
నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు తరలివచ్చిన భారీ జనసందోహంలో ఓ భాగం.. , జోరు వానలో తడుస్తూ.. ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
నర్సీపట్నం పర్యటనలో చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు
గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌కి అప్పగిస్తే పేదవాడి వైద్యానికి భరోసా ఎక్కడ?
కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాబార్డు నిధులున్నాయి.. సెంట్రల్ అసిస్టెన్స్ కూడా..
మా హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం
మా హయాంలో రూ.3 వేల కోట్లు ఖర్చు చేసి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం
ఏటా కేవలం రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తే మిగిలినవి కూడా పూర్తవుతాయి.. పేదలకు అందే ఉచిత వైద్యానికీ నిధులు లేవంటారా?
చంద్రబాబూ చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్
ఉత్తరాంధ్రలో వందేళ్లలో 2 మెడికల్ కాలేజీలు ఉంటే.. జగన్ హయాంలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు, 5 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం
2022 డిసెంబర్ 30న నర్సీపట్నం కాలేజీకి శంకుస్థాపన.. ఇదిగో 204 జీవో
స్పీకర్.. ఉన్నత పదవిలో ఉంటూ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెబుతున్నారు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
గ్రామ, వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమం ద్వారా చంద్రబాబు కుట్రలు, మోసాలను ఎండగడతాం
ఈ దారుణాలను గవర్నర్‌కు వివరిస్తాం
రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు రూ.8 వేల కోట్లు. ఇందులో రూ.3 వేల కోట్లను మా హయాంలోనే ఖర్చు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఏటా కేవలం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే.. కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల లాంటి వైద్య కాలేజీల ద్వారా పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. మరి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? అని చంద్రబాబుని అడుగుతున్నా రూ.2 లక్షల కోట్లు అమరావతిలో పెట్టడానికి సిద్ధపడుతూ.. రూ.70 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెబుతున్నారు. మరి కోట్ల మంది పేదలకు మేలు చేస్తూ.. ఉచితంగా వైద్యమందించే మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేమంటూ ప్రైవేటువారికి అమ్మేసే కార్యక్రమం చంద్రబాబు హయాంలో జరుగుతోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయనకు బుద్ధి రావాలని పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అనకాపల్లిలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
‘ఇదిగోనయ్యా..! 2022 ఆగస్టు 8న జారీ చేసిన జీవో నం.204. మెడికల్ కాలేజీ నిర్మాణానికి జీవో ఇవ్వలేదంటూ స్పీకర్ పదవిలో ఉంటూ అబద్ధాలు చెప్పినందుకు ఆ పదవికి నువ్వు అర్హుడివేనా? ఆలోచించుకో...! తప్పుడు మాటలు చెబుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుతో చేతులు కలిపినందుకు తలదించుకోవాలి..’
– నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెం మెడికల్ కాలేజీ వద్ద మీడియాతో వైఎస్ జగన్
నర్సీపట్నానికి సంబంధించిన సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉంటూ... చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతున్నారు. తాను కూడా చంద్రబాబు కంటే నాలుగు ఆకులు తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. స్పీకర్‌కు చెబుతున్నా... అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయడం ఎంత వరకూ ధర్మమని అడుగుతున్నా. క్షమాపణ చెబుతావా? ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అంటారా.. ఇదిగోనయ్యా.. ఆగస్టు 8, 2022న జారీ చేసిన జీవో నం.204. చంద్రబాబు జూన్ 2024లో అధికారంలోకి రాగా సెపె్టంబర్ 3న ఒక మెమో జారీ చేశారు.
మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపాలంటూ మెమో జారీ చేశారు. అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి వదిలేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మెడికల్ కాలేజీలకు నిధులు లేవని చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, స్పీకర్‌కు కూడా చెబుతున్నా. నాబార్డ్ ఫండ్స్ అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టై–అప్ చేశాం. నాబార్డ్ ఫండ్స్ మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కేటగిరీలో ఈ మెడికల్ కాలేజీల్ని చేర్చాం.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను రచ్చబండ సాక్షిగా ప్రజలకు వివరిస్తాం. దీన్ని నిరసిస్తూ శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపడతాం. నవంబరు 24 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందచేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మేం శ్రీకారం చుట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీల్లో మా హయాంలోనే దాదాపుగా ఏడు కాలేజీలు పూర్తి కాగా ఐదు చోట్ల మా ప్రభుత్వంలోనే తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తే, మాకు వద్దంటూ సీఎం చంద్రబాబు లేఖ రాశారు.
పేదలకు చేరువలో ఉచితంగా మెరుగైన వైద్యం కోసం ఉద్దేశించిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాబార్డుతో పాటు కేంద్రం నుంచీ వడ్డీ లేని నిధులను మా ప్రభుత్వంలో టై–అప్ చేశాం. కేవలం ఏటా రూ.1,000 కోట్ల చొప్పున రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ఆ కాలేజీలు పూర్తవుతాయి. అది కూడా చేయలేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగం బాగుపడలేదు. విశాఖలో షాపులను తొలగించి 32 వేల మందిని రోడ్డున పడేశారు. గిరిజన విద్యార్థుల హాస్టళ్లలో మా ప్రభుత్వం ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. ఈ సర్కారు కనీసం ఫిల్టర్లను కూడా మార్చడం లేదు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించడం లేదు. విశాఖ స్టీలు ప్లాంటులో 32 విభాగాలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే స్టీలు ప్లాంట్ కార్మీకులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారు..’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. గురువారం ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంపాలెం మండలం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గత ప్రభుత్వం అసలు జీవో ఇవ్వలేదని... దమ్ము, ధైర్యం ఉంటే దాన్ని చూపించాలంటూ స్పీకర్ విసిరిన సవాల్‌పై ఘాటుగా ప్రతిస్పందించారు. స్థానికంగా ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నత పదవిలో ఉంటూ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఆయనకు ఆ పదవిలో ఉండేందుకు అర్హత ఉందా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారీగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు
కోట్లాది మంది పేదలకు మేలు.. చెంతనే సూపర్ స్పెషాల్టీ వైద్యం
ఈ రోజు ఇక్కడ వెనుక కనిపిస్తున్నవి నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించిన మెడికల్ కాలేజీ నిర్మాణాలు. ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ.. అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు 52 ఎకరాల్లో కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 17 కొత్త మెడికల్ కాలేజీలకు మా హయాంలో శ్రీకారం చుట్టాం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా ఏడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు చేరువలో ఉచితంగా అందుతాయి. ఆ ఆధునిక దేవాలయాల వల్ల ఇది సాధ్యమవుతుంది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తే ఆ ఏడెనిమిది నియోజకవర్గాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవీ పేదవాడిని దగా చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. పక్కనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు వసూలు చేసే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఉచితంగా వైద్యం పేదవాడికి చేరువలో అందుబాటులోకి వస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల దగాకు తెర పడుతుంది. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాల్ని ఎందుకు మూసేస్తున్నారని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం
కోవిడ్ ఇబ్బందుల్లోనూ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు ఖర్చు చేశాం..
గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసేస్తే ఇక వారే నడుపుతారు. అంతా ప్రైవేట్ వాళ్లే ఉంటే.. మరి పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? ఈరోజు ఇక్కడ 52 ఎకరాల్లో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. 2022 డిసెంబర్ 30న ఈ కాలేజీకి శంకుస్థాపన చేశాం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులున్నా, సంక్షోభంలో ఉన్నా ఈ కాలేజీకి రూ.500 కోట్లు ఖర్చు చేశాం.
ఈ కాలేజీ పూర్తయితే 600 బెడ్స్‌తో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ.. సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఇక్కడ అందుబాటులోకి వచ్చేవి. ఈ ప్రాంతమంతటికీ ఇక్కడి మెడికల్ కాలేజీ దిక్సూచీగా ఉండేది. పాయకరావుపేట, తూర్పు గోదావరి పరిధిలోని తుని నియోజకవర్గం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇదే మెడికల్ హబ్ అవుతుంది. ఈ రోజు ఏ ఇబ్బంది వచ్చినా.. విశాఖలోని కేజీహెచ్‌కు వెళ్లాల్సి వస్తోంది. వందల మంది రోగులకు అక్కడ సరిగా వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది.
