
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ సీపీ వ్యాఖ్యలపై అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ జగన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారనే విషయం సీపీకి తెలియదా? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీలపై తమ విధానం ఏంటో మరోసారి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనేది వైస్ జగన్ విధానం. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు. ఉచితంగా ఇవాల్సిన మెడికల్ సీటును పీపీపీ పద్ధతిలో 66 లక్షలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి విద్యార్ధులకు ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకమని జగన్ చెప్పారు.
చిరు వ్యాపారులు తమ కష్టాన్ని జగగ్‌కు చెప్పుకున్నారు. గోవాడ రైతులు ఫ్యాక్టరీ దుస్థితిని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షుగర్ ఫ్యాక్టరీకి 89 కోట్లు సహాయం చేశారు. రైతులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు జగన్‌ను కలిసి తమ వేదన చెప్పుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారమే బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తన పర్యటనలో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలను పరామర్శించారు. చనిపోయిన వారికి ఐదు లక్షలు పరిహారం పార్టీ తరపున అందించారు అని తెలిపారు.
అలాగే, వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. పర్యటనకు ప్రజలు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు. విశాఖ నగర కమిషనర్ చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి. సీపీ హుందాగా మాట్లాడాలి. మాజీ సీఎం జగన్ జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్నారనే సంగతి సీపీకి తెలియదా?. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే అంటూ సీపీ మాట్లాడడం సరికాదు. తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి. ఎమ్మెల్యేకు అయితే ఎందుకు మూడువేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు?’ అని ప్రశ్నించారు.
