కాంట్రాక్టర్‌ ఒత్తిడికి ఏకంగా రోడ్డు వర్కే క్యాన్సిల్‌..! | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్‌ ఒత్తిడికి ఏకంగా రోడ్డు వర్కే క్యాన్సిల్‌..!

Mar 4 2026 7:24 AM | Updated on Mar 4 2026 7:24 AM

అధికారం అండ ఉంది.. అడిగే దమ్ము ఎవరికుంది? అనే ధీమా అతనితో అడ్డదారులు తొక్కించింది. రోడ్డు నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అడ్డదారిలో టెండర్‌ వేశాడు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ యంత్రాంగం మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని నిబంధనలు విస్మరించి టెండర్‌ ఓకే చేశారు. ఈ లోపు సదరు పనికి సంబంధించి అడ్వాన్స్‌ గ్రాంట్‌తో పనులు ప్రారంభించి హడావుడిగా చేపట్టారు. అడ్డదారిలో కాంట్రాక్ట్‌ దక్కించుకోవడంతో ఎవరైనా ఫిర్యాదు చేసినా.. పనులు తనతోనే పూర్తి చేయిస్తారనే ధీమా కావొచ్చు. మరో కాంట్రాక్టర్‌ వచ్చి వేలు పెట్టలేని రీతిలో పనులు చేసి.. చేసిన పనులకు రూ.కోట్లల్లో బిల్లులు ఇవ్వాలని పంచాయతీ రాజ్‌ అధికారులపై ఒత్తిడి పెంచారు. అనుకున్నట్లుగానే న్యాయవాదులు, తోటి కాంట్రాక్టర్లు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్‌ విచారణ

జరుగుతోంది. అయితే సదరు కాంట్రాక్టర్‌ మాత్రం చేసిన పనులకు అడ్డుగోలుగా బిల్లులు చేయమని ఒత్తిడి చేయిస్తుండడంతో ఈ పరిస్థితుల్లో బిల్లులు చేసేందుకు అధికారులు సిద్ధంగా లేక.. తలలు పట్టుకుంటున్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: అతనొక కాంట్రాక్ట్‌ మాఫియా. ఆయనకు జిల్లాలోని ఓ కీలక మంత్రి అండదండలు ఉన్నాయి. పోటీపడే కాంట్రాక్టర్లను ఏకంగా సదరు మంత్రి వ్యక్తిగత సహాయకులతో బెదిరిస్తాడు. పనిలో పనిగా సంబంధిత ఇంజినీరింగ్‌ శాఖల అధికారులను సైతం బెదిరించి తన గుప్పెట్లో పెట్టుకుని టెండర్లలో మాయోపాయం ప్రదర్శించి, చివరికి సొంతం చేసుకోవడంలో ఆరితేరాడు. ప్రాంతం ఏదైనా.. వర్కు ఏదైనా తనకు దక్కాల్సిందే. లేదంటే.. ఉద్యోగాలను ఊడగొడతానంటూ నిబంధనలు చూడొద్దంటూ తనదైన రాజకీయం చేస్తాడు. ఇతని వలలో పడిన ఆత్మకూరు పంచాయతీరాజ్‌ అధికారుల సీటుకు ఎసరు వచ్చింది. ఆత్మకూరు బైపాస్‌ రోడ్డు టెండర్‌ కాంట్రాక్ట్‌ వ్యవహారం పంచాయతీరాజ్‌శాఖ మెడకు చుట్టుకుంది. అర్హత లేకపోయినా.. అధికాన్ని అడ్డం పెట్టుకుని కాంట్రాక్ట్‌ కోసం టెండర్‌ వేస్తే.. సంబంధిత అధికారులు సైతం అధికారానికి తలొగ్గి టెండర్‌ ఖరారు చేశారు. తమ్ముడు అక్రమ టెండర్‌ వ్యవహారం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్తే.. అక్కడి నుంచి విచారణకు ఆదేశించినా అధికారులు కనీసం స్పందించకపోవడంతో చివరకు విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు వారి సీటు కిందకే నీళ్లు తెచ్చే పరిస్థితి నెలకొంది.

బిడ్‌ కెపాసిటీకి మించి

నాలుగు రెట్లు అధికంగా..

ఆత్మకూరు మండలం రామస్వామిపల్లికి చెందిన ఓ కాంట్రాక్టరు చాలా కాలంగా కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నాడు. జిల్లాతోపాటు కర్నూలు, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, హైదరాబాద్‌, తదితర తెలంగాణ జిల్లాల్లోనూ పనులు చేస్తున్నాడు. సాధారణంగా ప్రతి కాంట్రాక్టరుకు వారి ఎక్స్‌పీరియన్స్‌ను బట్టి బిడ్‌ కెపాసిటీని నిర్ణయిస్తారు. ఆ కెపాసిటీకి లోబడే ఎక్కడైనా టెండర్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కాంట్రాక్టరుకు బిడ్‌ కెపాసిటీ రూ.52.60 కోట్లు మాత్రమే ఉండగా ఇప్పటికే తెలంగాణలో ఒక్క ఆర్‌అండ్‌బీ శాఖలోనే రూ.60 కోట్లకు పైగా ఆన్‌హ్యాండ్‌ వర్కులు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కర్నూలులోని పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో మరో రూ.80 కోట్లు వర్కులు ఉండగా, జిల్లాలో కూడా మరో రూ.20 కోట్ల వరకు వర్కులున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటికే తన బిడ్‌ కెపాసిటీకి మించి టెండర్లు వేసి వర్కులు తీసుకున్నాడు.

ఆన్‌ హ్యాండ్‌ వర్కులు దాచి భారీగా టెండర్లు

అదే సమయంలో ఇటీవల ఆత్మకూరులో బైపాస్‌ రోడ్డు వర్కుకు టెండర్లు పిలవగా అది కూడా ఆ కాంట్రాక్టరే దక్కించుకున్నాడు. ఈ టెండరు సమయంలో కూడా ఇతర ప్రాంతాల్లోని ఆన్‌ హ్యాండ్‌ వర్కులను చూపించలేదని అభియోగాలున్నాయి. ఈ టెండరు సమయంలో ఇతర కాంట్రాక్టర్లు పోటీకి రాకుండా రాజకీయ ఒత్తిళ్లు తేవడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఇలా.. తన బిడ్‌ కెపాసిటీ రూ.52 కోట్లు అయితే అందుకు రెండింతలు అధికంగా వర్కులు దక్కించుకున్నారని సీఎంఓకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌హ్యాండ్‌ వర్కులు దాచి పెట్టి అధికారులకే మస్కా కొడుతూ టెండర్లు చేస్తున్నారని, తద్వారా ఇతర కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారంటూ సీఎంఓకు ఫిర్యాదు అందడంతో అక్కడి అధికారులు స్పందించారు.

విచారణకు ఆదేశించినా.. తొక్కిపెట్టి..

సదరు కాంట్రాక్టర్‌ రూ.200 కోట్ల మేర తెలుగు రాష్ట్రాల్లో వర్కులు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై గతేడాది సెప్టెంబర్‌లోనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అయితే సదరు కాంట్రాక్టరు తనకున్న రాజకీయ పలుకుబడితో సీఎంఓకు నివేదిక పంపకుండా పంచాయతీరాజ్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాక్షాత్తు సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదును సైతం ఇంజినీరింగ్‌ అధికారులు బుట్టదాఖలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ న్యాయవాది సైతం కాంట్రాక్టర్‌ సంబంధించిన అక్రమాలపై కూడా సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి న్యాయస్థానంలో పిల్‌ వేసినట్లుగా తెలిసింది. ఇంజినీరింగ్‌ అధికారుల వ్యవహార శైలిపై అనుమానం పెరిగిన సదరు కాంట్రాక్టర్ల బాధితులు ఏకంగా విజిలెన్స్‌ విచారణ చేయించమని మరోసారి సీఎంఓకు ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం విజిలెన్స్‌ అధికారులు కాంట్రాక్టర్‌ ఏఏ ప్రాంతాల్లో పనులు చేశారో అన్ని శాఖల నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

రోడ్డు బిల్లు కోసం ఒత్తిడి

ఆత్మకూరు బైపాస్‌రోడ్డు టెండర్‌ను అడ్డదారిలో దక్కించుకుని నాసిరకంగా పనులు చేస్తున్నారు. టెండర్‌ విధానంలోనే తప్పులు చేసినట్లు నిర్ధారణ కావడం, సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆ టెండర్‌ను రద్దు చేయాల్సి ఉంది. కానీ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రస్తుతం అధికార పార్టీ నేతల ఒత్తిడితో టెండర్‌ క్యాన్సిల్‌ చేయకపోగా, బిల్లులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు రాజకీయ ఒత్తిడితోనే బిల్లు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాంట్రాక్ట్‌ కోసం అర్హత లేని తమ్ముడి అడ్డదారులు

బిడ్‌ కెపాసిటీ లేకపోయినా

టెండర్ల దాఖలు

ఆన్‌ హ్యాండ్‌ వర్కులు చూపడంలో మతలబు

ఇప్పటికే రాష్ట్రంలో రూ.200 కోట్ల పనులకు కాంట్రాక్ట్‌లు

సీఎంఓ విచారణకు ఆదేశించినా అధికారుల బుట్టదాఖలు

కాంట్రాక్టర్‌ చేసిన పనులకు బిల్లు చేయమని ఒత్తిడి

సదరు తమ్ముడికి భయపడి

సోమశిల రోడ్డు పనులే క్యాన్సిల్‌..!

సదరు కాంట్రాక్టర్‌ ధనదాహానికి రాజకీయ అండ ఉండడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. అడ్డదారుల్లో అడ్డుగోలుగా నిబంధనలు తుంగలో తొక్కి అత్మకూరులో కాంట్రాక్టర్‌ దక్కించుకున్న ఆయనకు రాజకీయ పలుకుబడి ఉండడంతో మరో వర్కు క్యాన్సిల్‌ చేయించాడు. ఆత్మకూరు నుంచి సోమశిలకు వెళ్లే రోడ్డు మరమ్మతుల కోసం ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఆ వర్కుకు కూడా సదరు కాంట్రాక్టర్‌ టెండర్‌ వేశారు. టెండర్‌ ఓకే చేయకుంటే మీ ఉద్యోగాలు ఊడదీస్తానంటూ సంబంధిత అధికారులపై బెదిరింపులకు దిగడడంతో వారు ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరొస్తుందోనని ఏకంగా వర్కునే క్యాన్సిల్‌ చేసి మిన్నకుండిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement