
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని పోలీసు స్టేషన్‌ను టీడీపీ కార్యాలయంగా మార్చిన కూడేరు సీఐ రాజును సస్పెండ్ చేయాలని వైఎస్సార్‌సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య అని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ రాజు వేధింపులకు పాల్పడుతున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ తొత్తుగా కూడేరు సీఐ రాజు వ్యవహరిస్తున్నారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య. కూడేరు సీఐ రాజు ఖాకీ చొక్కా తీసేసి పచ్చ చొక్కా వేసుకుంటే మంచిది. మంత్రి పయ్యావుల కేశవ్ వర్గీయులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు.
ఉరవకొండ నియోజకవర్గంలోని సీఐ, ఎస్‌ఐలకు ముడుపులు ఇస్తున్నారు. మంత్రి పయ్యావుల లంచాలకు అలవాటు పడ్డ సీఐ రాజు.. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూడేరు సీఐ రాజుపై ఎస్పీ, డీఐజీకి ఫిర్యాదు చేస్తాం. కూడేరు సీఐ రాజును వెంటనే సస్పెండ్ చేయాలి’ అంటూ విమర్శలు చేశారు.