సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రులు పయనిస్తున్నారని, ప్రజల గురించి ఆలోచించడం మానేసి తమ జేబులు నింపుకునే కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు శాంతిభద్రతలు నిర్వీర్యమయ్యాయి.. మరో వైపు ప్రజారోగ్యం పడకేసింది, ఇంకోవైపు ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు కుదేలవుతున్నారని, అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా అనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..
రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కుప్పకూలిపోయింది. మోస్ట్ సీనియర్ అంటూ డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు అత్యంత దారుణమైన, దుర్మార్గ పాలన సాగిస్తున్నాడు. సమకాలీన రాజకీయాల్లో ఇంతటి దరిద్రమైన పరిపాలనను ప్రజలెవ్వరూ చూసి ఉండరు. ఈ ప్రభుత్వంలో జనానికి జ్వరాలు వస్తే నేనేం చేయాలని ఒక మంత్రి అంటారు, లా అండర్ ఆర్డర్ లేదంటే.. మరొక మంత్రి నేనేమైనా లాఠీ పట్టుకోవాలా? తుపాకీ పట్టుకోవాలా? అని మండిపడతారు. అన్ని సమస్యలూ మా శాఖలోనే వచ్చేశాయి, మేమే చేయలేకపోతున్నామని మరొక మంత్రి అంటాడు.
డబ్బుల్లేవు... మేం మెడికల్ కాలేజీలు ఎలా కట్టాలి? అని మరొక మంత్రి మాట్లాడతాడు. మంత్రులే ఇలా మాట్లాడితే ఇక ప్రజల సమస్యలను కింది స్థాయిలో పట్టించుకునే వారు ఎవరూ? ఎవరికైనా బాధ్యత అనేది ఉందా? మంత్రులు ఇలా మాట్లాడుతున్నారంటే.. ఇవి వారి మాటలుగా మనం చూడాల్సిన అవసరంలేదు. ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి ఇంటర్నెల్‌గా ఏం మాట్లాడుతున్నాడో… ఆ మాటలే వీరి నోటినుంచి కూడా వస్తున్నాయి. ఇలా వ్యవస్థలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారు.
వ్యవస్థలను సర్వ నాశనం చేశారు
ఒక వైపు పీహెచ్‌సీ డాక్టర్ల ఆందోళనతో గ్రామస్థాయిలో వైద్య సేవలు కుటుంపడ్డాయి. మరోవైపు ఆరోగ్య శ్రీ బకాయిలతో, నెట్‌వర్క్ ఆసుపత్రులు వైద్యసేవలు నిలిపివేయడంతో పేదరోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షల మంది ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఇంకోవైపు ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరోవైపు విలేజ్ క్లినిక్స్‌ను నిర్వీర్యం చేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన ఒక్క ఆరోగ్య రంగంలోనే ప్రస్తుతం ఇన్నిరకాల సమస్యలు ఉన్నాయి. వీటిని సత్వరం పరిష్కరించాల్సిన మంత్రి ఎదురుదాడి చేస్తున్నాడు. హేళనగా మాట్లాడుతున్నాడు. రాజకీయం చేస్తున్నాడు. కాని ప్రజలకు వైద్య సేవలను అందించడంలో మాత్రం శ్రద్ధచూడంలేదు. మరి ఇలాంటి వాళ్లు మంత్రులుగా ఉండడానికి అర్హులా? మంత్రికి పట్టదు, ముఖ్యమంత్రికి పట్టదు. మరి ఎవరికి పడతాయి ఈ సమస్యలు? దీన్ని పరిపాలన అంటామా? దీన్ని ప్రభుత్వం అంటామా? లేక వల్లకాడు అంటామా? పౌరుల ప్రాణాలు రక్షించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు? అలాంటి పనికిమాలిన ప్రభుత్వంగా మార్చిన ముఖ్యమంత్రిని, ఆయన మంత్రులను ఏమంటారు?
రాష్ట్రంలో అరాచకాలకు రెడ్‌బుక్ రాజ్యాంగంతో దన్ను
రెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి… పొలిటికల్ గవర్నెన్స్ పేరు చెప్పి, వీధికో రౌడీని, అరాచకవాదిని తయారు చేశారు. మొన్న తునిలో ఘటన చూసినా.. మరో చోట చూసినా.. దీనికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్సే. ఇందులో ఎవరో ఒకర్ని పట్టుకుని, లేపేసి, ఖబడ్దార్ అంటూ ప్రచారంచేసుకుని, చేతులు దులుపుకుంటున్నారు. మరి మిగతా వారి సంగతి ఏంటి? లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు? ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్న పేకాట శిబిరాలు, సివిల్ పంచాయతీలపై డిప్యూటీ సీఎం నేరుగా డీజీపీకి కంప్లైంట్ చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో దీనికి నిదర్శనం.
పైగా ఈ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమ ప్రాంతంలో పేకాట సర్వసాధారణమే అంటూ సమర్థించుకోవడాన్ని ఏమనుకోవాలి? ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు, లిక్కర్ షాపుల అభివృద్ధి తప్ప మరేమీ జరగలేదు. నేరుగా మీ ప్రభుత్వంలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, వాటిని అడ్డుకోలేకపోతున్నారని ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేస్తే.. సీఎంగా చంద్రబాబు తల ఎక్కడపెట్టుకోవాలి? ఇదేనా గవర్నెన్స్ అంటే?
