నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించడంతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో కలెక్టరేట్ ఎదుట ధర్నాను ఏపీటీఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలవుతున్నా, నేటికీ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. నాలుగు విడతల డీఏను ప్రకటించకపోవడం దారుణమన్నారు. అనంతరం జిల్లా గౌరవాధ్యక్షుడు శివకోటారెడ్డి మాట్లాడారు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను అనుసరించి అన్ని రకాల ఉద్యోగోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, రాష్ట్ర సబ్ కమిటీ సభ్యుడు రియాజ్, ఏపీటీఎఫ్ బాధ్యులు శివరామిరెడ్డి, సుబ్బారెడ్డి, జుల్ఫికర్ అలీ, కృష్ణారెడ్డి, బాలాత్రిపురసుందరి, వెంకటేశ్వర్లు అబ్బూరి శ్రీను, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


