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు బి–ఫామ్ ఇచ్చిన సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బదులు జనార్దనరావు ఉన్నాడన్నారు.
ఈ ఫొటోలు కూడా అన్ని పత్రికల్లోనూ వచ్చాయన్నారు. దీనినిబట్టి జనార్దనరావు ఎవరికి అత్యంత సన్నిహితుడో ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ, భరోసా లేకపోతే అంత ధీమాగా ఒక కేసులో నిందితుడు ఆఫ్రికా నుంచి ఆవిధంగా వస్తాడా అని ప్రశ్నించారు. తొలుత ఆయన ఆఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నకిలీ మద్యం వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదని చెప్పాడన్నారు. రిమాండ్‌కు వెళ్లిన తరువాత జనార్దనరావు మాట ఎలా మారిందని ప్రశ్నించారు.