ప్రస్తుతం అమెరికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. ఈ మాట వినడానికే వింతగా ఉన్నా... వాస్తవం! అక్కడ ప్రస్తుతం ‘షట్‌డౌన్’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షట్‌డౌన్ ప్రభావం అనేక రంగాలపై పడింది. తాజాగా వివిధ రాష్ట్రాలలో ఆహార సంక్షోభా నికి దారి తీసింది. ప్రధానంగా వాణిజ్య రాజధాని అయిన న్యూయా ర్క్‌పై పడింది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సాయం నిలిచిపోయింది. దీంతో ఆ రాష్ట్రం ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. ఫెడరల్ ప్రభుత్వ షట్‌డౌన్ అమెరికాలోని కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లి మెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్ స్టాంప్స్’ ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అమెరికాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేద వారే!
ఇదిలా ఉంటే, నిధుల కొరత కారణంగా నవంబరు నెల ప్రయోజనా లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిలిపివేయాలని ఇటీవల రాష్ట్ర ఏజెన్సీ లను అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కాగా ఆహార సంక్షో భాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లేదని గవర్నర్ కేథీ హోచుల్ ఆరోపించారు. చట్టబద్ధంగా ఆమోదించిన ఎమర్జెన్సీ ఫండ్‌ను విడుదల చేయడానికి ట్రంప్ సర్కార్ నిరాకరిస్తోందని కేథీ ఘాటు ఆరోపణలు చేశారు. ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అమెరికాలోని అనేక రాష్ట్రాలు సొంతంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ జాబితాలో లూసియానా, వెర్మంట్, న్యూ మెక్సికో ముందు వరుసలో ఉన్నాయి.
ఇదీ చదవండి : మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందన
అమెరికా ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రతి ఏడాది తప్పనిసరిగా ఒక బడ్జెట్‌ను లేదా తాత్కాలిక ఖర్చులను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే అక్టోబరు ఒకటో తేదీలోగా కాంగ్రెస్ ఈ బడ్జెట్‌ను ఆమోదించాల్సిఉంటుంది. అలా జరగకపోతే, ప్రభుత్వంలో అత్యవసరం కాని సేవలు తాత్కా లికంగా నిలిచిపోతాయి. దీనినే ‘ప్రభుత్వ షట్‌డౌన్’ అంటారు. వాస్తవానికి ప్రభుత్వ సొమ్ము వృ«థా కాకుండా చూడాలనే సదుద్దేశంతో షట్‌డౌన్ చట్టాన్ని తొలి రోజుల్లో తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడాలనే నియమాన్ని అన్ని రాజకీయ పార్టీలూ పక్కన పెట్టి... తమ విధానపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే సామాన్య అమెరికన్లు మధ్యలో నలిగి పోవడం గమనార్హం.
– ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్


