
విశాఖ. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం పర్యటన రేపు(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) యథావిధిగా కొనసాగుతుందని పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, రోడ్డు మార్గాన మెడికల్ కాలేజ్‌కి వెళ్తారని తెలిపారు.
స్టీల్‌ప్లాంట్ మీదుగా వెళ్లేందుకు పోలీసులు రూట్ మార్చారన్నారు. ‘ వైఎస్ జగన్ తన తిరుగు ప్రయాణంలో కేజీహెచ్‌కు వెళ్తారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శిస్తారు. 70 మంది వివిధ హాస్పిటల్స్ లో అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు మరణించారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్ జగన్ బయటకు వస్తున్నారంటేనే చంద్రబాబుకు వణుకు పుడుతుంది.జగన్ పర్యటనకు ప్రజలు రాకుండా భయపెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు కట్టే ఫ్లెక్సీలను అడ్డుకుంటున్నారు.
అరిచేతను అడ్డంపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు. ఆంక్షలుతో వైఎస్ జగన్‌ను ఆపలేరు. మనుషులు ఉండే హాస్పటల్లో నిర్మించలేని చంద్రబాబు పశువులకు హాస్టల్స్ పెడతారట’ అని విమర్శించారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. ‘జగన్ పర్యటనపై పోలీసులు హైడ్రామా నడిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవడానికి వీల్లేదు అంటూ రూటు మార్చారు. మాకు ప్రజా సమస్యల ముఖ్యం. పోలీసుల రూట్ మార్చిన వైఎస్ జగన్ నర్సీపట్నం వెళుతున్నారు. వైఎస్ జగన్ కలవడానికి వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నారు. జగన్ పర్యటనకు లేనిపోని ఆంక్షలు పెట్టారు. 10 కార్లు మాత్రమే కాన్వాయ్ లో ఉండాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా?, రాచరిక పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుంది. జగన్ పర్యటనను ఎంత అణగదొక్కాలని చూస్తే అంత తిరుగుబాటు మొదలవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ, చిరు వ్యాపారుల సమస్యలు ఉన్నాయి’ అని తెలిపారు.