మీ అక్రమాలపై మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు
మరోవైపు తిరువూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏకంగా ఎంపీ కేశినేని చిన్ని అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడని, ఇసుక ఎత్తుకు పోతున్నారని, డబ్బులు పంచి కౌన్సిలర్లను కొనుగోలు చేశారని ఏకంగా పెద్ద అవినీతి బాగోతం బయటపెట్టారు. తన అసెంబ్లీ సీటు కోసం కోట్ల రూపాయలు ఇచ్చానంటూ సాక్ష్యాలు చూపించాడు. ఇంత బాగోతం బయటపెట్టినా… ప్రభుత్వం ఏమీ జరగనట్టు ఉంది. మరి అంతటి అవినీతి ప్రభుత్వ కొనసాగాల్సిన అవసరం ఉందా? వీళ్లు పరిపాలించడానికి అర్హులేనా?
విదేశాల్లో జల్సాలు... ప్రజా సమస్యలు గాలికి..
రాష్ట్ర ముఖ్యమంత్రి విమాన మెక్కి దుబాయ్ పోతారు. మరొక షాడో సీఎం నారా లోకష్ విమానమెక్కి సూటు, బూటు వేసుకుని ఆస్ట్రేలియాలో తిరుగుతాడు. ఇంకొకరు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఎక్కడున్నాడో తెలియదు. ఆయన సినిమాలు ఆయనవి. సీఎం, డిఫ్యాక్టో సీఎంలు వారంలో రెండు రోజులు కనిపించరు. ఇక డిప్యూటీ సీఎం అయితే వారంలో రెండు రోజులుకూడా విజయవాడలో ఉండేది కష్టమే. ఒకవేళ ఉన్నా.. ఉదయం వచ్చి.. మళ్లీ సాయంత్రానికల్లా జంప్. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపేతీరు. ఇదేనా పరిపాలన. అసలు ప్రజలంటే మీకు గౌరవం ఉదా? ప్రజాసమస్యల పట్ల ఏ మాత్రం అయినా బాధ్యత ఉందా?
భారీ వర్షాలపై వ్యవసాయశాఖను అప్రమత్తం చేసే పరిస్థితే లేదు
భారీ వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సీజన్ చివరది దశకు వచ్చిన వరి దెబ్బతింది. పత్తిరైతులు నిండా మునిగారు. ఉల్లిరైతులు ఏడుస్తున్నారు. ఇలా ప్రతి చోటా ఇవే ఇబ్బందులు. రబీ సీజన్‌కు విత్తన సరఫరాపై ఇప్పటివరకూ ఉలుకూ పలుకూ లేదు. మరోవైపు ప్రతివారం అల్పపీడనమో, వాయుగుండమో వస్తోంది, ఇంకోవైపు తుపాను రాబోతోంది. ఇలాంటి అత్యంత ముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వం ఏంచేస్తోంది? అసలు వ్యవసాయశాఖ మంత్రి పనిచేస్తున్నారా?
లంచాల కోసం మధ్యవర్తిత్వం చేయలేదని, తన కింది అధికారులను బదిలీచేయడం మినహా చేసింది ఏముంది? జనాభాలో 60 శాతం మంది ఆధారపడి ఉన్న ఈ రంగం మీద ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదంటే, అసలు వ్యవసాయం తన బాధ్యత కాదన్నట్టుగా చంద్రబాబు, ఆయన మంత్రులు బిహేవ్ చేస్తుంటే.. ఇక కిందనున్న అధికారులు ఏం పనిచేస్తారు? ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి మీరేం చేస్తారు?
రైతులను నిలువునా దగా చేయడమేనా చంద్రబాబు విజనరీ?
చంద్రబాబు తానేదో పెద్ద విజనరీనంటూ, రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తానని చెప్పుకుంటూ గతంలో మేం అమలు చేసిన అన్ని విధానాలన్నింటినీ ఆపేశారు. ఉచిత పంటల బీమా రద్దుచేశారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. సున్నా వడ్డీ పంటరుణాలు నిలిపేశారు. ఆయన కొత్తగా ఏమీ చేయడం లేదు సరికదా… సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతుల గొంతు కోశారు. వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఇవన్నీ ప్రభుత్వంచేసిన హత్యలే. ఏరోజైనా ఏ రైతు కుటుంబాన్నానైనా పరామర్శించారా? ఒక్క రూపాయి పరిహారం ఇచ్చారా? అసలు మీది ప్రభుత్వమేనా? ఫీజురియింబర్స్‌మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ఫీజులు కట్టుకోలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలు అంటు రోగాలతో చనిపోతున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్య 5 లక్షల తగ్గింది. ఇన్న సమస్యలు పెట్టుకుని, ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, వారిని ఆదుకోవాల్సింది పోయి.. ఇంత దారుణంగా పరిపాలన చేస్తారా?
రాష్ట్రంలో ఎనీటైం మద్యం
కర్నూలు బస్సు దగ్ధం ఘటనకు కారణమైన బైక్ ను నడిపిన యువకుడు ప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలోని బెల్ట్ షాప్‌లో అర్థరాత్రి మద్యం సేవించి, బైక్ నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అర్థరాత్రి వరకు బెల్ట్‌షాప్‌ల్లో మద్యం విక్రయాలు జరుపుతుండటం వల్ల నేడు ఒక భయంకరమైన ప్రమాదానికి కారణమైందనే ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలుగుదేశం నాయకులే నకిలీ మద్యాన్ని తయారు చేసి, గ్రామ గ్రామానికి బెల్ట్‌షాప్‌లకు సప్లై చేస్తున్నారు. నకిలీ మద్యం గుప్పిట్లో అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఏపీలో ఏ సమయంలో అయినా మద్యం లభించే పరిస్థితిని కల్పించారు.


