
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలు బయటపెట్టారు. కేశినేని చిన్నికి సంబంధించిన ఆధారాలను కొలికపూడి బయటపెట్టారు. రూ.5 కోట్లు తీసుకుని తనకు తిరువూరు టికెట్ ఇచ్చారన్న కొలికపూడి.. సంచలన ఆధారాలను బయటపెట్టారు.
2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని నన్ను ఐదు కోట్లు అడిగాన్న కొలికపూడి.. తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్‌ఫర్ చేశారో ఆయన బయటపెట్టారు. ‘‘2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశా. 2024 ఫ్రిబవరి 8న మరో రూ. 20 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశా. 2024 ఫిబ్రవరి 14న రూ. 20 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశా. కేశినేని చిన్ని పీఏ మోహన్‌కు రూ. 50 లక్షలు.. గొల్లపూడిలో నా మిత్రుల ద్వారా రూ.3.5 కోట్లు ఇచ్చా.. ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం’’ అంటూ కొలికపూడి సంచలన పోస్టు పెట్టారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.
మరోవైపు.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ‘‘తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు. నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువూరు వరకూ రావాల్సిన అవసరం లేదు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లాయి’’ అని చిన్ని వ్యాఖ్యానించారు.