మెడికల్ సీట్లను.. బాబు వద్దన్నారు
17 కొత్త మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలు మేం అధికారంలో ఉన్నప్పుడే దాదాపుగా పూర్తయ్యాయి. మేం అధికారంలో ఉండగానే 5 మెడికల్ కాలేజీలు పూర్తై తరగతులు కూడా ప్రారంభించాం. 2023–24లోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దాదాపు 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. 3 బ్యాచ్‌లు అడ్మిషన్లు కూడా పొందాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి పాడేరులో 50 సీట్లతో కాలేజీలో క్లాసులు కూడా మొదలైన పరిస్థితులు కనిపించాయి. పులివెందులలో కూడా 50 సీట్లుతో క్లాసులు ప్రారంభించాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇస్తే.. మాకు సీట్లు వద్దు, మెడికల్ కాలేజీ వద్దంటూ చంద్రబాబు వెనక్కి పంపించేశారు.
నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 2022 ఆగస్టు 8వ తేదీన జారీ చేసిన జీవో కాపీని చూపిస్తున్న జగన్
ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా?
రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు రూ.8 వేల కోట్లు. ఇందులో రూ.3 వేల కోట్లను చంద్రబాబు అధికారంలోకి వచ్చే సరికే మా హయాంలోనే ఖర్చు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాం. మరి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? అని చంద్రబాబుని అడుగుతున్నా. సంవత్సరానికి కేవలం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే.. కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల లాంటి వైద్య కాలేజీల ద్వారా పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 2019 నాటికి ఉన్న మెడికల్ సీట్లు కేవలం 2,360 సీట్లు అయితే మరో 2,550 సీట్లు అదనంగా ఈ 17 కాలేజీల ద్వారా సమకూరుతాయి. అంటే రాష్ట్రంలో మొత్తం 4,910 సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి.
ఇటు మన విద్యార్థులకు మెడికల్ సీట్లు.. అటు కోట్లాది మంది పేదలకు చేరువలో సూపర్ స్పెషాల్టీ వైద్యాన్ని ఉచితంగా అందించే ఆధునిక దేవాలయాలివి. ఇవన్నీ చంద్రబాబు దగ్గరుండి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతిలో 50 వేల ఎకరాలు కాదు.. మరో 50 వేల ఎకరాలు సేకరించి.. రూ.2 లక్షల కోట్లు కేవలం అక్కడ కరెంట్, రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తారు. గతంలో 50 వేల ఎకరాలకు ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున మొత్తం రూ.లక్ష కోట్లు కావాలన్నారు. కానీ ఖర్చు చేసింది రూ.4,500 కోట్లు. మళ్లీ ఇవాళ 50 వేలు సరిపోవు.. మరో 50 వేల ఎకరాలు కావాలని తీసుకుంటున్నారు. అంటే ఆ 50 వేల ఎకరాలకు మౌలిక సదుపాయాల కోసం మరో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధ పడుతున్నారు.
ఆర్వో ప్లాంట్ ఫిల్టర్లూ మార్చడం లేదు..
ఇవాళ చంద్రబాబు దారుణ పాలన చూస్తే.. కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో 170 మందికి హెపటైటిస్–ఏ వస్తే వారిని పట్టించుకున్న దిక్కులేదు. జాండిస్ సోకినట్లు సెపె్టంబరు 10న గుర్తించినా జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసం స్క్రీనింగ్ చేపట్టాలన్న ఆలోచన కూడా చేయకపోవడం దారుణం. ఇద్దరు విద్యారి్థనులు చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ చేస్తే.. 170 మందికి పచ్చ కామెర్లున్నాయని తేలింది. నాడు–నేడు మనబడి కింద మన హయాంలో కురుపాం స్కూల్లో ఆర్వో ప్లాంట్ పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం దాని ఫిల్టర్స్ కూడా మార్చడం లేదు. దీంతో అవి నిరుపయోగమయ్యాయి. హాస్టల్ ఆర్వో ప్లాంట్ ఫిల్టర్లు కూడా మార్చలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది.
నర్సీపట్నం మెడికల్ కాలేజీ పూర్తయితే ఎలా ఉంటుందనే నమూనా ఫొటోను చూపిస్తున్న వైఎస్ జగన్
ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు..
దారిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నన్ను కలిశారు. నాడు ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కంపెనీని కాపాడతానని కూటమి నేతలు చెప్పారు. చంద్రబాబు వచ్చిన తర్వాత 32 విభాగాలను ప్రైవేటుపరం చేశారు. వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు. ప్రశ్నిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. జీతాలు కూడా ఇవ్వడం లేదు. వీఆర్‌ఎస్ డబ్బులూ ఇవ్వడం లేదు.
చెరకు రైతుల ఆవేదన పట్టదా?
చెరకు కార్మీకులు కూడా నన్ను కలిశారు. 2014–19 మధ్య ప్రభుత్వం ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేస్తే మేం అధికారంలో ఉన్నప్పుడు రూ.89 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. ఈరోజు ప్రభుత్వం మరో రూ.35 కోట్లు బకాయి పెట్టింది. రైతుల ఆవేదన చంద్రబాబుకి వినిపించడం లేదు.
అందరినీ రోడ్డున పడేస్తున్నారు..!
బల్క్ డ్రగ్స్ కంపెనీ కోసం పక్కనే నక్కపల్లిలో 400 ఎకరాల భూమి ఉన్నా రాజయ్యపేటలో భూముల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. అయినా చంద్రబాబు ఆలకించడం లేదు. మరి వారికి ఎవరు ఊరటనిస్తారు? విశాఖలో చిరు వ్యాపారుల పొట్ట కొట్టారు. 4,500 చిన్న షాపులు తీసేశారు. 32 వేల మంది ఎలా బతుకుతారు? అందరినీ రోడ్డున పడేస్తున్నారు.
చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్...!
ఈరోజు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయి. విద్యార్థులు, రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం. ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ అంటూ మోసాలు చేస్తున్నారు. అన్ని పథకాలు రద్దు చేసేశారు. దీంతో పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, విద్యార్థుల బతుకులు రోడ్డున పడ్డాయి. అయ్యా చంద్రబాబూ.. ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో. ప్రజలకు తోడుగా ఉండు. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు.
నేటి నుంచి రచ్చబండ.. కోటి సంతకాల సేకరణ
చంద్రబాబూ.. మీరు చేస్తున్న పనులకు నిరసనగా రేపటి నుంచి (అక్టోబర్ 10) నవంబరు 22 వరకు గ్రామ, వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు సూపర్‌సిక్స్, సెవెన్ పేరుతో చేసిన మోసాలను కూడా రచ్చబండలో తెలియచేస్తాం. ప్రతి గ్రామం నుంచి 500 సంతకాలు, ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తక్కువ కాకుండా సంతకాలు సేకరిస్తాం. రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాలు సేకరిస్తాం.
అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాలు, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. ఆ తర్వాత నవంబరు 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఆ మర్నాడు నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ఆ సంతకాల పత్రాలు లారీల్లో వస్తాయి. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని వాటన్నింటినీ సమర్పిస్తాం. మాతో కలిసి వచ్చే వారందరినీ కూడగడతాం. చంద్రబాబు ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోవాలి.
వందేళ్లలో ఉత్తరాంధ్రలో వచ్చింది రెండు మెడికల్ కాలేజీలు...
జగన్ హయాంలోనే ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు..
ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు... పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్
1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్న్‌మెంట్ మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. ఉత్తరాంధ్రని తీసుకుంటే 1923లో బ్రిటిష్ వాళ్లు కట్టిన కేజీహెచ్ ఏఎంసీ కాలేజీ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ ఏర్పాటు చేశారు. నాన్న పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ల పుణ్యాన కట్టిన కేజీహెచ్ మాత్రమే ఉన్నాయి. అంటే వందేళ్లలో ఉత్తరాంధ్రలో వచ్చింది రెండు మెడికల్ కాలేజీలు మాత్రమే.
వైఎస్సార్‌సీపీ హయాంలో.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఏకంగా మరో 4 కొత్త మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టాం. విజయనగరం, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాం. ఈ నాలుగింటిలో పాడేరు, విజయనగరం మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే క్లాసులు మొదలయ్యాయి. విజయనగరం కాలేజీ 2023లోనే ప్రారంభమైంది. 2024 ఎన్నికల నాటికి సిద్ధమైన పాడేరు కాలేజీలో కూడా క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ రెండు కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కాగా మరో రెండు కొత్త కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి.
పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ ఫొటోలు, టీచింగ్ కాలేజీ ఫొటోలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా మన కళ్లకు కనిపిస్తోంది. మరోవైపు పలాసలో మనం నిర్మీంచిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా కళ్లెదుటే కనిపిస్తోంది. ఐదు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు తెచ్చాం. సీతంపేట, పార్వతీపురం మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపుగా పూర్తయ్యాయి. ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు జరుగుతుంటే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.