సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను బొమ్మనహళ్ ఎంపీటీసీలు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను ఎంపీటీసీలు వివరించారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా దౌర్జన్యంగా ఎంపీపీ పదవిని కైవసం చేసుకున్న తీరును చెప్పుకొచ్చారు.

అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరపాల్సిన ఎన్నికను ఇలా అప్రజాస్వామిక పద్దతిలో గెలుపొందడం దారుణం. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, హైకోర్టు దృష్టికి తీసుకువెళ్దామన్నారు. ఇదే సమయంలో రాయదుర్గంలో జరిగిన అరాచకాలపై కూడా వైఎస్ జగన్ ఆరా తీశారు. పార్టీ ఇంఛార్జ్ మెట్టు గోవిందరెడ్డిపై జరిగిన దాడి గురించి ఆయన కుమారుడు విశ్వనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.


