
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్ చేయకూడని పనులన్నీ చేస్తోందంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంపద సృష్టిస్తామని.. ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారంటూ చంద్రబాబును దుయ్యబట్టారు. బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. సూపర్ సిక్స్ మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కార్ వేధింపులపై వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు.
సంపద సృష్టిస్తా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నింటా తిరోగమనమే. 15 నెలల్లోనే ఈ ప్రభుత్వం వ్యతిరేకత మూట గట్టుకుంది. సూపర్ సిక్స్‌పై ఇచ్చిన ప్రకటనను ఇప్పుడు మార్చేశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఎత్తేశారు. అట్టర్‌ఫ్లాప్ అయిన సూపర్ సిక్స్‌పై బలవంతపు విజయోత్సవాలా?. ఈ స్థాయిలో మోసం చేసేవారు ప్రపంచలోనే ఎవరూ ఉండరు.
..చంద్రబాబు హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. రాష్ట్రంలో యూరియా దొరకడం లేదు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వమే దళారులతో చేతులు కలిపి యారియాను పక్కదారి పట్టిస్తోంది’’ అని వైఎస్ జగన్ నిలదీశారు.
