సాక్షి, తాడేపల్లి: ప్రాజెక్టులను నిర్మించిన చరిత్ర చంద్రబాబుకి లేదని.. అలాంటిది కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తాను ఎందుకు తీసుకున్నారో ఇప్పటికైనా చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. పోలవరంపై చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై అంబటి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు.
‘‘డయాఫ్రమ్ వాల్ కొట్టకుపోవడానికి వైఎస్సార్‌సీపీనే కారణమంటూ చంద్రబాబు చెబుతున్నారు. పదే పదే అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటే. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని స్వయంగా ప్రధాని మోదీనే అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో.. ఆంధ్రా ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు. రాయలసీమ ప్రజల గుండెలపై చంద్రబాబు కొట్టారు’’ అని అంబటి వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
‘‘డయాఫ్రమ్ వేయాలంటే కాపర్ డ్యామ్స్ కట్టాలన్న జ్ఞానం కూడా చంద్రబాబుకి లేదు. అలాంటప్పుడు కాపర్ డ్యాం వేయకుండా ఢయాఫ్రం ఎలా వేశారో ఆయన సమాధానం చెప్పాలి. నది డైవర్ట్ చేశాం, స్పిల్ వే పూర్తి చేశాం.. కాపర్ డ్యామ్స్ కట్టిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. అలాంటిది జగన్ 2 శాతమే పూర్తి చేశారని అబద్ధాలు చెబుతున్నారు. ఆ అబద్ధాతో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రాజెక్టులను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారు. పోలవరం అనేది వైఎస్సార్ కలల పంట. కానీ, చంద్రబాబు పట్టిసీమను కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి కట్టారు. పోలవరం ఎత్తును 45.72 నుండి 41.15 కు కుదించారు. పోలవరాన్ని బ్యారేజ్ చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనవసరమని చంద్రబాబు అంతకుముందు ఎందుకు చెప్పలేదు. రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాతే అనవసరమని గుర్తొచ్చిందా?..
ఏపి ప్రజల హక్కును తాకట్టు పెట్టి తెలంగాణతో సత్సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. అసలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో పంపి కుళ్ళు రాజకీయాలు చేస్తుంది చంద్రబాబే. తెలంగాణలో టిడీపీ బలపడటం కోసమే ఏపి, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు.
మేం రెడీ
పోలవరంపై చర్చుకు మేం సిద్ధం. మీ జలవనరుల శాఖా మంత్రిని పంపించండి అని చంద్రబాబుకు అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ‘‘రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. అయితే ఆ డిమాండ్ సరైంది కాదని మా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు లక్ష ఎకరాల్లో రాజధానిని కట్టాలనుకోవడమే దురదృష్టకరం. అంత కెపాసిటీ మన రాష్ట్రానికి లేదు. అంత నగరాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు. కృష్ణా నది మట్టం కంటే తక్కువ ఉన్న ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేయడం దుర్మార్గం.
చంద్రబాబు తాను దోచిన డబ్బుల్లో సగం పవన్ బ్రదర్‌కు ఇస్తున్నారు. ఆ డబ్బుల లెక్కలు చూసేది లోకేషే. చంద్రబాబు పాలనపై ఏడాదిన్నర లోనే చాలా వ్యతిరేకత వచ్చింది. జగనే బెటర్ ప్రజలు అనుకుంటున్నారు. మళ్ళీ జగన్ వస్తాడని అందరు అనుకుంటున్నారు అని అంబటి అన్నారు.


