"జోహ్రాన్ యు బ్యూటీ :
ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్ (Mira Nair) తన కుమారుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన నేపథ్యంలో తొలిసారి స్పందించారు. తన కుమారుడి సంచలనాత్మక విజయంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమె సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది.
కుమారుడు జోహ్రాన్ మమ్దానీ విజయంపై మీరా నాయర్, బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ ఇన్‌స్టా పోస్ట్‌ను షేర్ చేశారు. హార్ట్, బాణసంచా ఎమోజీలతో "జోహ్రాన్ యు బ్యూటీ" అనే శీర్షికతో ఆమె స్టోరీని రీ పోస్ట్ చేశారు.
అమెరికాలో, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి కీలకమైన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ విజయంపై జోయా అక్తర్ ప్రశంసలు కురిపించారు."జోహ్రాన్ మమ్దానీ 34 ఏళ్ల వయసులో అధికారికంగా NYC మేయర్ రేసులో గెలిచారు" అంటూ కొనియాడారు.

కాగా ఉగాండాలో జన్మించిన మమ్దానీ, ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ , మీరా నాయర్ దంపతుల కుమారుడు.జోహ్రాన్‌కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్‌టౌన్‌కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్‌దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్‌తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో క్వీన్స్ 36వ జిల్లాకు ప్రతినిధిగా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తాజాగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్‌గా చరిత్ర సృష్టించాడు.


