
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని.. వారి కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నకిలీ మద్యంలో పవన్ కళ్యాణ్‌కీ భాగస్వామ్యం ఉందని.. అందుకే ఆయన దీనిపై నోరు మెదపటం లేదన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పవన్‌కు కనపడటం లేదా? అంటూ పోతిన మహేష్ నిలదీశారు.
‘‘కొత్తగా తెచ్చిన క్యూ ఆర్ కోడ్ కంటితుడుపు చర్య మాత్రమే. రాష్ట్రంలో వైన్ షాపులన్నీ టీడీపీ నేతలవే. వారందరికీ నకిలీ మద్యంలో ప్రమేయం ఉంది. అలాంటప్పుడు క్యూ ఆర్ కోడ్ వలన ఏం ప్రయోజనం ఉంటుంది?. అసలు క్యూ ఆర్ కోడ్ పెట్టటం అంటే రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టు చంద్రబాబు అంగీకరించినట్టే.. అందుకే ఇప్పుడు వైన్ షాపుల్లో క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నారు. నకిలీ మద్యంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోంది, వేల కోట్ల రూపాయలు దోపిడీకి టీడీపీ పెద్దలు ప్లాన్ చేశారు. నకిలీ మద్యాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పటం లేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు.
‘‘ప్రజలను మభ్య పెట్టటానికే క్యూ ఆర్ కోడ్ ప్రకటన చేశారు. స్మార్ట్ ఫోన్‌లు పేద ప్రజలందరి దగ్గర ఎలా ఉంటాయి?. వారు నకిలీ మద్యాన్ని ఎలా గుర్తిస్తారు?. బెల్టు షాపులు, పర్మిట్ రూములు పెట్టి గత 16 నెలలుగా దోపిడీ చేశారు. ఈ పర్మిట్ రూములలో పెగ్గుతో పాటు, ఫుడ్, బెడ్‌కి కూడా అవకాశం కల్పించారు. నకిలీ మద్యాన్ని ప్రోత్సాహించటానికే పర్మిట్ రూములకు అవకాశం ఇచ్చారా?. లూజుగా మద్యం విక్రయిస్తే అది నకిలీదో మంచిదే ఎలా తెలుస్తుంది?. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం షాపులన్నీ ప్రభుత్వ ఆదీనంలో నడిచాయి. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. డిస్టలరీస్ నుండి షాపుల వరకు అన్ని పాయింట్లలోనూ చెకింగ్ జరిగేది. అందువలన ఎక్కడా నకిలీ మద్యానికి ఆస్కారం లేదు

..ఇప్పుడు టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ములకలచెరువు, అనకాపల్లి, ఏలూరులో భారీగా నకిలీ డంపులు బయట పడ్డాయి. ఇంత జరిగినా వైన్ షాపులలో ఎందుకు తనిఖీలు చేయట్లేదు?. రాష్ట్ర ప్రజలందరికీ ఏపీలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అర్థం అయింది. పవన్ కళ్యాణ్ ఈ నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. అనేక మంది చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు?. పవన్‌కు కూడా నకిలీ మద్యంలో భాగస్వామ్యం ఉంది. అందుకే ఆయన మాట్లాడటం లేదు’’ అంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు.