రుణం కావాలా.. వాటా ఇస్తే చాలు | - | Sakshi
Sakshi News home page

రుణం కావాలా.. వాటా ఇస్తే చాలు

Mar 4 2026 8:19 AM | Updated on Mar 4 2026 8:19 AM

నెల్లూరు(పొగతోట): ‘మీరు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని తెలిసింది. గ్రూపుగా ఏర్పడితే రుణం ఇప్పిస్తాం’ ఇలా కొందరు వ్యక్తులు పేద మహిళలను టార్గెట్‌గా చేసుకుని నట్టేట ముంచుతున్నారు. జిల్లాలో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఏజెంట్ల అవతారమెత్తిన పలువురు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడేవారిని గుర్తిస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఐదుగురు మహిళలను నియమించినట్లు సమాచారం. ఏజెంట్లు మహిళలకు మాయమాటలు చెప్పి రుణాలు మంజూరు చేయిస్తామని గ్రూపులు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ విషయంలో ఏజెంట్లు, బ్యాంక్‌ అధికారులు, మండల సిబ్బందికి మధ్య సఖ్యత ఉన్నట్లు సమాచారం.

ఏం చేస్తున్నారంటే..

ఒక్కో మహిళ నుంచి రూ.1,000లు వసూలు చేసి పదిమంది చేత కొత్త గ్రూపులు ఏర్పాటు చేయిస్తున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బ్యాంక్‌ల నుంచి రూణాలు మంజూరు చేయిస్తామని ఏజెంట్లు నమ్మబలుకుతున్నారు. రూ.10 లక్షల మంజూరు చేయిస్తే 50 శాతం గ్రూపునకు, మిగిలింది మాకు ఇవ్వాలంటూ అగ్రిమెంట్‌ చెబుతున్నారు. మేము తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తామని ఏజెంట్లు చెబుతున్నారు. అయితే బ్యాంక్‌లిచ్చిన పూర్తి రుణం మహిళల పేరుతో ఉంటుంది. ఏజెంట్లు ఒక సంవత్సరంపాటు నగదు చెల్లించి తర్వాత చేతులెత్తేస్తే బాధ్యత మొత్తం గ్రూపువారే వహించాలి. వడ్డీతో తిరిగి జమ చేయాల్సి ఉంటుంది.

నిబంధనలు గాలికి..

మహిళ బ్యాంక్‌కు ఎటువంటి బాకీ లేకపోతే కొత్త గ్రూపులో చేరడానికి, కొత్తడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ బకాయిలుంటే నూతన గ్రూపు ఏర్పాటు చేయడం సాధ్యపడదు. మహిళ ఆధార్‌ నంబర్‌ నమోదు చేస్తే బకాయిల వివరాలు వెల్లడవుతాయి. అయితే ఏజెంట్లు బ్యాంక్‌ అధికారుల సహకారంతో బకాయిలున్న వారిచేత కూడా కొత్తవి ఏర్పాటు చేయిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం మహిళ ఒక గ్రూపులో మాత్రమే సభ్యురాలుగా కొనసాగాలి. రుణాన్ని తిరిగి చెల్లించకపోయినా, నిబంధనలు పాటించకపోయినా తీర్మానం చేసి తొలగిస్తారు. అయితే దీంతో సంబంధం లేకుండా కొత్త గ్రూపులు పెడుతున్నట్లు సమాచారం. ఇందుకు మండల సిబ్బంది, బ్యాంకర్లు సహాయ సహాకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

చర్యల్లేవు

కోవూరు మండలంలో 20కిపైగా కొత్త గ్రూపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. పడుగుపాడు ఎన్టీఆర్‌ కాలనీలో పదిమంది మహిళల చేత గ్రూపు పెట్టించారు. రుణాలు మంజూరు చేయించడంలో జాప్యం జరగడంతో మహిళలు పొదుపు చేసిన రూ.10 వేలను విత్‌డ్రా చేశారు. ఈ విషయం తెలు సుకున్న ఏజెంట్లు కాలనీకి వచ్చి పెద్ద గొడవ చేసినట్లు సమాచారం. దీనిపై మండల పొదుపు సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

గ్రామీణ మహిళలే ఏజెంట్ల టార్గెట్‌

కొత్త గ్రూపులతో బ్యాంక్‌ల నుంచి రుణాలు

50 శాతం సభ్యులకు..

మిగిలింది ఏజెంట్లకు

కోవూరు మండలంలో కొత్తగా 20 గ్రూపులు

ఫిర్యాదులు అందలేదు

నిబంధనలు పాటించకుండా కొత్త గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదులు అందలేదు. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఒక గ్రూపులో మాత్రమే సభ్యులుగా ఉండాలి. నిబంధనలు పాటించకుండా గ్రూపులు ఏర్పాటు చేసే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలు ఏజెంట్ల మాటలు విని మోసపోవద్దు. కొత్త గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయిస్తామని ఎవరైనా వస్తే ఫిర్యాదు చేయండి.

– నాగరాజకుమారి, డీఆర్‌డీఏ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement