
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సమీపంలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ కడుతున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు కుయుక్తులు
సమావేశమని రప్పించి ఆటోవాలాలకు పోలీసుల హెచ్చరికలు.. వైఎస్సార్‌సీపీ నేతలకు ఫోన్లు.. స్టేషన్‌కు రావాలంటూ వేధింపులు
నిర్బంధించి హౌస్ అరెస్ట్‌లు చేసేందుకు పథకం
వందల మంది పోలీసులతో నిండిపోయిన మాకవరపాలెం
ఎన్ని ఆంక్షలు విధించినా జనవాహినిని ఆపలేమని పసిగట్టి సర్కారు బెంబేలు
పర్యటన స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం మీదుగా వెళ్లకుండా అడ్డంకులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన, ప్రజా ఉద్యమం కార్యక్రమాలను అడ్డుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు కుటిల యత్నాలు పన్నుతోంది. గురువారం నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రజలను తరలించవద్దంటూ ఆటోవాలాలు, పార్టీ నేతలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు పోలీస్‌స్టేషన్ల నుంచి ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు.
అనకాపల్లి టౌన్, రూరల్, కశింకోట, యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, నర్సీపట్నం టౌన్, రూరల్, చోడవరం టౌన్ పోలీసుల నుంచి పార్టీ నేతలకు బెదిరింపు కాల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, మండల, గ్రామ స్థాయి నాయకులను హౌస్ అరెస్ట్‌లు చేసేందుకు పథకం వేసినట్లు తెలుస్తోంది. మాకవరపాలెం మండల కేంద్రం ఇప్పటికే వందల మంది పోలీసులతో నిండిపోయింది. విశాఖ విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో ప్రయాణించి నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. అనంతరం ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడనున్నట్లు పార్టీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు.
అయితే రోడ్డు మార్గంలో అనుమతి ఇవ్వలేమని ఒకసారి.. హెలికాప్టర్‌లో వెళ్లాలంటూ మరోసారి.. ఫలానా మార్గంలోనే వెళ్లాలంటూ ఇంకోసారి.. ఇలా ఎప్పటికప్పుడు చంద్రబాబు సర్కారు అడ్డంకులు సృష్టిస్తోంది. అయితే వైఎస్ జగన్ పర్యటన ముందుగా ప్రకటించిన ప్రకారం యథాతథంగా సాగుతుందని వైఎస్సార్‌సీపీ స్పష్టంగా ప్రకటించడంతో చివరకు పలు షరతులు,ఆంక్షలు విధిస్తూ అనుమతించారు. ఎన్ని షరతులు విధించినా జనం వెల్లువలా తరలివస్తారని గ్రహించడంతో ప్రజలను తరలించకుండా అడ్డుకునే యత్నాలకు దిగినట్లు తెలుస్తోంది. ఆటోవాలాలను పిలిపించి గురువారం జగన్ పర్యటనకు జనాలను తరలించవద్దంటూ పోలీసుల ద్వారా సర్కార్ హెచ్చరిస్తోంది.
వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు ఫోన్ కాల్స్..
ఒకవైపు పర్యటనకు అనుమతి లేదంటూ తొలుత బెదిరింపులకు దిగిన పోలీసులు తర్వాత కొత్త మార్గంలో వెళ్లాలంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రజలను తరలించకుండా ఇప్పటికే ఆటోవాలాలను బెదిరించిన పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి వైఎస్సార్‌సీపీ నేతలకు ఫోన్లు చేయడం గమనార్హం. మీరెక్కడ ఉన్నారు? సీఐ పిలుస్తున్నారు.. వచ్చి కలవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారు. ఎంత చేసినా జగన్ పర్యటనను, జన వాహినిని అడ్డుకోలేమని గ్రహించడంతో ఫ్లెక్సీల వ్యూహాన్ని ఆశ్రయించారు.
జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకపోవడం గమనార్హం. కూటమి నేతల ఫ్లెక్సీలు రోజుల తరబడి అలానే దర్శనమిస్తుండగా.. వైఎస్సార్ సీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 500 మందికి మించి గుమికూడవద్దంటూ ఆంక్షలు విధించడంతోపాటు అసలు ఫ్లెక్సీలు కట్టవద్దంటూ షరతులు విధిస్తున్నారు. అభిమానాన్ని చాటుకునేందుకు కూడా ఆంక్షలేమిటంటూ ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో షరతులు, బెదిరింపులు చూడలేదని పేర్కొంటున్నారు.
కళ్ల ముందే కనిపిస్తున్నా...
రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 5 నూతన వైద్య కళాశాలలు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీలో 50 మంది విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ అనుమతులిచ్చినా బాబు సర్కారు కుట్రపూరితంగా అడ్డుకుని వద్దంటూ లేఖ రాసింది. ఇవి రెండూ గత ప్రభుత్వ హయాంలోనే అన్ని వసతులతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్సార్ సీపీ హయాంలోనే చేపట్టగా ఇప్పటికే 60 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి.
ఇదంతా కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం రాగానే పనులను పూర్తిగా నిలిపివేసింది. అసలు మెడికల్ కాలేజీలకు అనుమతులే లేవంటూ చంద్రబాబు మొదలు మంత్రుల వరకూ అంతా బుకాయించగా నేషనల్ మెడికల్ కమిషన్ ఈ దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. దీంతో ప్రభుత్వ పెద్దలు కొత్త రాగం అందుకున్నారు. పీపీపీ పాట పాడుతూ విలువైన సంపద లాంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెడికల్ విద్య అందుబాటులోకి రావడంతో పాటు పేదలకు చేరువలో సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు అందించే ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి సర్కారు ప్రైవేట్ చేతుల్లో పెట్టి వ్యాపారానికి సిద్ధం కావడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవకుండా...
విమానాశ్రయం నుంచి గాజువాక, అనకాపల్లి మీదుగా వైఎస్ జగన్ పర్యటన సాగితే మధ్యలో స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం గుండా వెళుతుంది. అక్కడ భారీ సంఖ్యలో స్టీల్‌ప్లాంట్ కార్మికులు తరలివచ్చి తమ ఆక్రోశం, ఆవేదనను నేరుగా వైఎస్ జగన్‌కు విన్నవించే అవకాశం ఉందని కూటమి సర్కారు ఆందోళన చెందుతోంది. దీంతో కుటిల బుద్ధితో రూటు మార్చేసింది. ప్రధాన రహదారి గుండా వెళ్లకుండా ఎన్‌ఏడీ, పెందుర్తి మీదుగా పర్యటనకు అనుమతిచ్చారు. చంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, గొంతు నొక్కడంపై స్టీల్‌ప్లాంట్ కార్మికులతో పాటు ప్రజలందరూ మండిపడుతున్నారు. స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలపై కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌లో 32 విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు (ఈవోఐ) ఆహ్వానించడం గమనార్హం. ఇక స్టీల్‌ప్లాంట్ కార్మికులకు సుమారు 4 నెలల వేతనం పెండింగ్‌లో ఉంది.