
టీడీపీ కార్యకర్త కంటే దిగజారి ప్రవర్తిస్తున్న కూడేరు సీఐ
సర్కిల్ పరిధిలో మితిమీరిన దౌర్జన్యాలు
వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేసి మరీ వేధింపులు
‘పచ్చ’ కండువా వేసుకుంటే అంతా ఓకే అంటున్న వైనం
‘అయ్య’ ఆదేశానుసారం ఇష్టారాజ్యంగా విధులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఏరా నా లిమిట్స్‌లో బోర్ వేస్తావా? నీకెంత ధైర్యం. మర్యాదగా బండి స్టేషన్‌లో పెట్టు. అయ్య చెబితే బండి వదుల్తా. మర్యాదగా ‘పచ్చ’ కండువా వేసుకో.. లేదంటే అంతు చూస్తా...’ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు సర్కిల్ పోలీసుస్టేషన్‌లో సీఐగా పనిచేస్తున్న రాజు అన్న మాటలివి. టీడీపీ కార్యకర్త కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్న ఈయన అరాచకాలు పెచ్చుమీరిపోయినట్లు విమర్శలొ స్తున్నాయి. ఫలానా వ్యక్తి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే చాలు టార్గెట్ చేసి మరీ టార్చర్ పెట్టడం సీఐకి అలవాటుగా మారిపోయింది.
బోర్‌వెల్ వేయడానికి నీకెంత ధైర్యం..
కూడేరు మండలం మరుట్ల–1 కాలనీకి చెందిన శ్రీనివాసులు అద్దెకు బోర్‌వెల్ బండి తెచ్చుకున్నాడు. ఇతను వైఎస్సార్ సీపీ అభిమాని. ఇటీవల ఉదిరిపికొండ గ్రామ సమీపంలోని ఓ పొలంలో బోర్ వేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ రాజు.. అక్కడికి కానిస్టేబుళ్లను పంపించి లారీని స్టేషన్‌కు రప్పించారు. ఈ క్రమంలో శ్రీనివాసులపై రెచ్చిపోయారు. ‘మర్యాదగా పయ్యావుల శీనప్ప దగ్గరికి వెళ్లు.. అక్కడి నుంచి ఫోన్ చేయిస్తే నీ బండి వదులుతా. అక్కడే పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా’ అంటూ అతన్ని బెదిరించారు. అంతటితో ఆగక ఆర్టీఓను పిలిపించి రూ.60 వేల ఫైన్ వేయించారు. మరో రూ.50 వేల లంచమూ తిన్నారు! చివరకు ఆ బోర్‌వెల్ బండిని టీడీపీ కార్యకర్తకు అద్దెకు ఇప్పించడం గమనార్హం.
నా అనుమతి లేకుండా పాలు సేకరిస్తావా..?
మరుట్ల–3 కాలనీకి చెందిన రామాంజనేయులు ‘దొడ్ల’ డెయిరీ కంపెనీకి గ్రామంలో పాల సేకరణ చేసేవాడు. సీఐ దాన్ని పీకేయించి పాలసేకరణకు ఆటోలు రాకుండా ఆపించారు. సేకరణ బాధ్యతలు టీడీపీ కార్యకర్తకు ఇప్పించారు. ఈ క్రమంలోనే రామాంజనేయులు ‘గాయత్రి’ డెయిరీ పాల సేకరణకు వెళ్లగా.. ‘ఏరా ఒకసారి ఆపితే వేరే కంపెనీకి పాలు సేకరిస్తావా’ అంటూ బెదిరించి బలవంతంగా దాన్ని కూడా ఆపేయించారు. సదరు డెయిరీకి సంబంధించిన ఆటో డ్రైవర్‌ను కూడా బెదిరించి ఊర్లోకి రాకుండా చేశారు. దీంతో రామాంజనేయులు ఉపాధి కోల్పోయాడు. అంతేకాదు సీఐ ఎప్పుడేం చేస్తారో అని ఇప్పటికీ అతను భయపడుతున్నాడు.
దళిత రైతుకు చుక్కలు..
కూడేరు మండలంలో ధనుంజయ అనే రైతు తన పొలానికి ట్రాన్స్‌ఫార్మర్ బిగించుకున్నాడు. అదే సర్వీసు కింద మరో మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ధనుంజయ వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో విద్యుత్ శాఖ ఏఈతో ఓ తప్పుడు ఫిర్యాదు ఇప్పించిన సీఐ.. కానిస్టేబుళ్లను పంపించి డీపీని పీకేయించారు. జీపులో పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీ సుల జీపునకు ధనుంజయ భార్య అడ్డుపడినా ఆమెను పక్కకు లాగేసి మరీ ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుకొచ్చారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు సీఐ రాజు అరాచకాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. కొన్ని రోజుల క్రితం చోళసముద్రం గ్రామంలో టీడీపీ కార్యకర్త నిర్వాకంతో కరెంటు పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు ఇచ్చినా ‘తెలుగు తమ్ముడి’పై కేసు నమోదు చేయలేదంటే అధికార పార్టీకి సీఐ ఎంతలా కొమ్ము కాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.