శతాయుష్షు బామ్మ.. ఇప్పటికీ ఆమె అమ్మ | 103 year old grandmother inspires with active healthy life | Sakshi
Sakshi News home page

శతాయుష్షు బామ్మ.. ఇప్పటికీ ఆమె అమ్మ

Feb 14 2026 12:11 PM | Updated on Feb 14 2026 12:11 PM

103 year old grandmother inspires with active healthy life

షుగర్, బీపీకి దూరంగా శతాధిక వృద్ధురాలు

ఇప్పటికీ వంటావార్పులో సహకారం

గేదెలకు మేత తెచ్చి వేసేది బామ్మే

కల్తీ లేని ఆహారం, కల్మషం లేని జీవనం 

 

నెల్లూరు జిల్లా: నాలుగడుగులు నడిస్తే ఆయాస పడే ఇప్పటి తరానికి ఆ బామ్మ మాటలు బంగారు బాటలు. కష్టపడి పనిచేస్తే ఎలాంటి జబ్బులు రావనేందుకు ఆమె జీవనశైలి పెద్దబాల శిక్ష. వందేళ్ల వయసు పైబడినా తన పని తానే చేసుకుంటూ ఇంట్లో వారికి సైతం సాయంగా ఉంది. టీవీలు, స్మార్ట్‌ ఫోన్ల మాయలో పడి పిల్లలకు కూడా వ్యాధులతోపాటు ఊబకాయం వస్తుంటే వారి పెద్దలు ఆందోళన పడుతున్నారు. 103 సంవత్సరాల వయస్సులో బామ్మ ఇప్పటికీ వంట చేస్తుంది. ఇంట్లో గేదెలకు గడ్డి తెచ్చి మేతగా వేస్తుంది.

వంట చేస్తూ..
పొదలకూరు మండలం, మొగళ్లూరు గ్రామానికి చెందిన అచ్చాల పెంచలమ్మ శతాధిక వృద్ధురాలు. గ్రామంలో ఆమెకంటే పెద్దవారు ఎవరూ జీవించి లేరు. నాలుగు తరాలకు ప్రతినిధిగా కుటుంబాన్ని నెట్టుకొచ్చిన పెంచలమ్మకు నలుగురు సంతానం. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇప్పటికీ బామ్మ హుషారుగా ఉంది. ఆమెకు ఎలాంటి జబ్బులు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాత్రివేళ అప్పుడప్పుడు కాళ్లునొప్పులు వస్తుంటాయని చెబుతోంది. వినికిడి, కంటిచూపు ఈ వయస్సులో కూడా పెంచలమ్మకు బాగున్నాయి. కట్టెల పొయ్యి వద్ద ఆమె ఇంట్లో అందరికీ వంట చేస్తుంది.

మంచి ఆహారపు అలవాట్లు
పెంచలమ్మ కాయ కష్టం చేసేవారు. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండటమే కాక జొన్న, రాగి సంగటి తినేవారు. అందువల్లే ఇప్పటికీ ఆమె ఎంత సమయమైనా కూర్చొని లేవగలుగుతున్నారు. వయోభారంతో కొంత ఆలసటగా కనిపించినా పనులు చేస్తూనే ఉంటారు. కుమారుడు మస్తాన్‌రెడ్డి, కోడలు సంపూర్ణమ్మ వ్యవసాయ పనులపై తోటకు వెళ్తే పెంచలమ్మ వంటి చేసి పెడుతుంది. వందేళ్లు పైబడినా బంధువులు, స్నేహితుల పేర్లు వెంటనే తడుముకోకుండా చెబుతుంది. షుగర్, బీపీ వ్యాధులు ఆమె దరిచేరలేదు. ఎలాంటి మందులు కూడా వాడటం లేదని పెంచలమ్మ చెప్పారు. ఇప్పటి తిండిలో శక్తి లేదని, తాను వయస్సులో ఉన్నప్పుడు కల్తీ లేని ఆహారం తినడం వల్లే ఇంతకాలం జీవించి ఉన్నానంటారు పెంచలమ్మ. కల్మషం లేని లేని జీవితం, కల్తీ లేని ఆహారం తింటే ఎవరైనా తనలా జీవించేందుకు అవకాశం ఉంటుందని బామ్మ వెల్లడిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement