
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తిరువూరు తమ్ముళ్ల తిరుగుబాటు జెండా ఎగురవేశారు. టీడీపీ పార్టీని, ప్రభుత్వాన్ని, ఎంపీని ఎమ్మెల్యే కొలికపూడి అల్లరి చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యే.. పార్టీని, ఎంపీని బదనాం చేస్తున్నారు.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎమ్మెల్యేకి కనిపించడం లేదు.. ఎమ్మెల్యే వైఖరిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అంటూ మండిపడ్డారు.
‘‘ఒక పథకం ప్రకారమే ఎమ్మెల్యే కొలికపూడి ఇలా చేస్తున్నారు. కొలికపూడితో వివాదాలన్నీ టీడీపీ వారితోనే. ఎమ్మెల్యే కొలికపూడి వల్ల టీడీపీ తీవ్రంగా నష్టపోతోంది. కొలికపూడిని ఎంపీ కేశినేని చిన్ని కోట్లు ఖర్చుపెట్టి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి పార్టీకి, ఎంపీకి నమ్మకంగా ఉండాలి. ఏవైనా మనస్పర్థలు ఉంటే మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. తిరువూరులో పార్టీ, ప్రభుత్వం, ఎంపీ అల్లరవుతున్నారు తప్ప.. ఏం అభివృద్ధి జరిగింది’’ అంటూ తిరువూరు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.
కాగా, తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం.