
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో రక్షిత తాగునీటిని అందించలేని ప్రభుత్వ నిర్లక్ష్యమే.. విద్యార్ధుల మరణానికి కారణమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ ఓ బాధ్యత లేని విద్యాశాఖ మంత్రి కాగా.. చంద్రబాబు ఓ అసమర్థ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు విద్యార్ధులు చనిపోయారని.. ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని తేల్చి చెప్పారు.
చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో విద్యావ్యవస్ధలో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పించి విద్యాలయాలను దేవాలయాలుగా మార్పు చేస్తే... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూపాయి కాగితం ఖర్చుపెట్టిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్థతకు నిదర్శనమని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
మొద్దు నిద్రలో విద్యా వ్యవస్థ..
రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొద్దునిద్రలో ఉంది. ప్రభుత్వరంగ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు అధ్వాన్న స్ధితిలోకి నెట్టబడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మరణ మృదంగాన్ని తలదన్నే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జూలై నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 11 మంది గిరిజన బిడ్డలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారు. గిరిజన తల్లిదండ్రులు కొండా కోనలను దాటించి గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించారు.
విద్యావంతులుగా వస్తారనుకుని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు విగత జీవులుగా వస్తున్న పిల్లలను చూసి గుండె పగులేలా రోదిస్తున్నారు. ఇది ప్రభుత్వ చేతగాని తనానికి, అసమర్థతకు నిదర్శనం. ఈ పిల్లల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన చేస్తున్నాడని చెప్పడానికి, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనికిరాడు అని చెప్పడానికి జరుగుతున్న ఉదంతాలే నిదర్శనం.
వైఎస్ జగన్ హయాంలో దేవాలయాలుగా విద్యాలయాలు
ఒక కుటుంబంలో రేపటి తరాన్ని నడిపించాల్సిన బిడ్డలను అర్ధాంతరంగా పోగొట్టుకోవడం అత్యంత బాధాకరం. జూలై నెలలో పదో తరగతి చదువుతున్న పిల్లవాడు చనిపోతే.. ఇవాళ వారం రోజుల్లోనే ఇద్దరు బాలికలు కేవలం సరైన తాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో మృత్యువాత పడడం దురదృష్టకరం. వైఎస్ జగన్ హయాంలో విద్యాలయాలను దేవాలయాలుగా మార్చారు.
ప్రతి విద్యార్థి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని ప్రతి స్కూల్లో ఫర్నీచర్, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి మంచినీళ్ల సరఫరా, డిజిటల్ క్లాస్ రూములు, ఇంగ్లిషు, తెలుగు మీడియంలో ముద్రించిన పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిషు మీడియం, టోఫెల్ విద్య అందించడంతో పాటు నూతనంగా తరగతి గదులు నిర్మించి వసతులు ఏర్పాటు చేశారు. నాడు-నేడు ద్వారా దాదాపు 50 వేల స్కూళ్లను అభివృద్ధి చేసి ప్రజలకందించారు. అదే విధంగా అమ్మఒడి పథకంలో రూ.2 వేలు మినహాయించి.. స్కూళ్లు అభివృద్ధి, మౌలిక వసతులను మెరుగుపర్చడానికి వాడితే ఆ రోజు అర్ధజ్ఞానం కలిగిన లోకేష్ అమ్మఒడి అర్ధవడి అయిందని మాట్లాడారు.
హోం మంత్రి భోజనంలోనే బొద్దింక
ఇవాళ లోకేష్ కూడా అమ్మఒడిలో రూ.2వేలు కట్ చేసి... స్కూళ్ల అభివృద్ధికి, వసతుల కల్పనకు ఎక్కడైనా రూపాయి కాగితం వెచ్చించారా లోకేష్ ? ఏ స్కూల్ లోనైనా నాణ్యమైన భోజనం అందించారా? రాష్ట్ర ప్రజలు ఆలోచన్ చేయాలి. సాక్షాత్తూ ఈ రాష్ట్ర హోంమంత్రి భోజనం చేస్తున్న కంచంలోనే బొద్దింక ఆహారంలో వచ్చింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ 14 నెలల కూటమి పాలనలో అనేక సందర్భాల్లో కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో పిల్లలు ఆసుపత్రిలో చేరిన సందర్బాలు ఉన్నాయి. ఇది చేతకాని పాలనకు పరాకాష్ట కాదా? ఇది అసమర్థ ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు కావాలా? 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రికి పరిపాలన మీద ఏమాత్రం శ్రద్ధ ఉందో ఈ ఘటనలు చూస్తేనే అర్ధం అవుతుంది.
కేవలం చంద్రబాబు కుమారుడు అనే ఒకే ఒక్క అర్హత తప్ప.. ఏ అర్హతా లేని లోకేష్‌ని విద్యాశాఖ మంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టడంతోనే విద్యావ్యవస్థకు చెదలు పట్టడం మొదలైంది. వ్యవస్థను కొద్ది, కొద్దిగా చెదలు తిన్నట్టుగా కూటమి నేతలు తింటున్నారు. దీనంతటికీ కారణం మంత్రి నారాయణ. నారాయణ కాలేజీల సంస్థల చైర్మన్‌గా తన సంస్థలను పెంచి పోషించాలన్న దురుద్దేశమే కారణం.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లకు తరలిపోయారు. కారణం ప్రభుత్వమే ప్రైవేటు విద్యను ప్రోత్సహించడమే. ప్రభుత్వ విద్యాలయాలను నాశనం చేయడమే. వసతులు లేని ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్ధులు ఎందుకు ఉంటారు? అదే కారణంతో 5 లక్షల మంది ప్రైవేటుకు మారిపోయారు.
చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలి
చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు కనీసం రూ.25 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్రను వీడాలి. లోకేష్ ఫ్యాక్టరీలు, కంపెనీల తీసుకుని రావడానికి ఢిల్లీ వెళ్లాడని పెద్ద, పెద్ద అక్షరాలతో అచ్చు వేస్తున్న పచ్చ మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలను రాష్ట్రానికి, దేశానికి తెలియజేయాలి. ఇది ఒక వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే? ఇంత చేతకాని వారికి పరిపాలించే అర్హత ఉందా? లోకేష్ ఏ రోజైనా ఈ ఏడాది కాలంలో ఈ సంస్కరణలను తీసుకురాగలిగాను, ఈ అభివృద్ధి చేశాను అని చెప్పగలిగాడా?
ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్, వసతి దీవెన పెండింగ్, అమ్మఒడి పావు ఒడి చేశాడు. ఒక ఏడాది స్కీమ్ ఎగరగొట్టాడు. పేర్లు మార్చినంత మాత్రాన పనిమంతుడు కాలేవన్నవిషయాన్ని లోకేష్ గుర్తుంచుకోవాలి. పనితనం చూపించాలి. అడవిబిడ్డల ఘోషను, పాపాన్ని మూటగట్టుగుంటున్నావన్న విషయం గుర్తించుకో లోకేష్. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ కు సున్నామార్కులు వస్తాయి. తన శాఖలో సక్రమంగా పనిచేయలేని లోకేష్ అన్ని శాఖలను సంస్కరించాలని కుతూహలపడతాడు.
మంచినీళ్లవ్వకుండా విలాసాలకు మంచినీళ్లలా ఖర్చు
గిరిజన బిడ్డల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. ఒకే ఒక వసతి గృహం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు 135 మంది ఆసుపత్రికి వెళ్లారు. వారిలో నుంచి దాదాపు 25 మందికి పచ్చకామెర్లు ఉన్నట్లు తేలింది. దీనికి కారణం ఆ హాస్టల్ లో ఆర్వో ప్లాంట్ నిర్వహించకుండా, సురక్షిత మంచినీటిని అందించలేకపోవడమే కారణం. చివరికి చిన్నపిల్లలకు మంచినీళ్లు కూడా అందించలేని ఈ చేతకాని ప్రభుత్వం... గొప్పలు చెప్పడానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని సభలు పెట్టడానికి, వందలసార్లు హైదరాబాద్ కు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి మాత్రం విచ్చలవిడిగా ఖర్చుచేస్తోంది.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కొలుకుల స్కూల్, పుల్లలచెరువు స్కూల్‌లో ఉపాధ్యాయులు లేరు. 170 మంది ఉపాధ్యాయులు వెళ్లిపోతే.. 26 మంది మాత్రమే వచ్చారని విద్యాశాఖ అధికారులకు చెప్పాను. అయినా స్పందన లేదు. లోకేష్ శాఖలో నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన వసతీ లేదు. చివరకు నాణ్యమైన భోజనం కూడా అందివ్వలేని అసమర్థ మంత్రిగా లోకేష్ నిలబడ్డం ఖాయం. 611 మంది చదువుతున్న స్కూళ్లో మంచినీళ్ల ఆర్వో ప్లాంట్ నిర్వహణకు ప్రభుత్వం వద్ద డబ్బులేదా? ఈ డబ్బంతా ఎటు పోతుంది. కూటమి ప్రభుత్వం తెచ్చిన రూ.2.11 లక్షల కోట్ల డబ్బుంతా ఎవడి జేబులోకి పోయింది. దోచుకున్న మద్యం డబ్బు ఎటు పోతుంది.
వీధుల్లో వరదలా మద్యం- ఆదాయం మాత్రం టీడీపీ నేతల జేబుల్లో..
ఇవాళ ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం రాకెట్ పట్టుబడింది. అతను కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే. రోడ్ల మీద, వీధుల్లో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది.. రాష్ట్ర ఖజనాకు మాత్రం ఆదాయం రావడం లేదని ఆరా తీస్తే... చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో బయటపడ్డ నకిలీ మద్యమే అసలు కారణం. ఇవాళ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న ప్రతీ మూడు సీసాల్లో ఒకటి నకిలీ మద్యం సీసాయే. నకిలీ మద్యం తాగి వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కల్తీ భోజనం తిని వందలాది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కచ్చితంగా మారాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కోసం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కు హితవు పలుకున్నాం. చాతగాని, చేవలేని ఎంత మంది నాయకులున్నా.. సమర్ధత గలిగిన వైయస్.జగన్ నాయకత్వం కాలిగోటికి సరిపోరు అన్న విధంగా కూటమి పాలన సాగుతోంది. వైయస్.జగన్ ఒంటరిగా 151 సీట్లు గెలిచి, ఎక్కడా ఏ రకమైన రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రతి గ్రామంలో నూతన భవనాలను నిర్మించి, నూతన వ్యవస్థలను నెలకొల్పారు. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే. .వాటిని కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెడుతోంది. వ్యవస్థల్లోకి ప్రైవేటు వ్యక్తులు వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇవాళ విద్యాశాఖను చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. విద్యాశాఖలో ప్రైవేటు వ్యవస్థ ఉండడం వల్ల ఏ విధంగా ప్రభుత్వవిద్యావ్యవస్ధ నాశనం అవుతుందో.. అదే విధంగా వైద్య వ్యవస్థ కూడా అలాగే మారబోతుందని వైయస్సార్సీపీ పదే పదే గళం వినిపిస్తుంది.
చంద్రబాబు పాలనలో నీరుగారుతున్న వ్యవస్థలు
చివరగా 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడు అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతిలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా నీరుగారిపోతున్నాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి.. ఈ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలు ఏదైనా ఉన్నాయంటే.. నకిలీ మద్యాన్ని భారీ ఎత్తున తయారు చేసే ఫ్యాక్టరీలే తప్ప.. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేనే లేదు అని తాటిపర్తి చంద్రశేఖర్ తేల్చి చెప్పారు.
విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ..
ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాలలో గ్రానైట్ క్వారీలున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీనరేజీ వసూళ్లుకు మంచి విధానం తెస్తే మాపై విషం కక్కారు. ఇవాళ కూటమి ప్రభుత్వం సీనరీ వసూళ్లు చేసే బాధ్యతను ఏ ఏం ఆర్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. ఈ సంస్థ ప్రతీ రోడ్డులోనూ చెక్ పోస్టులు పెట్టి, ఏ మట్టి ట్రాక్టర్, ఇసుక లారీ, మట్టి బండి వెళ్లినా వాళ్లకు కప్పం కట్టాల్సిందే.
వీళ్ల పేమెంట్ చేసేది రెండేళ్లలో రూ.1135 కోట్లు అని వాళ్ల కరపత్రిక ఈనాడులో రాశారు. అందులోనే గత ఏడాది సీనరేజ్ రూ.450 కోట్లు అని రాశారు. అలాంటప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి ? ఒక కంకర లారీ లోడ్ కు రూ.5010 చెల్లించాలి. ఈ విధంగా దాదాపు రూ.6 కోట్లు ఒక రోజుకు వసూలు చేస్తున్నారు. వారికి ఏడాదికి వస్తున్న ఆదాయం ఎంత? వారు కడుతున్న అమౌంట్ ఎంత ? గతంలో ఎవరైనా ఇంటికి మట్టి తోలుకుంటే డబ్బులు కట్టాల్సిన పనిలేదు. ఇవాళ ఏ ఏం ఆర్ సంస్థకు మాత్రం కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.