
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మంత్రులది అంటున్నారు. ప్రజల అవసరాలు తీర్చడం కాకుండా.. తన వారి అవసరాలు తీర్చే పొలిటికల్ మేనేజ్మెంట్‌పై దృష్టి పెట్టండని కూడా ఆయన మంత్రులకు చెబుతున్నారు. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆయన స్పష్టం చేసినట్లు ఎల్లోమీడియా కథనం!.
ఏడాదిన్నర కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కొందరు మంత్రులు సృష్టించిన అరాచకాలు, చేసిన అక్రమాలను కట్టడి చేయడం తనవల్ల కాదని చంద్రబాబు చేతులెత్తేశారా? పరిస్థితులను బట్టి ఇది కావాలని ఇచ్చిన లీకులాగే కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను భయపెట్టడానికి తీసుకున్న చర్యలా అనిపిస్తుంది. కాకపోతే.. అసలు పొలిటికల్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో పనిచేయడమా? ప్రతిపక్షాలకు సంబంధించిన వారి పనులు చేయడానికి వీల్లేదని సీఎం స్థాయి వ్యక్తి అధికారులను ఆదేశించడమా? ఇలా చేస్తే ఆయన అందరి సీఎం ఎలా అవుతారు? ఇప్పుడేమో సొంత పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయమంటున్నారు. తప్పు కాకపోవచ్చు కానీ ఎన్ని అరాచకాలైనా చేసుకోండి కానీ బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సమస్యలను ప్రస్తావించ వద్దని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
ఇంకోలా చెప్పాలంటే ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు ఎమ్మెల్యేలకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారు. ప్రొద్దుటూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్.వరదరాజులు రెడ్డి రైతుల యూరియా కొరత అసెంబ్లీలో ప్రస్తావిస్తే చంద్రబాబుకు నచ్చలేదు. యూరియా కొరత లేదని తాము ఒకపక్క దబాయిస్తూంటే ఈయన వాస్తవాలు మాట్లాడతాడేంటి? అని అనుకున్నారేమో. జగన్ పాలనలో ఒడిశా సరిహద్దుల్లోని పలు గ్రామాల వారు తాము ఆంధ్రప్రదేశ్‌లో ఉంటామని చెప్పేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ఒడిశాలోనే బాగుందని కొన్ని గ్రామాల వారు అంటున్నారని ఆ ప్రాంత ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించడం కూడా బాబు అండ్ కో నేతలకు మింగుడు పడలేదు. ఇంకో ఎమ్మెల్యే ఒకానొక సమస్యపై తాను అధికారులు, హోంమంత్రి అనిత, సర్వ శాఖల మంత్రిగా చెలామణి అవుతున్న లోకేశ్.. ఏకంగా సీఎంకు కూడా వినతిపత్రం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పడం కూడా చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. ఒక పోలీసు అధికారికి సంబంధించిన అంశం కాబట్టి ఇందులో సదరు ఎమ్మెల్యే స్వప్రయోజనాలేమైనా ఉన్నాయా? అన్నది తెలియదు.
రాష్ట్రంలో లంచాలు తీసుకోకుండా పని చేసే పరిస్థితి లేదని, ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం వల్ల లేఔట్ల ఆమోదం వంటి విషయాల్లో లంచాలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతికి పరాకాష్ట ఇది. జనసేన ఎమ్మెల్యే కావడంతో ఈయన అసెంబ్లీలో రోడ్ల దుస్థితిని ప్రస్తావించినా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయాలని పరోక్షంగా సూచించారని మనం బాబు గారి వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవాలి.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరుపై విమర్శలు చేశారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని వ్యాఖ్యానించారు. ఇది కూడా పెద్ద సమస్యగానే చూసినట్లు ఉన్నారు. పవన్ షూటింగుల్లో బిజీగా ఉంటూ పెద్దగా అందుబాటులో ఉండడం లేదన్న విమర్శ ఉంది. అయినా చంద్రబాబు ఆయనను ప్రశ్నించే పరిస్థితి లేదు. కొందరు మంత్రులపై వచ్చిన ఆరోపణలపైనా కనీస వివరణ కూడా అడుగుతున్నట్లుగా కనిపించడం లేదు. ఒక మంత్రి హైదరాబాద్ హోటల్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని టీడీపీ మీడియానే రాసింది. మరో మంత్రి స్టార్ హోటళ్లలో రాచకార్యాలు వెలగబెడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధే వెల్లడించారు. వీటిపై మంత్రులను ఏమీ అన్నట్లు లేరు కానీ, ఆ అధికార ప్రతినిధిని పిలిచి మందలించారు. ఇవి కొన్ని ఉదాహరణలే.
