వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
8న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లా స్థాయి మాస్టర్స్ టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను ఈ నెల ఎనిమిదిన నిర్వహించనున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పాండురంగారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ లీగ్ పోటీల్లో భాగంగా దర్గామిట్టలోని నెల్లూరు క్లబ్‌లో 40 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు మాస్టర్స్ టెన్నిస్ పోటీలను సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో జరపనున్నామని వివరించారు. 35 నుంచి 45 ఏళ్లలోపు పురుషులు, మహిళలకు బ్యాడ్మింటన్ పోటీలను సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్నామని వెల్లడించారు. sports.ap.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామని, వివరాలకు 88862 28444, 95813 72472 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
135 పంచాయతీల్లో
నూరు శాతం పన్నుల వసూలు
పొదలకూరు: జిల్లాలోని 135 పంచాయతీల్లో ఇంటి పన్నులను నూరు శాతం మేర వసూలు చేయగలిగామని డీపీఓ వసుమతి పేర్కొన్నారు. పొదలకూరు పంచాయతీలో పేరుకుపోయిన ఇంటి పన్నులను వసూలు చేయించే నిమిత్తం పట్టణంలో మంగళవారం ఆమె పర్యటించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 722 గ్రామ పంచాయతీలున్నాయని, నూరు శాతం మేర పన్నుల వసూల్లో పురోగతి చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు. పొదలకూరు పంచాయతీలో బకాయిలు పేరుకుపోవడంతో స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నూరు శాతం వసూలు చేసిన వాటిలో సైదాపురం పంచాయతీ ఉందన్నారు. స్వామిత్వ సర్వే ద్వారా ప్రతి ఇంటికీ అసెస్మెంట్ నంబర్‌ను అందజేయనున్నామని, పొదలకూరులో డోర్ నంబర్లను కూడా పూర్తి చేయనున్నామని ప్రకటించారు. ఎంపీడీఓ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
వెంకటశేషయ్యకు
బెయిల్ పునరుద్ధరణ
వెంకటాచలం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్యకు బెయిల్‌ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం జారీ చేసింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వెంకటాచలం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2024, డిసెంబర్‌లో అక్రమ కేసును టీడీపీ ప్రభుత్వం నమోదు చేసి జైలుకు పంపింది. ఆ తర్వాత కొన్ని రోజులు జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో బయటకొచ్చారు. ఈ తరుణంలో బెయిల్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ను ప్రాసిక్యూషన్ దాఖలు చేయడంతో, దీన్ని రద్దు చేస్తూ గత నెల 23న ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో హైకోర్టులో రీకాల్ పిటిషన్‌తో పాటు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తూ తన బెయిల్ రద్దుకు కారణమైన పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టాలంటూ మరో పిటిషన్‌ను గత నెల 26న దాఖలు చేశారు. రీకాల్ పిటిషన్‌పై లంచ్ మోషన్‌లో వాదనలు జరిగాయి. ఇవి విన్న న్యాయమూర్తి.. వెంకటశేషయ్య తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించి బెయిల్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దీన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.


