సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి మండిపడ్డారు. లోకేష్ 4 గంటల్లో 4వేల దరఖాస్తులు తీసుకున్నారని ఎల్లోమీడియా రాసింది. పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలు నమ్ముతారో లేదో తెలుసుకోరా? అని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ల విషయంలోనూ దారుణంగా మోసం చేశారు. 5 లక్షల మంది పెన్షన్ దారులను తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు’’ అంటూ నిలదీశారు.
‘‘రైతులపై తుపాను దెబ్బ కొడితే వారిని ఆదుకోవాల్సిందిపోయి గాలికి వదిలేశారు. చంద్రబాబు లండన్, లోకేష్ క్రికెట్ చూడటానికి వెళ్లారు. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?. గూగుల్ సెంటర్ వల్ల లక్షా 80 ఉద్యోగాలు వస్తాయని పబ్లిసిటీ ఇస్తున్నారు. నిజానికి పదివేల ఉద్యోగాలైనా తెప్పించగలరా?. ఆరోగ్యశ్రీ లేక జనం అల్లాడిపోతుంటే పట్టించుకోరా?. ఏ ఆస్పత్రిలోనూ ఆరోగ్యశ్రీ అమలు కావటం లేదు. రాష్ట్రంలో రైతులు బతకటమే కష్టం అన్నట్టుగా మారింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు టమోట, మామిడి, ఉల్లి పంటలను రోడ్డు మీద కాలువల్లో పడేసే దుస్థితి నెలకొంది.
..అన్ని వర్గాల ప్రజలు అసహనంతో ఉన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సమస్యలతో జనం ఉంటే చంద్రబాబు లండన్‌లో విహరిస్తారా?. లులూ మాల్ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేస్తారా?. అందులో పెద్ద స్కాం ఉందన్న సంగతి సాధారణ ప్రజలకు కూడా తెలుసు. వైఎస్ జగన్ 18 సార్లు ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నిస్తే ఒక్క దానికీ సమాధానం చెప్పలేదు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్క జడ్పీటీసీ అయినా గెలవగలరా?. జగన్ సీటు ఇస్తే గెలిచి తర్వాత పార్టీ మారిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?

..పోలీసులను అడ్డం పెట్టుకుని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి వీరుడిలాగ మాట్లాడతావా?. పోలీసులు లేకుండా ఒక్క సీటైనా గెలవగలరా?. అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. మహిళా క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదు?. మిగతా అన్ని రాష్ట్రాల క్రికెటర్‌లకు ఆయా ప్రభుత్వాలు కోటి చొప్పున పారితోషికం ఇచ్చాయి. ముంబాయి వెళ్లి క్రికెట్ చూసిన లోకేష్ ఎందుకు శ్రీచరణికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు?. నకిలీ మద్యాన్ని బయట పెట్టారనే జోగి రమేష్ ని అరెస్టు చేశారు. బెల్టు షాపులోని మద్యనే బస్సు ప్రమాదానికి కారణమన్నందుకు మా పార్టీ నేత శ్యామలాకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఏ గ్రామానికి వచ్చినా బెల్టుషాపును చూపిస్తా’’ అంటూ సతీష్‌రెడ్డి సవాల్ విసిరారు.


