
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం పర్యటనపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. మళ్లీ తమ కుట్రలకు తెరతీసిన ప్రభుత్వ పెద్దలు.. ఎల్లుండి( గురువారం,అక్టోబర్ 9) నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అనకాపల్లి ఎస్పీ తువీన్ సిన్హాతో చంద్రబాబు సర్కార్ ప్రకటన చేయించారు. గతంలోనూ జగన్ పర్యటనలకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.
ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లినా ఏదో సాకు చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి రైతుల సమస్యలపై పోరాడినా ఆంక్షలే.. ఇప్పుడు మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్నా అడ్డంకులే పెడుతోంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పర్యటన ఆగేది లేదని వైఎస్సార్‌సీపీ తేల్చి చెప్పింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లి తీరుతామని స్పష్టం చేసింది.
ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్లనున్న వైఎస్ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్‌ను కలవడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవర్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు సిద్ధమయ్యారు. బాధితులను వైఎస్ జగన్‌ను కలవనీయకుండా ప్రభుత్వం చేస్తోంది. పోలీస్ ఆంక్షలతో వైఎస్ జగన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.