అంగన్‌వాడీ కార్యకర్తల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కార్యకర్తల కన్నెర్ర

Mar 4 2026 7:24 AM | Updated on Mar 4 2026 7:24 AM

వంద రోజుల హామీ ఏమైంది చంద్రబాబూ..?

నగరంలో భారీ నిరసన ర్యాలీ

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): తమ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తామని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని, వీటి సాధన కోసం శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులతో శిబిరాలను ధ్వంసం చేయించి, నేతలను అక్రమ అరెస్ట్‌ చేయించడం అమానుషమని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు రెహనాబేగం ఆరోపించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌ నుంచి వీఆర్సీసెంటర్‌ వరకు భారీ నిరసన ర్యాలీని అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కూటమి పార్టీలకు ఓట్లేసి గెలిపించామని, అయితే అధికారంలోకి వచ్చి 21 నెలలైనా, నేటికీ ఎలాంటి ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. తమ సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు వినతిపత్రాలను అందించినా, ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో విజయవాడలో ధర్నా చేస్తున్న సమయంలో శిబిరంలో ఉన్న అంగన్‌వాడీ నేతలపై పోలీసులు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో లాఠీచార్జి జరిపి అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. వీరిని ఎక్కడికి తీసుకెళ్లారో ఇప్పటికీ తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానకర రీతిలో రోడ్డుపై ఈడ్చుకుంటూ లాఠీలతో దాడి చేస్తూ అరెస్ట్‌ చేయడాన్ని మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. వీరిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలు కొందరు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు తమ సత్తా ఏమిటో చూపుతామని స్పష్టం చేశారు. హామీలను అమలు చేయకపోతే ఆయన్ను ఇంటికి పంపడం ఖాయమని తేల్చిచెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేల వేతనాన్ని ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. దశల వారీగా ఉద్యమాలు, ఆందోళనలను చేపడతామని.. అవసరమైతే సర్కార్‌ ఇచ్చిన సెల్‌ఫోన్లను సైతం తిరిగి అప్పగిస్తామన్నారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాతమ్మ, కమిటీ సభ్యులు మల్లమ్మ, కామాక్షమ్మ, నాగభూషణమ్మ, పెంచలమ్మ, సంపూర్ణమ్మ, రజని, రమీజా, రత్నమ్మ, సీఐటీయూ నేత నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement