
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్ కల్యాణ్ పక్కనే లోకేశ్ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం..
కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్‌తోపాటు లోకేశ్ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్‌సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు.
కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి.
ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్‌ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్‌తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్‌ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్ ఎత్తుకున్నారు. అంటే..
లోకేశ్‌ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్‌కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు.
లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్‌కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్‌తోపాటు లోకేశ్ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్‌ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.
అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్ లోకేశ్ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్‌లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట.
టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్‌లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్‌కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్‌ను తీసుకు రాగలిగారు.
పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్‌ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో..
లోకేశ్‌కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్‌బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్‌గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.