
సాక్షి, తాడేపల్లి: మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థినుల మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.
‘‘పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరు తాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4 రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా?. 611 మంది చదువుతున్న స్కూల్‌లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా?. ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా?’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
..ముఖ్యమంత్రిగా మీరు, ఇంతమంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా?. గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా?. ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లుమూసుకున్నమాట వాస్తవం కాదా?. ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే చంద్రబాబూ. పేదల తలరాతను మార్చేది చదువేనని మేం నమ్మి, అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు-నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, డిజిటల్ ప్యానెళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాం.
..పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టాం. మా ప్రభుత్వ హయాంలో నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక, మీ సుపుత్రుడు విద్యాశాఖను చేపట్టిన తర్వాత, ప్రైవేటు వ్యక్తుల లాభాలకోసం వారితో చేతులు కలిపి, క్రమంగా ప్రభుత్వ విద్యాసంస్థలను నాశనం చేసుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన మంచి పేరు ప్రతిష్టలను దెబ్బతీశారు.
..ఇంగ్లిషు మీడియంను, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని, టోఫెల్ క్లాసులు, 8వ తరగతి వారికి ట్యాబులు, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్‌ను, రోజుకో మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద వీటన్నింటినీ నాశనం చేశారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు. ఆర్వో ప్లాంట్లు రిపేరు వస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో, ఆస్పత్రుల పాలవడమో పరిపాటిగా మారింది. ఇలాంటి మీ నిర్లక్ష్యమే ఇవాళ కురుపాం ఆశ్రమ పాఠశాలలో గిరిజన బాలికల ఉసురు తీసింది.
..దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి, వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, వారి బడుల్లో వసతులపట్ల శ్రద్ధపెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
.@ncbn గారూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరుతాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4రోజుల వ్యవధిలోనే… pic.twitter.com/Dq0pocjxe6
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2025