
సాక్షి, కృష్ణా జిల్లా: ఎన్నికల్లో ఇచ్చిన సూపర్-6 హామీలకు తూట్లు పొడిచారంటూ చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలిపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్లకు ఎన్నో హామీలిచ్చారు.. ఇప్పుడు చేతులెత్తేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు రాష్ట్రవాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు.. ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి వీల్లేదంటున్నారు’’ అంటూ చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడంటూ పేర్ని నాని నిలదీశారు. చంద్రబాబు ఆటో డ్రైవర్లకు సాధికారిత సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు? ఏమైంది?. ఆటో డ్రైవర్లకు రూ. 10 లక్షల ప్రమాద బీమా చేస్తామన్నారు, చేశారా?. ఆటో డ్రైవర్ల పిల్లల చదువులకు రుణాలు ఇప్పిస్తామన్నారు, ఇచ్చారా?. ఆటో మీద చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నలు గుప్పించారు.
చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురూ కలిసి మూడు ఖాకీ చొక్కాలేశారు. ఆటో డ్రైవర్ సేవలో పేరుతో డ్రైవర్లకు డబ్బులేశామని చెబుతున్నారు. ఎన్నికల్లో రాష్ట్రమంతా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పండని చంద్రబాబు చెప్పాడు. ఎవరైనా ప్రశ్నిస్తే తోలు తీస్తామన్నారు. ఏడాదైనా ఫ్రీ బస్సు ఇవ్వకపోవడంతో విమర్శల పాలయ్యారు. వైఎస్ జగన్, ప్రజలు, ప్రతిపక్షాల దెబ్బకు చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. ఫ్రీ బస్సులో జిల్లాల సరిహద్దులు దాటడానికి వీల్లేదని సాక్షాత్తూ మంత్రులే చెప్పారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో పల్లె వెలుగులో రాష్ట్రమంతా తిరగొచ్చని ప్రకటించారు. బస్సులను తగ్గించేశారు.
చంద్రబాబు దెబ్బకు ఆటోవాళ్లంతా రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఊకదంపుడు ప్రసంగం చేసిన చంద్రబాబు, పవన్‌ను నిలదీశారు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్లు వేశామని చంద్రబాబు చెబుతున్నాడు. భూ ప్రపంచం మీద తనే ఆటో డ్రైవర్లను ఆదుకున్నానని బిల్డప్ ఇచ్చాడు. చంద్రబాబు స్పీచ్ దెబ్బకు ఆటో డ్రైవర్లకు చెవుల వెంట రక్తం ఒక్కటే తక్కువ. ఆటో వాళ్ల కోసం యాప్ పెడతా.. కంట్రోల్ రూమ్ పెడతానంటున్నాడు. ఆటో, క్యాబ్, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లకు పండగే పండగ అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు తీరు సినిమాలో బ్రహ్మానందం క్యామెడీ సీన్‌లా ఉంది.
..వాహనమిత్ర పథకం ప్రారంభించింది వైఎస్ జగన్. పాదయాత్రలో వైఎస్ జగన్ ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్నారు. మచిలీపట్నంలో ఆటో డ్రైవర్ల సమస్యలు స్వయంగా విన్నారు. తమకు ఏడాదికి పది వేలైనా ఇవ్వమని ఆటో డ్రైవర్లు అడిగారు. సొంతంగా ఆటో కొనుక్కుని నడుపుకుంటున్న వారికి 10 వేలు ఇస్తామని ఏలూరు వేదికగా ప్రకటించారు. జగన్ సీఎం అయిన వెంటనే 2 లక్షల 36 వేల మందికి వాహనమిత్ర ఇచ్చారు. ఎన్నికల సంవత్సరం కూడా వైఎస్ జగన్ 2 లక్షల 75 వేల మందికి వాహన మిత్ర ఇచ్చారు. ఇప్పుడు జగన్ కంటే చంద్రబాబు కేవలం 14 వేల మందికి మాత్రమే అదనంగా ఇచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం చాలా చెప్పాడు
..డ్రైవర్లను ఓనర్లు చేసేస్తామన్నాడు. బ్యాడ్జి కలిగిన ప్రతీ ఆటో, ట్యాక్సి డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15 వేలు ఇస్తామని చెప్పారు. మీరు చెప్పినట్లు ప్రతి డ్రైవర్‌కి రూ.15 వేలు ఇచ్చారా?. ఏ ఒక్క ఆటో డ్రైవర్‌కైనా 4 లక్షల రుణం ఇప్పించారా? ఆటో డ్రైవర్లకు బీమా కల్పించారా?. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు .. చేశారా?. చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?. 15 వేలు ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు పెడతారా?. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారని లోకేష్ యువగళంలో చెప్పారు. ఈ రెండేళ్లలో లైసెన్సులున్న వాళ్లు పెరగరా?
బ్యాడ్జి కలిగిన ప్రతీ ఒక్కరికీ ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ఈ రోజు మోసం.. దగా చేసి పండుగ చేసుకోమంటున్నారు. వైఎస్ జగన్ ఒక్క షరతు కూడా పెట్టకుండా వాహనమిత్ర ఇచ్చారు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్ మీ మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు?. ఇప్పుడు ఏం చేశారు?. ఈ రోజు జరిగింది ఆటో డ్రైవర్ల సేవ కాదు.. దగా. మీ మామ ఎన్టీఆర్‌కు ఏం చేశారో.. ఆటో డ్రైవర్లకు కూడా అదే చేశారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి.. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు.
రోడ్లన్నీ వేసేశామంటున్న చంద్రబాబుకు ఇదే నా సవాల్. ఆటో ఎక్కి రండి.. బందరు వస్తారా..? అవనిగడ్డ వస్తారా?. కైకలూరు వస్తారా?. గుడివాడ వస్తారా?. ఆటోలో రండి గోతులున్న రోడ్లు మీకు చూపిస్తాం. ఆటోలో ప్రయాణించిన మీరు బందరు ఆసుపత్రిలో చేరడం ఖాయం. లోకేష్ సిగ్గు లేకుండా మహిళా ఆటోడ్రైవర్లతో బూతులు మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆటో డ్రైవర్లందరినీ వంచన చేశారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.