మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ‘వైఎస్సార్‌సీపీ ప్ర‌జా ఉద్య‌మం’ | Ysrcp To Protest On November 12 Against Privatization Of Medical Colleges | Sakshi
Sakshi News home page

మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ‘వైఎస్సార్‌సీపీ ప్ర‌జా ఉద్య‌మం’

Nov 7 2025 3:05 PM | Updated on Nov 7 2025 3:36 PM

Ysrcp To Protest On November 12 Against Privatization Of Medical Colleges

సాక్షి, తాడేప‌ల్లి: ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలను ప్రైవేటీక‌రిస్తూ కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్రమం జ‌రుగుతుంది. ఇందులో భాగంగా ఈనెల 12న ‘వైఎస్సార్‌సీపీ ప్ర‌జా ఉద్య‌మం’ పేరుతో 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో నిర‌స‌న ర్యాలీలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు పార్టీ నాయ‌కులు వెల్ల‌డించారు. అనంత‌రం అధికారుల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.

ఇందుకు సంబంధించి తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ‘వైఎస్సార్‌సీపీ ప్ర‌జా ఉద్య‌మం’ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునేదాకా వైఎస్సార్‌సీపీ పోరాడుతుంద‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఆయన ఇంకా ఏమ‌న్నారంటే..

అంద‌రికీ నాణ్య‌మైన ఉచిత వైద్యం అందించ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త‌గా భావించిన నాటి సీఎం వైఎస్‌ జ‌గ‌న్, రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్ట‌డ‌మే కాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 7 కాలేజీల‌ను పూర్తి చేశారు. మిగిలిన కాలేజీల నిర్మాణాలు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి. ఈ మెడిక‌ల్ కాలేజీలు, ఆస్ప‌త్రుల‌ నిర్మాణాల‌కు నిధుల కొర‌త లేకుండా సెంట్ర‌ల్ స్పాన్సర్డ్ స్కీమ్స్‌తో టైఅప్ చేయ‌డం జ‌రిగింది.

కానీ 2024లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మెడిక‌ల్ కాలేజీ నిర్మాణాల‌ను పూర్తిచేయ‌క‌పోగా సేఫ్ క్లోజ‌ర్ పేరుతో పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. అంతే కాకుండా 10 మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేయాల‌ని నిర్ణయించి డాక్ట‌ర్లు కావాల‌ని క‌ల‌లు క‌నే పేద విద్యార్థుల ఆశ‌ల‌కు చంద్ర‌బాబు గండి కొట్టారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షులు వైఎస్‌ జ‌గ‌న్ ఆదేశాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఈనెల 12న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.

పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైయ‌స్సార్సీపీ అధికార ప్ర‌తినిధి వంగ‌వీటి న‌రేంద్ర‌, ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్య‌క్షుడు పానుగంటి చైత‌న్య‌, లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్‌రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నారాయణమూర్తి, ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement