సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో ఐవిఆర్ఎస్ కాల్స్‌పై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ ఐవిఆర్ఎస్ కాల్స్ చేయటంపై ఫిర్యాదు చేశారు.
డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినవారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘నాపై ఐవిఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న వారిపై విచారణ జరపాలి. ఆ కాల్స్ వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలి. నాకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారు. నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా నేను సిద్ధమే. ఫేక్ కాల్స్‌తో వ్యక్తిత్వ హననానికి పాల్పడున్నారు. దమ్ముంటే నన్ను ఎదురుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని ఐవిఆర్ఎస్ కాల్స్ పేతుతో ఫేక్ కాల్స్ చేయటం ఎందుకు?’’ అంటూ ఆయన మండిపడ్డారు.

‘‘ఎక్కడి నుండి చేస్తున్నారో కూడా తెలియకుండా ఫేక్ కాల్స్ చేస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తమ చేతిలో ఉందని ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారేమో?. దమ్ము, ధైర్యం ఉంటే ఈ కాల్స్ ఎవరు చేశారో, ఎవరు చేయిస్తున్నారో చెప్పాలి. దీనిపై విచారణ జరపాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాం. చట్టాన్ని, టెలికం వ్యవస్థను వాడుకోవటంపై ఫిర్యాదు చేశాం. చంద్రబాబు, లోకేష్ దీని వెనుక ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి. నా మీద చంద్రబాబు ప్రభుత్వం బురద వేసింది.
నా వ్యక్తి గత ప్రతిష్ట దెబ్బతినేలా నకిలీ మద్యం కేసును అంట గడుతున్నారు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. లైడిటెక్టర్ పరీక్షకు సిద్దమని కూడా చెప్పా. నార్కో అనాలసిస్ టెస్టుకైనా నేను సిద్ధం. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికే టీడీపీ నేతకు నామీద, నా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. దేశంలోని ఏ సంస్థతో విచారణ జరిపినా నేను సిద్ధమే’’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.


