
ఫిలిప్పీన్స్‌లోని సెబులో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2025 గాలా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. సాయంత్రం ఎంతో ఆకర్షణీయంగా జరుగుతున్న వేడుక ఒక్కసారిగా భయాందోళనలతో గందరగోళంగా మారిపోయింది. అందాల భామలు రన్‌వేపే హోయలు ఒలికిస్తున్న సమయంలోనే 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా పోటీదారులు భయంతో వేదిక నుంచి దూరంగా పారిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఫిలిప్పీన్స్ భూకంపం
భూకంప కేంద్రం సెబు నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోగో నగరం వరకు భూకంపం సంభవిస్తుందని గుర్తించి ప్రజలకు అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇక ఈ ప్రమాదంలో సుమారు 60 మందికి పైగా మరణించగా, 150 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఆకస్మిక ప్రకృతి విపత్తు అంతర్జాతీయ అందాల పోటీకి అంతరాయ కలిగించిందని అందాల పోటీ నిర్వాకులు తెలిపారు.
అయితే మిస్ ఆసియా-పసిఫిక్ ఇంటర్నేషనల్ (MAPI) ఆర్గనైజేషన్ ప్రతినిధులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. పైగా అక్టోబర్ 1న జరగాల్సిన అందాలపోటీలకు సంబంధించిన అన్ని ఈవెంట్లను రద్దుచేస్తున్నట్లు కూడా ప్రకటించారు నిర్వాహకులు. అంతేగాక మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్ (MUPH) ఆర్గనైజేషన్ సోషల్‌మీడియా పోస్ట్‌లో ఈ ఘోర విపత్తుకు సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొంది.
"ఈ ప్రకృతి విలయం నుంచి కోలుకునేలా తమ సోదరీసోదరీమణులకు అండంగా నిలబడతాం. ఈ విషాద సమయంలో ఫిలిప్పీన్స్ బలం, స్ఫూర్తి, స్థితిస్థాపకత కొనసాగేలా మనవంతుగా కృషి చేద్దాం." అని పోస్ట్‌లో పిలుపునిచ్చింది. కాగా, సెబులో 6.9 తీవ్రతతో ఘోర భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ విపత్తులో చిక్కుకున్న క్షతగాత్రులను సంరక్షించే పనులను వేగవంతం చేసినట్లు ఫిలిప్పీన్స్ భద్రతా అధికారులు తెలిపారు.
(చదవండి: మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం డీఎన్‌ఏ డీకోడ్..!)