ఎన్‌సీఆర్‌బీ డేటా.. ఎల్లో మీడియా వక్రీకరణ: కైలే అనిల్‌ | Kaile Anil Kumar Comments On Chandrababu And Yellow Media | Sakshi
Sakshi News home page

ఎన్‌సీఆర్‌బీ డేటా.. ఎల్లో మీడియా వక్రీకరణ: కైలే అనిల్‌

Oct 1 2025 6:48 PM | Updated on Oct 1 2025 7:31 PM

Kaile Anil Kumar Comments On Chandrababu And Yellow Media

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఎన్‌సీఆర్‌బీ నివేదికలోని వాస్తవాలను కూడా చంద్రబాబు కోసం వక్రీకరించే దుస్థితికి ఎల్లో మీడియా దిగజారిందని, ఆ నివేదికను ఉటంకిస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై పచ్చి అబద్దాలను అచ్చేసిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్ మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని పండుగలా జరిపించి, విత్తనం నుంచి విక్రయం వరకు వారికి అండగా నిలబడటం వల్ల గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని అన్నారు.

వ్యవసాయం దండగ అని నమ్మే చంద్రబాబు సుదీర్ఘ పాలనలో రైతులకు కష్టాలు, కడగండ్లు, ఆత్మహత్యలు తప్ప మరేమీ దక్కలేదని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను తక్షణం ఆదుకున్న మానవత్వం వైఎస్‌ జగన్‌ది అయితే, వారి కుటుంబాలను గాలికి వదిలేసిన రాక్షసత్వం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరుగుతోంది. వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చడానికి, రైతులను డిస్ట్రస్ నుంచి తప్పించడానికి వైఎస్‌ జగన్ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. వాటన్నింటినీ రద్దు చేసి, మళ్లీ వ్యవసాయంలో సంక్షోభాన్ని తీసుకువచ్చిన చంద్రబాబుని కాపాడేందుకు ఎల్లోమీడియా ఇవాళ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుంది. 2023లో ఎన్‌సీఆర్‌బీ డేటాను తీసుకుని, చిలువలు పలవలు చేసి, వక్రీకరించి తప్పడు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. రాష్ట్రంలో వైఎస్‌ జగన్ హయాంలో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారనే అభిప్రాయాన్ని కలిగించడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది.

ఆత్మహత్య చేసుకున్న రైతులు.. మద్యం తాగి చనిపోయారన్న చంద్రబాబు
వైఎస్సార్‌సీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది ఉండగా, కౌలు రైతులు 122 మంది ఉన్నారు. కాగా 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369 కు తగ్గాయి. వారిలో భూ యజమానులైన రైతులు 309 మంది ఉండగా, కౌలు రైతులు 60 మంది ఉన్నారు. 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.. 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కు తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2022లో అవి 917కు తగ్గాయి.

2023లో ఏడాదిలో రైతుల ఆత్మహత్యల సంఖ్య  925. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. దీనిపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. పోనీ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నాడా అంటే అదీ లేదు? రైతుల ఆత్మహత్యలను గుర్తించడానికి, వారి కుటుంబాలను కాపాడ్డానికి ఏ రోజు కూడా చంద్రబాబు తన 14 ఏళ్ల పరిపాలనా కాలంలో కాని, ఇవాళ కాని ముందుకు రావడం లేదన్నసంగతి తెలిసిందే. 2014-19 మధ్య రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, వారంతా వ్యక్తిగత సమస్యలతోనూ, మద్యం తాగి చనిపోయినట్టుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రైతుల పట్ల, వారి కష్టాల పట్ల చంద్రబాబుకు మానవత్వం లేదనే విషయం ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. ఈ సారి కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు. ఆయా కుటుంబాల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.

చంద్రబాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయం
ధాన్యం దగ్గర నుంచి మిర్చి, పొగాకు, మామిడి సహా ప్రస్తుతం ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక అప్పులు ఊబిలో కూరుకు పోయారు. రాష్ట్రంలో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనికి తోడు ఎరువుల కొరత కూడా రైతులను తీవ్రంగా వేధిస్తోంది. గతేడాది పెట్టుబడి సహాయాన్ని ఎగ్గొట్టారు, ఉచిత పంటల బీమా ఎగ్గొట్టారు, ఇ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలను నీరుగార్చారు. సీఎం యాప్‌ను తీసేశారు. ఈ పరిస్థితులన్నీ రైతులను తీవ్ర నిరాశాజనక వాతావరణం లోకి నెట్టేశాయి. పరిస్థితులను తట్టుకోలేక వారు బలవ్మనరణాలకు పాల్పడుతుంటే.. కనీసం ఆ కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం జాలి కూడా చూపడంలేదు.

కానీ వైఎస్‌ జగన్ రైతులకు ప్రతి చోటా చేదోడు వాదోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని గొప్ప విదానాలు తీసుకువచ్చి రైతుల్ని ఆదుకునే ప్రయత్నాలు చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచడానికి ముఖ్యమంత్రిగా ఆయన అహర్నిశలు పని చేశారు. వైయస్సార్సీపీ పరిపాలనాకాలంలో  1794 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే వారందరికీ కూడా పరిహారం చెల్లించారు.

ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సహాయం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం తెలియగానే.. వెంటనే జిల్లా కలెక్టర్‌ను  పంపి, ఆ కుటుంబాలకు బాసటగా నిలిచి, 48 గంటల్లోపే ఆ కుటుంబాలకు సహాయం అందించిన ఘటనలు కోకొల్లలు. మరి ఇప్పుడు ఎందుకు ఆ విధానాన్ని తీసేశారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడ్డం లేదు? ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదు? అంతేకాదు 2014-19 మధ్య పునర్విచారణ జరిపి, 474 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందేలా చేశారు. చంద్రబాబు చేసిన అన్యాయాన్ని కూడా సరిదిద్దే ప్రయత్నం వైయస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగింది. ఇలా దాదాపుగా రూ.117 కోట్లు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంగా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది.

