
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ఎల్లోమీడియా వింత పోకడలకు పోతోంది. ల్యాబ్ నివేదికలపై చిత్ర విచిత్రమైన కథనాలు ప్రచురిస్తోంది. మద్యపానం ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని ప్రచారం చేయాల్సిన బాధ్యతాయుతమైన మీడియా సంస్థ, కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గత ఎన్నికల సమయంలోనే నాణ్యమైన మద్యమిస్తామని జనాన్ని మభ్యపెట్టిన విషయం ఒకసారి గుర్తుచేసుకోవాలిక్కడ. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా తాము గెలిస్తే రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని నిస్సిగ్గు ప్రచారం కూడా చేసుకుందీ కూటమి.
అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచిన మద్యం దుకాణాలను కాస్తా ప్రైవేటకు అప్పగించేసింది. ఈ బాధ్యతారహితమైన నిర్ణయమే నకిలీ మద్యం దందాకు, కుంభకోణానికి దారితీసిందన్నది అంచనా. గత ప్రభుత్వం మాదిరిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా విక్రయాలు జరపకపోవడం, విచ్చలవిడిగా పర్మిట్ రూములను అనుమతించడం, బెల్ట్‌షాపుల అణచివేతకు చర్యలు తీసుకోకపోవడం వంటి ఇతర కారణాలు కూడా మార్కెట్‌లో అసలుకు, నకిలీకి మధ్య తేడా తెలియని స్థితికి నెట్టింది. ఇదే ఛాన్సుగా భావించిన కొందరు టీడీపీ నేతలు ఫ్యాక్టరీ పెట్టిమరీ నకిలీ మద్యాన్ని తయారు చేసి పంపిణీ చేయడం మొదలుపెట్టారు. సరుకు నిల్వలకు ప్రత్యేక ఏర్పాట్లు, హైదరాబాద్ నుంచి సరఫరా వంటి అనేకాకనేక అక్రమాలకు పాల్పడ్డారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువు వద్ద నకిలీ ప్లాంట్, ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఒక డంప్ బయటపడ్డాయి. తరువాతి కాలంలో ఎక్సైజ్ పోలీసులు కొందరిని పట్టుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నకిలీ మద్యంతో చాలామంది అనారోగ్యానికి గురై ఉండవచ్చునని, మృత్యువాత పడి ఉండవచ్చునని అనుమానాలు ఉన్నాయి.
నకిలీ మద్యం కుంభకోణాన్ని కాస్తా వైసీపీవైపు తిప్పేందుకు అధికార టీడీపీ విఫలయత్నం చేసింది. సొంతపార్టీ నేతలే పలువురు కీలక సూత్ర, పాత్రధారులుగా స్పష్టం కావడంతో రోజుకో కొత్త కథతో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. ములకలచెరువుతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లభించిన నకిలీ మద్యం శాంపిళ్లను పరీక్షల కోసం పంపగా.. వచ్చిన ఫలితాలను మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా నకిలీ మద్యం తయారు చేశారని, ప్రమాదకరం కాకపోయినా మంచిది కాదని లాబ్ అధికారులు నివేదించారని తెలుగుదేశం మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది.
ఒక సమాచారం.. ప్రకారం.. నీళ్లు, స్పిరిట్, రంగు ,రుచి రసాయనాలతో నకిలీ మద్యం తయారైందని గుంటూరు లాబ్ నివేదిక ఇచ్చిందట. వారికి అందిన 45 శాంపిల్స్ నకిలీ మద్యమేనని తేల్చిందట. అండర్ ఫ్రూఫ్, ఓర్ ఫ్రూఫ్‌లలో భారీ వత్యాసం ఉందని కనుగొన్నారు. లాబ్ రిపోర్టు తీవ్రత తగ్గించి చూపడానికి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. బార్లు, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ ల ముసుగులో నకిలీ మద్యం దందా సాగుతోందని ఆయన అన్నారు. ఈ 16 నెలల్లో వైన్ షాపుల ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపులు, రూ.99 రూపాయల ధర కలిగిన లిక్కర్ సేల్స్ వివరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మద్యం ఆదాయంపై విపరీతంగా ఆధారపడ్డ రాష్ట్ర ప్రభుత్వం నకిలీమద్యం పేరెత్తితే కేసులు బనాయించేందుకు సిద్ధమవుతోంది. దుగ్గిరాల మండలంలో పెరిగిపోతున్న బెల్ట్ షాపుల గురించి లేఖద్వారా తెలియజేసినందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ చిర్రుబుర్రులాడారట. ఆ కోపంతో ఆయన తన భర్త దాసరి వీరయ్యపై అక్రమంగా హత్యకేసు బనాయించారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ వాపోతున్నారు.
పేర్ని నాని మరో సంచలన విషయం చెప్పారు. బార్ల యజమానులకు ప్రభుత్వం నిర్దిశించిన ఫీజ్ కట్టాలంటే విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర నగరాలలో రోజుకు మూడు లక్షల రూపాయల మద్యం అమ్మాల్సి ఉంటుందట. ఇందుకోసం ప్రభుత్వం నుంచి నెలకు రూ.80 లక్షల విలువైన సరుకు కొనాలట. ఈ బార్లవారు నెలకు ఎంత సరుకు కొంటున్నారో వివరాలు బయటపెట్టగలరా అని పేర్ని నాని సవాల్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించాలంటే ఆ వివరాలు వెల్లడించాలి. బార్లలో అమ్మే మద్యంలో పదిశాతం కూడా ప్రభుత్వం వద్ద కొన్నది కాదని ఆయన ఆరోపించారు. ఇది నిజమే అయితే సంచలనమే అని చెప్పాలి. 500 బార్ల నుంచి నెలనెలా రూ.5 కోట్లు అడ్వాన్స్ గా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది నకిలీ మద్యం కన్నా భారీ కుంభకోణం అని ఆయన అంటున్నారు.
గతంలో ఎల్లో మీడియా.. నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చిన మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయిస్తేనే నాసిరకం మద్యం అని, పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రచారం చేసింది. చంద్రబాబు అయితే ఏకంగా 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మితే దానిపై ఫేక్ ప్రచారం జరుగుతోందని ఎదురుదాడి చేస్తున్నారు. పోలీసులను ప్రయోగించి కేసులు పెడుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాపై పోలీసులతో వెంటాడుతున్నారు. సాక్షిని, సోషల్ మీడియాను అణచివేస్తే నకిలీ మద్యం సమస్యను కప్పిపుచ్చవచ్చని భ్రమ పడుతున్నారు. దానికి ఎల్లో మీడియా నకిలీ మద్యం ప్రమాదకరం కాదంటూ వంతపాడుతూ సమాజానికి ద్రోహం చేస్తోంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.