పుతిన్‌ ఇంటికే గురిపెట్టారుగా! | Russia Release Alleges Ukraine Drone Video | Sakshi
Sakshi News home page

పుతిన్‌ ఇంటికే గురిపెట్టారుగా!

Jan 1 2026 7:25 AM | Updated on Jan 1 2026 7:29 AM

Russia Release Alleges Ukraine Drone Video

ఉక్రెయిన్‌ సంక్షోభం ఈ ఫిబ్రవరితో నాలుగేళ్లు పూర్తి కానుంది. ఒకవైపు యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నా.. మరోవైపు ఇరుదేశాల కవ్వింపు చర్యలు మాత్రం ఆగడం లేదు. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇంటిపైనే డ్రోన్‌ దాడి జరగడం కలకలం రేపగా.. అమెరికా సహా పలు దేశాల అనుమానాల నేపథ్యంలో ఆ దాడులకు సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేశారు. 

అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుతిన్‌ నివాసంపై డ్రోన్‌ దాడి జరిగిందనే.. ఇది ఉక్రెయిన్‌ సైన్యం పనేనని రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ఆ దాడి తమ పని కాదని.. ఇది రష్యా ఆడుతున్న నాటకమని.. అసలు అలాంటి దాడేం జరగలేదని.. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలకు దిగింది అని ఉక్రెయిన్‌ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. రష్యా అధినేత నివాసంపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అదే సమయంలో అలాంటి దాడి జరగకపోయి ఉండొచ్చంటూ అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో..  

అనూహ్యంగా.. మాస్కోతో పాటు క్రిమియాలోని పలు ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులు జరిగాయంటూ రష్యా కొన్ని వీడియోలను రిలీజ్‌ చేసింది. అందులో.. క్రెమ్లిన్‌(రష్యా అధ్యక్ష కార్యాలయం) సమీపంలో నిర్వీర్యం చేసిన ఓ డ్రోన్‌కు ఆరు కేజీల పేలుడు పదార్థాలు అమర్చి ఉన్నాయి. దీంతో 24 గంటల్లో దాడికి సంబంధించిన ఆధారాలు చూపించాలన్న ఉక్రెయిన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చినట్లైంది. 

ఈ వీడియోలు వెలుగులోకి రాకముందే.. పుతిన్‌ ఇంటిపై జరిగిన డ్రోన్‌ దాడుల్ని పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘‘శాంతి స్థాపనకు కొనసాగుతున్న ప్రయత్నాలకు భంగం కలిగించవద్దు’’ అంటూ రష్యా-ఉక్రెయిన్‌లను కోరారు. ఒక్క ఫ్రాన్స్‌ మాత్రం సరైన ఆధారాల్లేకుండా ఉక్రెయిన్‌ను నిందించడానికి వీల్లేదంటూ మద్దతు ప్రకటించింది. అయితే.. తాజా దాడుల వీడియోలపై కీవ్‌ వర్గాలు, జెలెన్‌స్కీ.. అసలు ట్రంప్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. 

సుమారు 91 డ్రోన్లు.. నోవ్‌గోరోడ్‌ రీజియన్‌లోని పుతిన్‌ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చాయని.. అయితే మాస్కో-సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో వాటిని తమ సైన్యం నేల్చకూల్చిందని రష్యా విదేశాంగ మంతరి సెర్గె లావ్‌రోవ్‌ ప్రకటించారు. అయితే.. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్‌ పనేనని ఆరోపిస్తున్నారాయన. కానీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై దాడులను రష్యా ఆపడం లేదు. తాజాగా దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంపై తాజాగా డ్రోన్లతో మాస్కో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక అపార్ట్‌మెంట్లు, విద్యుత్‌ గ్రిడ్లు ధ్వంసమయ్యాయి. ఓ శిశువు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని భావించేలోపే.. రష్యా ఉక్రెయిన్‌పై దీర్ఘశ్రేణి దాడుల్ని తీవ్రం చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement