చంద్రబాబు ధ్యాసంతా అదే..: వైఎస్‌ జగన్‌ | Ysrcp Key Meeting: Ys Jagan Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ధ్యాసంతా అదే..: వైఎస్‌ జగన్‌

Oct 7 2025 2:40 PM | Updated on Oct 7 2025 4:02 PM

Ysrcp Key Meeting: Ys Jagan Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ(మంగళవారం, అక్టోబర్‌ 7) తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండేళ్లు కావొస్తోందని.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు.

‘‘ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోంది. జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదు. పూర్తిగా పాలన గాడితప్పింది. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే వీళ్ల ధ్యాస. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీలు.. వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. దోచుకో.. పంచుకో.. తినుకో.. కనిపిస్తోంది’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

‘‘అక్రమాలకు అవకాశం లేకుండా మన హయాంలో లిక్కర్‌ పాలసీ ఉండేది. క్వాలిటీ విషయంలో ఏరోజు కూడా రాజీ పడలేదు. లిక్కర్‌ కొనుగోలు ఎంపానెల్‌ డిస్టలరీస్‌ నుంచే కొనుగోలు. ప్రతికోటా క్రమం తప్పకుండా క్వాలిటీ చెక్‌ చేసేవాళ్లు. క్వాలిటీ చెక్‌ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లోకి లిక్కర్‌. నిర్దిష్టమైన సమయాల్లోనే మాత్రమే లిక్కర్‌ అమ్మేవాళ్లం. షాపులు తగ్గించి, బెల్టుషాపులు ఎత్తివేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిర్వహించింది. ఇల్లీగల్‌ పర్మిట్ రూమ్స్‌ రద్దు చేశాం. మూడింట ఒక వంతు షాపులు తగ్గించాం. మన హయాంలో ప్రతి బాటిల్‌పైన క్యూ ఆర్‌కోడ్‌ ఉండేది. ప్రతి బాటిల్‌ అమ్మేటప్పుడు క్యూ ఆర్‌కోడ్‌ స్కాన్‌ చేసి అమ్మేవాళ్లు. నూటికి నూరుశాతం క్వాలిటీతోనే మద్యం అమ్ముడుపోయేది.

..కాని, రాష్ట్రంలో ఇప్పుడు కల్తీ లిక్కర్‌ మాఫియా నడుస్తోంది. దీనికోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారు.. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మాఫియాకు ప్రైవేటు దుకాణాలు అప్పగించారు. వేలం పాట నిర్వహించి.. బెల్టుషాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్‌. ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైనున్న పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత అని పంచుకుంటున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లీగల్‌గా ఆదాయాలు పెంచుకోవడానికి తెరలేపారు. వీరికి సంబంధించిన షాపుల నుంచి తమకు కావాల్సిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నారు, ఇదోరకం మాఫియా.

చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు: వైఎస్ జగన్

..ఇదికాక మరో రకం మాఫియా నడుపుతున్నారు. ప్రజలు చనిపోయినా పర్వాలేదు, తమ జేబుల్లోకి డబ్బు వస్తే చాలనుకుంటున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షస పరిపాలన నడుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యాన్ని పరిశ్రమ మాదిరిగా నడుపుతున్నారు. క్వాలిటీ లేని లిక్కర్‌ను తయారుచేసి, తన ప్రైవేటు మాఫియా నెట్‌వర్క్‌ద్వారా నేరుగా పంపిస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్‌ కల్తీ బాటిల్‌. ఆ కల్తీ మద్యాన్ని తాగి మనుషులు చనిపోతున్న పరిస్థితి. ప్రాంతాల వారీగా కల్తీ దందా నడుపుతున్నారు. కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇబ్రహీపట్నంలో భారీగా దొరికిన మద్యం, దాని తయారీకి సంబంధించిన వస్తువులు మాఫియా తీవ్రతను తెలియజేస్తున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ లూటీ చేస్తున్నారు

..ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. మన హయాంలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కడం చూస్తున్నాం. మన హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ అలాంటివి లేవు. ఎరువుల పంపిణీలో కూడా స్కాం చేశారు. దళారీలతో చేతులు కలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పేదలను ఇంకా అన్యాయం చేస్తున్నారు. వారిని మరింత పేదరికంలోని నెడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారు. మనం కొత్తగా పెట్టిన కాలేజీలను ఇప్పుడు తన బినామీలకు, తన మనుషులకు తెగనమ్ముతున్నాడు.

..మనం వచ్చేంతవరకూ రాష్ట్రంలో ఉన్నవి 12 గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు మాత్రమే. మనం ఒక విజన్‌ను ఆవిష్కరించాం. ప్రతి జిల్లాల్లో గవర్నమెంటు కాలేజీ ఉండాలన్న సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు ఎందుకు నడుపుతుంది?. అలా చేయకపోతే ప్రైవేటు వాళ్లు ప్రజలను దోచుకుంటారు. ఇవి నడపకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఉన్నప్పుడే 2023-24లోనే కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు కాలేజీలు క్లాసులకు అందుబాటులోకి తెచ్చాం. తద్వారా 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పులివెందులోల 50 సీట్లు NMC ఇస్తే.. వద్దని చంద్రబాబు లెటర్‌ రాశాడు. మన హయాంలోనే అవసరమైన నిధులకు ఫైనాన్సియల్‌ టై అప్‌ చేశాం. అమరావతికి 50వేల ఎకరాలు సరిపోవని, మరో 50వేల ఎకరాలు సేకరిస్తున్నాడు.

..మొదటి 50 వేల ఎకరాలకే మౌలిక సదుపాయాలకోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నారు. అలాంటి లక్షలమందికి, కోట్ల మందికి వైద్యం అందించి, చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్‌ కాలేజీలను అప్పనంగా అమ్మేస్తున్నారు?. ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టలేరా?. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.

..అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శిస్తాను. అక్టోబరు 10 నుంచి నవంబర్‌ 22వరకూ రచ్చబండ కార్యక్రమం. మెడికల్‌ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరణ. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరణ చేస్తాం. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాల సందర్శన. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్‌ టేబుల్స్‌ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్‌ పత్రాల సమర్పణ. జిల్లా కేంద్రాల్లో నవంబర్‌ 12న ర్యాలీలు. ఒక జిల్లాలో నేనుకూడా పాల్గొంటాను. నవంబర్‌ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు. సేకరించిన ఈ సంతకాలు గవర్నర్‌కు అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుంది’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement