● ల్యాప్‌టాప్,
నాలుగు సెల్‌ఫోన్ల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): క్రికెట్ బెట్టింగ్ కేసులో కీలక నిందితుడితోపాటు మరొకర్ని నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో వివరాలను నగర ఏఎస్పీ దీక్ష వెల్లడించారు. ఆన్‌లైన్ యాప్‌లో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఓ వ్యాపారిని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వేణుగోపాల్ నమ్మించాడు. రూ.53 లక్షలను కాజేసి, మోసగించడంపై బాధిత వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో వేణుగోపాల్, వెంకటరమణ, మహేష్‌కుమార్, మణికుమార్ మరికొందరితో కలిసి క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తున్నారని వెల్లడైంది. వేణు, వెంకటరమణను పోలీసులు గత నెల 19వ తేదీన అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మణికుమార్, మహేష్‌కుమార్ కోసం గాలించారు. బెంగళూరులో ఉంటున్న బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన మహేష్‌బాబుతో కలిసి నిందితులు బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నారనే అంశాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ మహేష్‌బాబు, అతని సహచరుడు, కందుకూరు ప్రాంతానికి చెందిన హరికృష్ణను ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. వారి నుంచి ల్యాప్‌టాప్, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సులభంగా..
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మహేష్‌బాబు పనిచేశాడు. సులభ మార్గంలో డబ్బు సంపాదించాలని శ్రీలంక, దుబాయ్‌కు పలుమార్లు వెళ్లి క్రికెట్ బెట్టింగ్ యాప్‌ల నిర్వహణపై అవగాహన పెంచుకున్నాడు. దుబాయ్ వాళ్ల దగ్గర రాధే ఎక్స్చేంజ్ యాప్ (ఆర్ 777)ను 30 శాతం షేర్ వచ్చేలా తీసుకుని వేణు, మహేష్‌కుమార్, మణికి 15 శాతాన్ని ఇస్తూ క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నాడు. పరారీలో ఉన్న మిగిలిన నిర్వాహకులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ సాంబశివరావు, ఎస్సై విజయశ్రీనివాస్ సిబ్బందిని అభినందించారు.
వెంకటాచలంలో
టీడీపీ పతనం తప్పదు
● బీజేపీ సీనియర్ నేత
కుంచి శ్రీనివాసులు యాదవ్
వెంకటాచలం: చవటపాళెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణమ నాయుడు పెత్తనం కొనసాగితే వెంకటాచలం మండలంలో టీడీపీ పతనం తప్పదని బీజేపీ సీనియర్ నేత, నిడిగుంటపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్ అన్నారు. మండలంలోని నిడిగుంటపాళెంలో పంచాయతీ తీర్మానాలు లేకుండా జరుగుతున్న పనులను మంగళవారం ఎంపీటీసీ మేకల ప్రవళ్లికతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో రాధాకృష్ణమ నాయుడు పెత్తనంతో ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి చేసి పనులు జరగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. గ్రామంలో ఉన్న దళిత ఎంపీటీసీ సభ్యురాలు ప్రవళ్లికకు సమాచారం ఇవ్వకుండానే పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. పంచాయతీ అనుమతి లేకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రూ.10 లక్షల విలువైన పనులను ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. బిల్లల కోసమే అవసరం లేకున్నా ఈ పనులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రవళ్లిక మాట్లాడుతూ గ్రామంలో జరిగే కార్యక్రమాల గురించి తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు హసనాపురం శ్రీనివాసులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పిచ్చికుక్క స్వైర విహారం
● పదిమందికిపైగా గాయాలు
మనుబోలు: మండల కేంద్రమైన మనుబోలులో పిచ్చికుక్క మంగళవారం స్వైర విహారం చేసి పదిమందికి పైగా గాయపరిచింది. స్థానికుల కథనం మేరకు.. మనుబోలు కోదండరాపురం పూల దుకాణం వద్ద పిచ్చికుక్క పలువురిపై దాడి చేసింది. గ్రామానికి చెందిన మస్తాన్‌రెడ్డి కాలికి తీవ్ర గాయమైంది. పలువురు బాధితులు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రేబిస్ ఇంజెక్షన్ వేయించుకున్నారు.


