కల్తీ మద్యం రాకెట్‌తో ప్రభుత్వ పెద్దలకు లింకులు: జూపూడి | Jupudi Prabhakar Fires On Tdp Leaders Adulterated Liquor Manufacturing | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం రాకెట్‌తో ప్రభుత్వ పెద్దలకు లింకులు: జూపూడి

Oct 6 2025 7:15 PM | Updated on Oct 8 2025 10:39 AM

Jupudi Prabhakar Fires On Tdp Leaders Adulterated Liquor Manufacturing

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బయటపడ్డ కల్తీ మద్యం రాకెట్‌ లింకులు కూటమి ప్రభుత్వంలోని పెద్దల వరకు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌ రావు ఆరోపించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కల్తీ మద్యం దందాను సాగించేందుకు తెలుగుదేశం నేతలు ప్లాన్ చేసుకున్నారని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మద్యం పాలసీలో మార్పులు చేశారని అన్నారు.

కల్తీ మద్యాన్ని కూటమి నేతల చేతుల్లో ఉండే ప్రైవేటు మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసే బెల్ట్‌షాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున చెలామణి చేయాలనే కుట్ర దీని వెనుక దాగి ఉందని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం విక్రయాల్లో ప్రతి మూడు బాటిళ్ళలో ఒకటి కల్తీ మద్యంగా తేలిందంటే, ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే ఇంత పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...

రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీలనే అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుయాయులతో కల్తీ మద్యం తమారు చేయిస్తున్నారనే ఆరోపణలకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాలి. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు సమీపంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమే వెలుగుచూసింది. ఈ నకిలీ మద్యం మాఫియాను నడిపించేది సాక్షాత్తు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులేనని బయటపడింది.

ఆఫ్రికా నుంచి ఆంధ్రాకు మద్యం మాఫియా
విదేశాల నుంచి సంస్థలను ఆహ్వానిస్తున్నాం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తాం, ఉపాధి కల్పిస్తామని ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లు చెబుతుంటారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకున్న టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందే ఏపీలో కల్తీ మద్యం రాకెట్‌ను ఆఫ్రికా నుంచి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆఫ్రికాలో మద్యం తయారీ, చెలామణిలో సంపాధించిన అనుభవాన్ని ఏపీలో వినియోగించి, కోట్లు సంపాదించేందుకు వ్యూహం పన్నారు. టీడీపీ పెద్దల ఆశీస్సులతో ఆ పార్టీ నాయకుడు జనార్ధన్‌ నాయుడు ఇందుకు అంతా రంగం సిద్ధం చేశాడు. ఈ దందాకు అనుగుణంగానే ఏపీలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం పాలసీ నిబంధలను మార్పు చేసింది.

గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం విక్రయాలను ప్రైవేటు వారికి ఇచ్చేందుకు నిర్ణయించారు. లిక్కర్ షాప్‌లు అన్నీ లాటరీ అంటూ హంగామా చేసి, మొత్తం దుకాణాలను అధికార తెలుగుదేశం వారి చేతుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే మద్యం సిండికేట్‌లను ఏర్పాటు చేశారు. అనధికారికంగా పర్మిట్ రూంలను నిర్వహించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఊరూరా బెల్ట్ షాప్‌లను ఏర్పాటు చేశారు. ఆ తరువాత తమ కల్తీ లిక్కర్ దందాను ప్రారంభించారు. ఎక్కడికక్కడ కల్తీ మద్యం డెన్‌లను, జిల్లాల్లో మద్యం గోడౌన్‌లను ఏర్పాటు చేసుకుని నిత్యం వేల సంఖ్యలో కల్తీ లిక్కర్ బాటిళ్ళను చెలామణి చేయడం ప్రారంభించారు. అక్రమంగా జరుగుతున్న ఈ వ్యాపారం ద్వారా దండుకుంటున్న సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున మరణాలు జరిగాయంటూ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు విష ప్రచారం చేశాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో, నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చే మద్యాన్ని విక్రయిస్తూ, జవాబుదారీతనంతో విక్రయాలు చేసినా కూడా ఈ తప్పుడు ప్రచారం కొనసాగించారు. వారు చెప్పిన మరణాలు నిజమా అని చూస్తే, ఎక్కడా ఇది వాస్తవం అనేందుకు ఆధారాలు లేవు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు తాను తక్కువ రేటుకే క్వాలిటీ మద్యం అందిస్తాను అంటూ హామీలు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేస్తున్న కల్తీ మద్యంపై ఆయన ఏం సమాధానం చెబుతారు?

ఇతర రాష్ట్రాల నుంచి స్పిరిట్ తీసుకువచ్చి, రంగు కలిపి, నకిలీ మద్యం లేబుళ్ళతో ఏకంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌లకు పంపిణీ చేస్తున్నారు. రకరకాల కల్తీ మద్యం బ్రాండ్‌లను తయారు చేసి, అందమైన పేర్లతో చెలామణి చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా ఈ కల్తీ మద్యం బ్రాండ్‌లే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా మీడియా ముఖంగా ప్రదర్శిస్తున్నాం. 'సుమో, షాట్, బెంగుళూరు బ్రాందీ, ఛాంపియన్, కేరళా మాల్ట్...' ఇలా అనేక రకాల పేర్లతో మార్కెట్‌లో ఈ కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.

ఈ కల్తీ మద్యం రాకెట్ ఎంత వేగంగా విస్తరించిందీ అంటే అన్నమయ్య జిల్లాలో తయారవుతున్న ఈ మద్యంను కోస్తా ప్రాంతంలో కూడా అమ్మేందుకు ఏకంగా ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం గోడవున్‌లో నిల్వ చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులే ఈ రాకెట్‌ను పట్టుకున్నారు. పట్టుబడని కల్తీ మద్యం గోడవున్‌లు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే అనుమానం కలుగుతోంది. ప్రమాదకరమైన ఈ కల్తీ మద్యాన్ని తాగేవారు అతి త్వరగా అనారోగ్యంతో మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ప్రజలు ఏమైపోయినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. కేవలం తన ధనదాహంకు ప్రజల ప్రాణాలనే పణంగా పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement