
రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల
పరిశీలకుల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు
మాఫియా వ్యవహారంలా సరఫరా, విక్రయాలు.. పెదబాబు, చినబాబు
అండదండలతో ప్రాంతాలవారీగా ఫ్రాంచైజీలు, వసూళ్లు
ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీనే
అమాయకుల ప్రాణాలు హరిస్తూ కాసుల దందా..
ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల తొలగింపు
ఊరూరా బెల్టు షాపులు, పోలీసు రక్షణతో వేలం పాటలు
తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాండమ్‌గా ఎక్సైజ్ దాడులు
నాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైన్‌షాప్‌లు..
పరిమిత వేళల్లో విక్రయాలు.. లాభాపేక్ష లేకుండా అన్ని రకాల తనిఖీలతో నాణ్యమైన లిక్కర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతున్నాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ దుకాణాలన్నీ మూసివేసిన సీఎం చంద్రబాబునాయుడు ఆయన మాఫియాకు సంబంధించిన ప్రైవేటు దుకాణాలను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. ఊరూరా 70 వేలకుపైగా బెల్టు షాపులను నెలకొల్పి పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మరీ మద్యం దుకాణాలకు వేలం పాటలు నిర్వహించారని దుయ్యబట్టారు.
వేలం పాటలు పాడి డబ్బులు వసూలు చేసి.. మంత్రులకు ఇంత, ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైన పెద్దబాబుకు, చిన్నబాబుకు ఇంత.. అంటూ మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను వారి నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రాణాలను హరిస్తున్నారన్నారు. కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీతో ఒకవైపు భారీగా దోపిడీ చేస్తూ మరోవైపు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు ర్యాండమ్‌గా జరిపిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ డంపులు భారీగా బహిర్గతమయ్యాయన్నారు.
మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి సర్కారు ప్రజా కంటక పాలనపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా, అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ నిర్దేశించారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందజేస్తామన్నారు. సమావేశంలో జగన్ ఏమన్నారంటే.
మద్యం మాఫియా నెట్‌వర్క్
ఇవాళ మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతోంది. మొత్తం వ్యవస్థను తమ కంట్రోల్లోకి తీసుకున్న తరువాత ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతున్నారు. వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూముల్లో పెగ్గుల రూపంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. వేలంపాటలో గ్రామాల్లో బెల్ట్ షాపులు పొందిన నిర్వాహకులు ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు డిస్టిలరీల నుంచి మద్యం సేకరణలో అక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ డిస్టిలరీల నుంచి కాకుండా బాగా డబ్బులిచ్చే (కమీషన్లు) డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్లకు సంబంధించిన సరుకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ వీళ్ల సొంత ఆదాయం పెంచుకునే ఎత్తుగడలు.
నకిలీ లిక్కర్ తయారీదారులు, విక్రేతలు అందరూ టీడీపీ వాళ్లేనని వివరిస్తూ నిందితుడు కట్టా సురేంద్రనాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో ఉన్న ఫొటోలను చూపిస్తున్న వైఎస్ జగన్
నకిలీ మద్యంతో బరి తెగింపు.. బాబు పరిపాలనలో రాక్షసయుగం
బాధ కలిగించే విషయం ఏమిటంటే.. వీళ్ల డబ్బు ఆశ ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. ప్రజలు ఏం తాగినా పర్వాలేదు... చనిపోయినా పర్వాలేదు.. తమ జేబుల్లోకి డబ్బులు ఇంకా ఎక్కువగా రావాలనే తలంపుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షసయుగం నడుస్తోంది. భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల ద్వారా పరిపాలన సాగిస్తున్నారు. నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఆ మాఫియాను కంట్రోల్ చేసే కొందరు కేబినెట్ మంత్రులు, ప్రముఖ రాజకీయ పదవుల్లో ఉన్నవారు, పెద్దబాబు, చినబాబు ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఏకంగా ఫ్యాక్టరీలు నెలకొల్పి క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి వారి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా షాపుల్లోకి, బెల్ట్ షాపుల్లోకి నేరుగా పంపిస్తున్నారు.
ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ.. పరిశ్రమను స్థాపించి యంత్ర పూజ...
మరో విషయం ఏమిటంటే.. ఇవాళ ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిల్. అది తాగి మనుషులు చనిపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్‌రావు, సురేంద్రనాయుడు ఈ నకిలీ మద్యం దందా నడుపుతున్నారు. వీళ్లపై పర్యవేక్షణ బాధ్యతలు మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి అప్పగించారు. ములకలచెరువులో ఏకంగా పరిశ్రమను స్థాపించి పెద్ద సంఖ్యలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాంక్, క్యాన్లు, బాటిళ్లు, మూతలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ లేబుళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. చివరకు దసరాకు అక్కడ యంత్ర పూజ కూడా చేశారు. అంటే అంత పకడ్బందీగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో బయటపడిన నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలోని యంత్రాలు, మద్యం బాటిళ్ల ఫొటోలు చూపిస్తున్న వైఎస్ జగన్
ఒక్కో ఏరియా పంచుకున్నారు.. ఇబ్రహీంపట్నంలో రెండు భారీ డంప్‌లు
అధికార పార్టీ అండతో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు నెలకొల్పి ఒక్కొక్కరు ఒక్కో ఏరియా పంచుకున్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న జనార్దన్‌రావు, సురేంద్రనాయుడు.. నారా లోకేశ్, చంద్రబాబుతో కలసి ఫొటోలు కూడా దిగారు. ఇక్కడ తయారైన నకిలీ సరుకు రాయలసీమలో మద్యం షాపులు, బెల్ట్‌షాపులకు పంపిణీ చేసే బాధ్యతను మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సూçపర్‌వైజ్ చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేందుకు ఇబ్రహీంపట్నంలో ఏకంగా రెండు చోట్ల భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి రవాణా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇబ్రహీంపట్నంలోనే యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లే బాటిళ్లు, లేబుల్స్, మూతలు తయారు చేసుకుంటూ బ్రాండ్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు.
ఎక్కడ చూసినా కార్టన్ బాక్సుల్లో స్పిరిట్ నింపిన డ్రమ్స్, ఖాళీ సీసాలు, బాటిళ్లను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారట. నర్సీపట్నంకు చెందిన నేత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకుంటారు. ఈయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడు. ఏలూరుకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే బాగా దౌర్జన్యం చేస్తాడని ఆయనకు ఉమ్మడి గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పాలకొల్లులో మరో పరిశ్రమ.. అక్కడ కూడా మిషన్, క్యాన్లు, బాటిళ్లు, లేబుల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. అమలాపురంలో కూడా మిషన్లు, కల్తీ మద్యం, బాటిల్స్, లేబుల్స్, మూతలు, స్పిరిట్ అన్నీ అమర్చుకున్నారు. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అనకాపల్లి జిల్లా పరవాడలో పరిశ్రమ ఏర్పాటు చేశారు.
నకిలీ మద్యానికి అమాయకులు బలి..
ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులోని ఓ మద్యం షాపులో లిక్కర్ తాగిన కొద్దిసేపటికే షేక్ చిన్న మస్తాన్ మరణించాడు. జూపూడి వైన్ షాప్‌లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ కిలేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు చనిపోయాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వైన్ షాపులో మద్యం సేవిస్తూ బెల్దారీ పెద్దన్న అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నకిలీ మద్యానికి అమాయకులు బలి అవుతున్నారు (ఆ ఫొటోలను పీపీటీలో చూపారు).
అనకాపల్లి జిల్లా పరవాడలో నకిలీ మద్యం తయారీ నిందితుడు రుత్తల రాము శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడని తెలిపే ఫొటో చూపిస్తున్న వైఎస్ జగన్
దాడుల్లో వేలాదిగా నకిలీ బాటిళ్లు స్వాధీనం..
రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారి పోతున్నారంటే.. సొంత ఆదాయాలు పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానాను లూటీ చేయడంతో సరిపెట్టుకోకుండా అమాయకుల జీవితాలతో చెల గాటమాడుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేస్తున్నారో ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఇబ్రహీంపట్నంలోని గోడౌన్లలో దాడులు చేసి నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్లు, పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో 3,325 లీటర్ల స్పిరిట్‌ను సీజ్ చేశారు. అందులో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 725 బాటిల్స్, క్లాసిక్ బ్లూ 44 బాటిల్స్, కేరళ మాల్ట్ 384 బాటిల్స్, మంజీరా బ్లూ 24 బాటిల్స్.. ఇలా మొత్తం 1,300 బాటిళ్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. లేబుల్స్ లేని 136 కేసులు, 6,578 బాటిల్స్, ఓఏబీ లేబుల్స్ 6,500, ఖాళీ బాటిల్స్ 22 వేలు, ఖాళీ కార్టూన్లు 6, ఒక మిషన్, రెండు పైపులను సీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
నకిలీ మద్యంపై ఆందోళన ఇలా..
ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై పార్టీ పరంగా నిరసనలు తెలియచేయాలి. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం వద్దు, మా ప్రాణాలను కాపాడాలని, అయ్యా చంద్రబాబు... మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్లకార్డులతో ఆందోళనలు చేయాలి. ఇందులో మహిళా విభాగాన్ని కూడా భాగస్వామిగా చేయాలి. మద్యం సేవించే వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పేదల ప్రాణాలతో ఆటలాడతారా అంటూ కల్తీ మద్యంపై నిరసనలు తెలియచేయాలి. నియోజకవర్గ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలి.
నాడు.. పరిమిత వేళల్లో క్వాలిటీతో విక్రయాలు..
మన ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లిక్కర్ ప్రఖ్యాతి గాంచిన డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్ జరిగేది. అది కూడా అంతకు ముందు ప్రభుత్వం ఎంపిక చేసిన 20 డిస్టిలరీల నుంచే సేకరించాం. పూర్తి క్వాలిటీ చెక్ తర్వాత, దారి తప్పకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాలకు వచ్చేవి. అప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది కాబట్టి ఇష్టారీతిన కాకుండా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పరిమితంగా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. మద్యం షాపులను 2,934కి తగ్గించాం. అక్రమ పర్మిట్ రూములతోపాటు 43 వేల బెల్టుషాప్‌లను పూర్తిగా రద్దు చేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపించడం వల్ల ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదు. నాడు సరఫరా చేసిన లిక్కర్ బాటిళ్ల మీద క్యూఆర్ కోడ్ ఉండేది. వాటిని స్కాన్ చేసి అమ్మేవారు. అందువల్ల క్వాలిటీ నూటికి నూరు శాతం ఉండేది.