నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు. ప్రజా జీవితంలో ఉన్న ఒక నాయకుడి గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన రోజు. తెలుగు ప్రజలను అత్యంత ప్రభావితం చేస్తున్న రాజ కీయ నేత ఆయన. వైఎస్సార్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ అసాధారణ నాయకత్వ లక్ష ణాలు కలిగి, విలువల కోసం తపించే నేతగా తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తున్నారు.
జగన్ రాజకీయంగా వేసిన తొలి అడుగు నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు ప్రతి అడుగు అనేక ఆటంకా లను అధిగమించింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు అసలు జగన్ రాజకీయాల్లో నిలబడగలడా అన్న అనుమానం కలిగే విధంగా ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక వైపు అధికార కాంగ్రెస్, రెండవ వైపు ప్రతిపక్ష తెలుగుదేశం – పేరుకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా... జగన్ విషయంలో ఏకమై నాయి.
అదెంతగా అంటే అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెడితే విపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం విప్ జారీ చేసి మరీ అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేసింది. ఈ పరిణామం బహుశా భారతదేశ రాజకీయాలలో అరుదైన ఘటన. అప్పుడే రాజకీయ ప్రవేశం చేసిన ‘ప్రజా రాజ్యం’ కూడా జగన్‌కు వ్యతిరేకంగా అధికార కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. పార్టీగా ముందుకు సాగుతున్న దశలో 16 నెలలు జైలులో ఉండాల్సిన పరిస్థితి మరోవైపు దాపురించింది. ఒక్క రాజశేఖర్ రెడ్డి కుమారుడు అన్న అంశం తప్ప చుట్టూ అన్నీ ప్రతికూల పరిస్థితులే. వైఎస్సార్ సాధించి పెట్టిన వెలకట్టలేని ‘ప్రజాభిమానం’ అన్న ఆయుధాన్ని చేపట్టి ‘ఏమైనా సరే నిల బడాల్సిందే, చావో రేవో తేల్చుకోవాల్సిందే’ అని ఆయన చేసిన సుదీర్ఘ రాజకీయ పోరాటం తిరుగులేని నాయకుడిగా, జనం మెచ్చిన నేతగా ఆయన్ని మార్చింది.
నాడు జగన్‌పై నమోదు అయిన సీబీఐ కేసులను నిశితంగా పరిశీలిస్తే... ఆయన్ని వీలైనన్ని ఎక్కువ రోజులు జైలులో పెడితే పురిటిలోనే పార్టీ మట్టిగొట్టుకు పోతుందన్న వ్యూహం కనిపి స్తుంది. ఈ పరిస్థితుల్లో మరో నాయకుడైతే ఏదో ఒక స్థాయిలో రాజీపడి ఉండేవారు. కానీ జగన్ మొండిగా ప్రజలను నమ్ము కుని ముందుకు సాగారు. అందు వల్లే ఆయన రాజకీయంగా హీరోగా, పోరాట యోధుడిగా మారారు. తొలి ఎన్నికల్లో సంపూర్ణ విజయం దక్కక పోయినా నిలదొక్కుకున్నారు. 2014 నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు పోరాటాలు విస్తృతంగా నిర్వహించారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’తో పార్టీని విజయం వైపు నడిపారు.
ఎన్నికల హామీల అమలుకు విశ్వసనీయత
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తన మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేశారు. అదే సమయంలో రాష్ట్ర విస్తృత ప్రయోజనాల ప్రాతిపదికన పరిపాలనా ప్రాథమ్యా లను నిర్ణయించుకున్నారు. ప్రజల ముంగిటకు పాలన తీసుకు వెళ్లడం కోసం గ్రామ ‘సచివాలయ’ వ్యవస్థను సృష్టించి 1.30 లక్షల శాశ్వత ఉద్యోగులు, 2.7 లక్షల వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో సైతం విప్లవం తెచ్చారు. ‘కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఆఖరికి రాజకీయాలు చూడం... అర్హత ఉంటే చాలు ప్రతి పేదవాడికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు’ అంటూ అందరినీ ఆదుకున్న చరిత్ర, సమానంగా ఆదరించిన ఘనత జగన్‌ది. ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి అధికా రంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల అమలుకు ఉన్న పరి మితులు చెప్పడం రాజకీయాల్లో సహజం. కానీ జగన్ అందుకు భిన్నంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఏకంగా ఓ వ్యవస్థనే సృష్టించారు. ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ లను మరిచిపోవడం సాధారణమైన రోజుల్లో... జగన్ అందుకు భిన్నంగా ‘గడప గడపకూ మీ ప్రభుత్వం’ కార్యక్రమం పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చిన సంగతిని ప్రజ లకు గుర్తు చేస్తూ... పాలన చేయడం ఒక సాహసం.
అభివృద్ధి–దూరదృష్టి మేళవించిన విజనరీ
మెజారిటీ ప్రజలకు తమ అవసరాలు తీరడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంటి వద్దకు తీసుకుపోవడం ఒక గొప్ప ప్రయత్నం. అధికార వికేంద్రీకరణకు మంచి ఉదాహరణ. గ్రామ ‘సచివాలయ వ్యవస్థ’, ‘ఆర్బీకే’, ‘విలేజ్ క్లినిక్‌లు’, ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి అనేక వ్యవస్థలు గ్రామంలోనే అన్ని అవసరాలూ తీర్చేలా రూపొందాయి. ‘నాడు–నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠ శాలలు ఆధునీకరించడం, పట్టణాలకే పరిమితం అయిన ఆంగ్ల బోధనను గ్రామీణ స్థాయికి తీసుకు రావడం ద్వారా... పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను అందించారు.
పోర్టులు, షిపింగ్ హార్బర్ల ఏర్పాటు; ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పేరుతో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ సారథ్యంలో నెలకొల్పడం వంటివి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశాయి. కరోనా సమయంలో జనం అతలాకుతలం అవడానికి ఒక ముఖ్యమైన కారణం ఆధునిక వైద్యం ప్రధాన పట్టణాలకు పరిమితం కావడం. అందుకే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలందించ వచ్చని ఆయన భావించి, వాటి నిర్మాణం చేపట్టారు. మొత్తంగా ఆయన వ్యవహార శైలిని పరిశీలిస్తే... ప్రజలకు ఏదో చేయాలి అన్న తపన, అందుకోసం ఎంత సాహసం చేయడానికైనా వెనుకాడనితనం కనిపిస్తుంది. ఈ వ్యవహార శైలితోనే తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి తగ్గ వారసుడిగా తెలుగు ప్రజల మధ్య నిలబడ్డారు. ఆయన జన్మదినం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

మాకిరెడ్డి పురుషోత్తమ్‌రెడ్డి
వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరమ్
సమన్వయ కర్త


