
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారంటూ నిలదీశారు. తన శాఖ అధికారుల మీదే దాడిని ప్రశ్నించలేనప్పుడు పదవికి రాజీనామా చేస్తే బెటర్ అంటూ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు.
మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బుడ్డా రాజశేఖరరెడ్డ పవిత్ర శ్రీశైలంలో మద్యం తాగి అటవీశాఖ అధికారుపై దాడి చేశారు. అధికారులను రాత్రంతా తిప్పుతూ దాడి చేశారు. తమ అధికారులపై దాడి చేసినా ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఇంత జరిగినా పవన్ తల వంచుకుని కూర్చోవడం సిగ్గుచేటు’’ అంటూ మాధవ్ మండిపడ్డారు.
ప్రతిభ కలిగిన పోలీసు అధికారులు ఏపీలో పని చేయలేకపోతున్నారు. కొందరు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. పోలీసులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చంద్రబాబు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయితే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులను దూషిస్తే కనీసం కేసు నమోదు చేయలేదు.
బుడ్డా రాజశేఖరరెడ్డిని అరెస్టు కూడా చేయలేదు. పైగా తూతూమంత్రపు కేసు కట్టి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఘటనలు తప్ప అని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు?. ప్రశ్నించలేనప్పుడు పవన్ కళ్యాణ్ పదవి కి రాజీనామా చేయాలి. పోలీసులపై దాడి జరుగుతుంటే పోలీసు సంఘం ఏం చేస్తుంది?. ఇంతవరకు కనీసం నోరెత్తి ఎందుకు ప్రశ్నించలేదు. బుడ్డా రాజశేఖరరెడ్డి దౌర్జన్యాలకు చంద్రబాబు అవార్డు ఇస్తాడేమో?’’ అంటూ గోరంట్ల మాధవ్ ఎద్దేవా చేశారు.
