
సాక్షి, కృష్ణా జిల్లా: మోపిదేవిలంకలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడి ఇంటిని కూల్చేశారు. టీడీపీ నేతల దాడిలో విజయ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడనే నెపంతో ఈడే విజయ్ కుమార్ ఇంటిని జేసీబీతో కూల్చివేశారు. తమ ఇల్లు కూల్చొద్దని విజయ్ కుమార్ కుటుంబం వేడుకున్నా కానీ వారిని దౌర్జన్యంగా టీడీపీ నేత అనుచరులు పక్కకు లాగేసి పడేశారు. టీడీపీ నేత దాడిలో గాయపడిన విజయకుమార్ అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రీ రమేష్ బాబు శనివారం పరామర్శించారు. దౌర్జన్యంగా విజయ్ ఇంటిని కూల్చివేశారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న వారిపై దాడి చేశారని.. కరెంట్ బిల్లు, ఇంటి పన్ను ఉన్నా కూడా కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పేదల ఇల్లు పడగొట్టి పాపం కూడగట్టుకుంటున్నారన్నారు. బాధితులకు న్యాయం చేయాలని సింహాద్రీ రమేష్‌బాబు డిఆమండ్ చేశారు.