ఒకప్పుడు అసెంబ్లీలో జీరో అవర్ వచ్చిందంటే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను ప్రస్తావించే వారు. మంత్రులు వాటిని నోట్ చేసుకుని ఆ తర్వాత సమాధానం పంపించే వారు. అసెంబ్లీలో తాము కూడా మాట్లాడామని చెప్పుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడేవి. తద్వారా ప్రజలను సంతృప్తిపరచేవారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు అలాంటి వారిని కూడా మందలిస్తున్నారు. పోనీ ఈ ఎమ్మెల్యేలు అవినీతి, దందాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడైనా చర్య తీసుకుంటున్నారా? ఊహూ అదీ లేదు. తన పార్టీ ఎమ్మెల్యే, నాయకులు ఎంత అక్రమంగా సంపాదించుకున్నా ఫర్వాలేదు కానీ అది ఎక్కడా బయటపడకూడదని బాబు భావిస్తారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. ఇంకో సంగతి చెప్పాలి.
ముఖ్యమంత్రి, కీలక మంత్రితోపాటు ఆయా మంత్రుల స్థాయిలో జరిగే అక్రమాలు, అవినీతి విధానాల గురించి ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఉంటుంది. దానివల్లే పై స్థాయి వారే అలా చేస్తున్నప్పుడు తమది ఏముందిలే అని ఎమ్మెల్యేలు భావిస్తుంటారని చెబుతారు. పార్టీ ఎమ్మెల్యేలు కాని, ఇతర నేతలు కాని అంతా మంత్రి లోకేశ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అనుమతి లేకుండా ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదని చెబుతారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పే మాటలను ఎమ్మెల్యేలు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదేమో. టీడీపీ ఎమ్మెల్యేల మద్యం, ఇసుక, భూముల కబ్జా దందాలతో ఎలా వసూల్ రాజాలుగా మారింది తెలుపుతూ ఈ మధ్యే ఎల్లోమీడియానే ఒక వార్త వచ్చింది. చంద్రబాబు దానిపై వెంటనే స్పందించారు. పార్టీ ఎమ్మెల్యేలలో కొందరి వివాదాస్పద ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అసహనం వ్యక్తం చేసినట్లు ఒక లీక్ ఇచ్చారు. అంతేకాదు. సుమారు 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడానని ఆయన వెల్లడించినట్లు రాశారు. వీరిని ఆయన మందలించారో, లేదో తెలియదు. మిగిలిన వారిని ఎందుకు పిలవలేదో తెలియదు.
మహిళలను వేధిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చాయి. తెలుగు మహిళ నాయకురాలే ఒకరు తిరుపతి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఏపీలో అయితే మాట్లాడనివ్వరని ఆమె హైదరాబాద్ వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేపై చంద్రబాబు చర్య తీసుకోలేదు కానీ మహిళతో రాజీ కుదర్చిరాని వార్తలు వచ్చాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే జనసేన మహిళా నేతపై నిఘా పెట్టారంటూ వచ్చిన ఆరోపణ అత్యంత సంచలనమైనదే. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఎమ్మెల్యే ఒకరైతే, ఒక విద్యాలయం మహిళా ప్రిన్సిపాల్‌ను వేధించిన వారు ఇంకొకరు. ఇలా పలువురిపై ఆరోపణలు వచ్చినా చంద్రబాబు ఏదైనా చర్య తీసుకోగలిగారా? ఆయనే చేయలేకపోతే మంత్రులు ఎలా కంట్రోల్ చేస్తారో తెలియదు.
ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ చేస్తుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు తోచిన విధంగా రాజకీయ ఆటలు ఆడకుండా ఉంటారా?. నాయకుడిపై గౌరవం పెరగాలంటే చెప్పిన మాట వినాలంటే, ఆయన విశ్వసనీయతపై అందరికీ నమ్మకం ఉండాలి. తమ రాజకీయ అవసరాల కోసం ఎన్నికల సమయంలో ఆ నాయకుడిపై ఆధారపడుతుండవచ్చు. తదుపరి ఆయనకు ఉన్న అధికారాన్ని బట్టి పైకి ఏమీ మాట్లాడకపోవచ్చు. కానీ, వారికి జరుగుతున్న పరిణామాలు, అధినేతలు చెబుతున్న అబద్దాలు తెలియకుండా ఉండవు కదా!. అనంతపురం బహిరంగ సభలో వేలాది మంది సమక్షంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా వింటుండగానే చంద్రబాబు అబద్దాలు చెబితే ఆయనపై ఎవరికి గౌరవం ఉంటుంది?.
వైఎస్ జగన్ తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలుగుదేశం తెచ్చినవిగా చెబుతుంటే వినే వారందరికీ ఎలా ఉంటుంది?. ప్రతీ చిన్న విషయానికి అబద్దాలు చెప్పడానికి అలవాటు పడిన నేతలు ఎంత పెద్దవారైనా, ఏ హోదాలో ఉన్నా సామాన్య ప్రజలే కాదు.. సొంత ఎమ్మెల్యేలు కూడా అంత విలువ ఇవ్వరన్న సంగతి అర్దం చేసుకోవాలి. తొలుత తమను తాము ఎలాంటి ఆరోపణలు రాకుండా కంట్రోల్ చేసుకుంటే, అసత్యాలు చెప్పకుండా కంట్రోల్ చేసుకుంటే, అప్పుడు ఎమ్మెల్యేలైనా, మరెవరైనా ఆటోమాటిక్‌గా కంట్రోల్ అవుతారు. నైతికంగా భయపడతారు. ఆ సంగతి గుర్తుంచుకోవడం మంచిది కదా!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.