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల పట్ల 'బాబు' నిర్లక్ష్యం
2014-19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులను కాపాడేందుకు చంద్రబాబు ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. అరకొరగా ఆయా కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారంఅనేవారు. దాంట్లో రూ.1.5 లక్షల్నిఅప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా  చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. ఎప్పుడో ఐదేళ్లకో.. పదేళ్లకో ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇది ఏరకంగా బాధిత కుటుంబాలను ఆదుకున్నట్టు అవుతుంది? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్బడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది.

వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే కౌలు దారులకు రూ.7 లక్షలు పరిహారాన్ని కూడా ఈ ప్రభుత్వం అందించింది. జగన్మోహన్రెడ్డిగారు అత్యంత మానవతావాదిగా వారికి సహాయం చేశారు? ఇప్పుడు చంద్రబాబు రైతుల పట్ల, వారి కుటుంబాల పట్ల అత్యంత అన్యాయంగా వ్యవహరిస్తూ.. వారి ఉసురు పోసుకుంటున్నాడు. ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు పరిపాలనా విధానం ప్రధాన కారణం. వ్యవసాయ రంగంలో ఆయన సృష్టించిన సంక్షోభమే దీనికి కారణం. ధరల స్థిరీకరణ నిధిని ఎత్తివేసి రైతుల ఉసురు పోసుకున్నారు.

వైఎస్‌ జగన్‌ ఇదే నిధితో దాదాపు రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నారు. మరి రైతు ద్రోహి ఎవరు? ఉచిత పంటల బీమాను జగన్‌ పెడితే, చంద్రబాబు దాన్ని రద్దు చేశారు. గత ఏడాది అందాల్సిన పంటల బీమా ఇప్పటి వరకూ అందలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా.. నష్టాల గణనే లేకుండా పోయింది. వందల మంది రైతులు చంద్రబాబు వచ్చిన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం మీద వార్తలు ఇవ్వకుండా కేవలం చంద్రబాబును జాకీలు పెట్టి లేపే పనిని ఎల్లో మీడియా మానుకుంటే మంచిది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తగ్గిన నేరాలు
ఇక ఎన్సీఆర్బీ డేటా విషయాని కొస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చిన విషయం చాలా స్పష్టంగా డేటాలో కనిపించింది. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో అన్నిరకాల నేరాలు తగ్గాయని ఎన్ఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేలా చేసేందుకు నమోదు చేసే నాన్ కాగ్నిజబుల్ కేసులు కూడా తగ్గడం శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వ సమర్థతకు నిరద్శనం. 2020లో ఐపీసీ కేసుల 1,88,997 కాగా, 2021లో 1,79,611, 2022లో 1,58,547 మాత్రమే నమోదయ్యాయి, 2023లో 1,53,867 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రతి ఏటా తగ్గుదల చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక స్పెషల్ లోకల్ లా కేసులను చూస్తే 2020, 21, 22 సంవత్సరాల్లో క్రమంగా తగ్గుకుంటా వచ్చాయి. 2020లో 49,108, 2021లో 42,588, 2022లో 36,737గా ఉన్నాయి. 2023లో 30,436కు పరిమితం అయ్యాయి. నేరాలకు పాల్పడే వారిని న్యాయస్థానం ద్వారా విచారించి వారికి శిక్షలు పడేలా చేయడంలో వైయస్సార్సీపీ హయాంలో గట్టిగా కృషి జరిగింది. కేంద్ర హోంశాఖ నిర్దేశిచిన ఛార్జిషీటు దాఖలకు పెట్టిన గడువు 60 రోజులు అయితే, నమోదైన కేసుల్లో 91.6 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేసి రాష్ట్రం, దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది.

శాంతిభద్రతల నిర్వహణ, కేసులు దర్యాప్తు, విచారణ, తర్వాత న్యాయ ప్రక్రియలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సమర్థతకు నిదర్శనం ఇది. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హత్యలు కూడా గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా... 2022లో హత్యల సంఖ్య 925కు తగ్గింది. 2023లో హత్యలు 922. అంటే హత్యలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. మహిళల పై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ సమర్థతకు అద్దం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిపించకుండా పోయారంటూ మహిళలు, అమ్మాయిలు, బాలికల విషయంలో నమోదైన కేసుల్లో 85.7 శాతం రికవరీ 2023లో ఉంది. దేశంలో 54 శాతం మాత్రమే. దేశంలోనే రాష్ట్రం పనితీరు బాగున్నట్టుగా నివేదిక పేర్కొంది.

ఎన్నికలకు ముందు 39 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయినట్టుగా ఇష్టానుసారం ఆరోపణలు చేశారు. ఇవన్నీ అవాస్తవాలని ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు కొట్టి పారేసింది. పైగా వైఎస్సార్‌సీపీ హయాంలో ఫిర్యాదు చేయడానికీ, వాటిపై కేసుల నమోదుకూ, విచారణకూ పగడ్బందీ వ్యవస్థలు ఉండేవి. వీటి నమోదు ద్వారా నంబర్లు పెరుగుతాయని, తద్వారా కేసులు ఎక్కువగా ఉన్నాయనే భావన ఉన్నప్పటికీ, వివిధ సంస్కరణలతో రిపోర్టింగ్ విధానాన్ని బలోపేతం చేశారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మెరుగ్గా పనిచేసినప్పటికీ వక్రీకరణలతో ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement