
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీపై ఉన్న కక్ష సాధింపుల కోసం సీఎం చంద్రబాబు సృష్టించిన బేతాళ కథలే లిక్కర్ స్కాం కేసులని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చట్టాలను అమలు చేయడానికి బదులు రాజకీయ ప్రాపకం కోసం అంగలారుస్తున్న కొందరు పోలీస్ అధికారులే ఇటుంటి దిగజారుడు కుట్రలకు వంతపాడుతూ అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ ముమ్మాటికీ అక్రమ అరెస్టేనని అందరికీ తెలుసునని అన్నారు. గీతదాటిన కొందరు పోలీస్ అధికారులు తమ ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టుపెట్టి, మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను గమనిస్తే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం, రిమాండ్‌లకు పంపడం, అరెస్టులు చేయడం, కండిషన్ బెయిళ్లు, వారెంట్లు, సమన్లతో నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని మాధవ్ మండిపడ్డారు.
‘‘ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని బయటకు రాకుండా చేయడానికి చేయని ప్రయత్నం లేదు. నిబంధనల ప్రకారం జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగానే రక్షణ కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ కారణంగానే వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రమాదం జరిగి సింగయ్య మరణించారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణాన్ని సీరియస్ నేరం కింద కేసు నమోదు చేయడం చూస్తుంటే కొంతమంది పోలీసులు ఎంత దారుణంగా దిగజారి వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. కొంతమంది పోలీసులు కూటమి ప్రభుత్వానికి సాగిల పడుతున్నారు.
వైఎస్ జగన్ లక్ష్యంగా మిథున్‌రెడ్డి అరెస్ట్:
వైఎస్ జగన్‌ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ హయాంలో జరగని లిక్కర్ స్కాంను జరిగినట్టు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉండేవారిని అక్రమంగా అరెస్టులు చేశారు. మా నాయకులు వైయస్ జగన్‌ని ఇబ్బంది పెడితే వైయస్సార్సీపీని లేకుండా చేయొచ్చన్న లక్ష్యంతో ముఖ్య నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారు. ఇందులో భాగంగానే మా పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని జైలుకు పంపారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోలేక, వారు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకుల మీద వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కాంను ఆధారాలతో సహా బయటకు తీసి ఆయన మీద కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. అందుకే వైఎస్సార్‌సీపీ మీద కక్ష కట్టి వైఎస్సార్‌సీపీ హయాంలో జరగని లిక్కర్ కుంభకోణాన్ని జరిగినట్టు తప్పుడు కథనాలు రాసి, భయపెట్టి తీసుకున్న వాంగ్మూలాలతో అక్రమ అరెస్టులు చేస్తున్నారు.
బెయిల్‌పై ఉండి సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు:
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా గోదావరి పుష్కరాల్లో 29 మంది అమాయక భక్తులు చనిపోయారు. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు టీడీపీ కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి మరో 10 మంది చనిపోయారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచ్చి తిరుపతిలో ఆరుగురు, సింహాచలంలో ఏడుగురు చనిపోయారు. తెలంగాణలో ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన కేసులో చంద్రబాబు మీద ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.
ఇవి కాకుండా లిక్కర్ స్కాం, రింగ్‌రోడ్ అలైన్ మెంట్ స్కాం, అసైన్డ్ ల్యాండ్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్ స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబు నిందితుడిగా ఉన్నాడు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ కాబడి 50 రోజులకు పైగా జైలు జీవితం గడిపి అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయటకొచ్చారు. ఇవి కాకుండా ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలో చంద్రబాబు మీద ఏలేరు భూ కుంభకోణం కేసు నమోదైంది.
రైతుల నుంచి, భూ నిర్వాసితుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్టు ఆయన మీద కేసు నమోదైంది. ఉమ్మడి ఏపీలో ఆపద్ధర్మ సీఎంగా ఉండి హైదరాబాద్ నగరంలో వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను ఐఎంజీ అనే సంస్థకు అప్పనంగా కట్టబెట్టేశాడు. తద్వారా ఆ కంపెనీ నుంచి భారీగా కమీషన్లు తీసుకున్నట్టు కేసు నమోదైంది. అవినీతి అనేది చంద్రబాబు నరనరాల్లో జీర్ణించుకుపోయింది.