ఇదేం కవరింగు బాబూ.. మరీ ఇంత అధ్వానమా? | KSR Comment On What Eenadu Andhrajyothy Covers APERC Punishment, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

ఇదేం కవరింగు బాబూ.. మరీ ఇంత అధ్వానమా?

Oct 1 2025 12:17 PM | Updated on Oct 1 2025 1:43 PM

KSR Comment: What eenadu andhrajyothy Covers APERC Punishment

‘‘విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్.. ప్రజలకు తగ్గనున్న వెయ్యి కోట్ల భారం’’.. ఈనాడు పత్రికలో వచ్చిన ఒక కథనం.
‘‘సమర్థత, అనుభవం.. ఫలితమే ఛార్జీల తగ్గింపు’’.. ఆంధ్రజ్యోతి ఇచ్చిన వార్త
‘‘ఈఆర్సీ సీరియస్‌.. సర్కార్‌కు షాక్ - దాదాపు వెయ్యి కోట్ల అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలు’’.. సాక్షి దినపత్రిక ఇచ్చిన వార్త

పైవాటిల్లో సత్యమేది? అసత్యమేది? అనే సంశయం పాఠకులకు రావచ్చు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎలివేషన్ ఇవ్వడానికి నిరంతరం పాటు  పడుతుంటాయన్న సంగతి తెలిసిందే. కాకపోతే ప్రభుత్వానికి నెగిటివ్‌గా ఇవ్వాల్సిన వార్తను అలా ఇవ్వకపోతే మానే.. ప్రజలకు పచ్చి అబద్దపు సమాచారం ఇవ్వడానికి ఎక్కడా సిగ్గు పడకపోవడం ఈ రెండు మీడియా సంస్థల ప్రత్యేకతగా మారిపోయింది. 

విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వ తీరుపై నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసి ఛార్జీలు తగ్గించాలని, ప్రజల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తే, దానిని వక్రీకరించి అదేదో ప్రభుత్వం ప్రజలపై దయతో తగ్గించినట్లుగా కథనాలు ఇవ్వడం పాఠకులను, ప్రజలను మోసం చేయడమే!. 

ఈ విషయాన్ని సాక్షి మీడియా బహిర్గతం చేసింది. సోషల్ మీడియాలోనూ సమాచారం విస్తారంగా వచ్చింది. దాంతో ప్రభుత్వం పరువుతోపాటు, టీడీపీకి మద్దతిచ్చి అసత్యాలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థల బాగోతం మరోసారి బట్టబయలమైంది. సాక్షి, సోషల్ మీడియా లేకపోతే ప్రజలు టీడీపీ మీడియా వండి వార్చిన అసత్యాలనే నమ్మాల్సి వచ్చేది. 

అసలు విషయం ఏమిటి! 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.15,485 కోట్ల అదనపు బాదుడుకు ఈఆర్సీ అనుమతి కోరడం, ఈఆర్సీ యూనిట్‌కు రూ.5.27లకు కొనుగోలుకు ఓకే చేస్తే డిస్కంలు రూ.5.84 నుంచి రూ.5.89 వరకు కొన్నది వాస్తవం. ఫలితంగా ప్రభుత్వం ప్రజల నుంచి అదనంగా రూ.2787 కోట్ల విద్యుత్ ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరింది. కాని ఈఆర్సీ రూ.1863 కోట్ల అదనపు వసూలుకు అంగీకరించింది. అయినా ప్రభుత్వం, డిస్కమ్ ఏదైనా అనండి.. ఈఆర్సీ ఆదేశాన్ని కాదని రూ.2787 కోట్లు వసూలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఈఆర్సీ అదనంగా వసూలు చేసిన రూ.923 కోట్లు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం యూనిట్‌కు పదమూడు పైసలు తగ్గుతుంది. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అదనపు బాదుడు బాదకుండా, విద్యుత్ ఛార్జీలను ఎంతో కొంత తగ్గించి ఉంటే అప్పుడు నిజంగానే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. ఆయన సమర్థుడు అని భుజకీర్తులు తగిలించినా బాగానే ఉండేది. అలాకాకుండా..  

ఎప్పటి మాదిరే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలనుకోవడమే ఇందులో మతలబు. అసలు  కూటమి సర్కార్ ప్రజలపై అదనపు భారం ఎందుకు మోపింది? ఇప్పుడు ఎందుకు ఈఆర్సీ తగ్గింపు ఆదేశాలు ఇచ్చింది చెప్పకుండా అదేదో తమ చంద్రబాబు నిర్ణయం అన్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడమే శోచనీయం. 

కూటమి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సుమారు రూ. 19 వేల కోట్ల భారం వేశారని లెక్కలతో సహా వార్తలు వస్తున్నాయి. ఇది ఏపాటి సమర్ధత అవుతుందో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా వారే చెప్పాలి! పోనీ అదెందుకు! డిస్కంలు మరో రూ.12771 కోట్ల అదనపు వసూలుకు ఈఆర్సీని అనుమతి కోరాయి కదా.. దానిని ఉపసంహరించుకుంటామని చంద్రబాబు కాని, ఆయన తరపున ఎల్లో మీడియా కాని ప్రకటిస్తాయా? అని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పొగడరా! పొగడరా! అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అని పొగిడాడట వెనుకటి ఒకడు. అలాగే ఈ ఎల్లోమీడియా ఎంతకైనా దిగజారుతున్నాయి. 

జగన్ టైమ్‌లో విద్యుత్ రంగాన్ని ఎంత సమర్థంగా నిర్వహించినా, అప్పట్లో ఇంకేముంది ఛార్జీలు పెంచేశారు అంటూ ప్రచారం చేసిన ఈ మీడియా ఇప్పుడు వేల కోట్ల అదనపు భారాలు ప్రజలపై  కూటమి మోపుతున్నా ,దానిని కప్పిపుచ్చడానికి యత్నిస్తున్నాయి. గతంలో  ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న  రోజుల్లో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్న డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు  చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తదుపరి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసింది. ఆ తర్వాత దానిని కూడా తన క్రెడిట్ లో వేసుకోవడానికి ఆయన ఏమి చెప్పారంటే, తాను తెచ్చిన సంస్కరణల వల్లే అది సాధ్యమైందని ప్రచారం చేసుకున్నారు.అలా ఉంటుంది చంద్రబాబు తెలివి. ఈసారి కూడా అదే తరహాలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఆయన చేసిన యత్నం వికటించి ప్రజలకు వాస్తవం తెలిసిపోయిందని అనుకోవాలి.

నకిలీ వార్తల వెల్లువ అంటూ ఈనాడు దినపత్రిక(Eenadu Fke News)  ఈ మధ్య ఒక సంపాదకీయం రాసింది. అందులో నకిలీ వార్తల గురించి గుండెలు బాదుకుంది. మంచిదే కాని తానేమి చేస్తున్నది మర్చిపోయి ఎదుటి వారిపై నిందించే రీతిలో ఆ సంపాదకీయం రాసుకుని ఆత్మవంచన చేసుకుందని చెప్పాలి. 'ఎన్నికలలో గెలిస్తే ప్రజా సంక్షేమానికి, సమ్మిళిత ప్రగతికి, ఎలాంటి కృషి చేస్తామో చెబుతూ ఓట్లు అడగడం నైతిక నిష్ట కలిగిన నాయకుల పద్దతి. అలాంటివారు అరుదైపోయి అబద్ధాలతో అధికారాన్ని గుప్పిట పడదామనుకునే జగత్ కిలాడీలతో రాజకీయాలు భ్రష్టు పడుతుండడం నేటి భారతం దుర్గతి. దానికి తగ్గట్లే పార్టీల నిర్వహణలోని ప్రధాన స్రవంతి మీడియా సంస్థల్లో  కొన్ని బూటకపు వార్తా కథనాలను విచ్చలవిడిగా జనం మీదకు వదులుతున్నాయి. వ్యక్తిత్వ హననాలకు తెగపడుతున్నాయి. ఇలాంటి పెడపోకడలను అడ్డుకోకపోతే నకిలీ వార్తా సంస్థలను జవాబుదారి చేయకపోతే కపట నేతల స్వార్ధ ప్రయోజనాలకు ప్రజాస్వామ్యం బలి పశువు అవుతుంది"అ ని రాశారు. ఇది చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ కూడా ఏ మాత్రం చిత్తశుద్ది లేకుండా ఎడిటోరియల్ రాశారని తెలిసిపోవడం లేదా!. 

ఒక పక్క తప్పుడు వార్తలనండి, నకిలీ వార్తలనండి వారే ఇష్టానుసారంగా పాఠకులపై రుద్దుతో  పార్టీల మీడియా  ఏదో చేస్తోందంటూ నిస్సిగ్గుగా రాసిందనిపించదా! విద్యుత్ ఛార్జీల విషయంలో జరిగిందేమిటి.ఎల్లో మీడియా  రాసిందేమిటి? దానిని నకిలీ అంటారా? తప్పుడు వార్తలు అంటారా! కూటమి సర్కార్ కరెంటు ఛార్జీలు పెంచిందా? లేదా? అదనపు వసూళ్లకు పాల్పడ్డారా? లేదా? అన్నది చెప్పకుండా  కథలు రాయడం టీడీపీ మీడియాది జగత్ కిలాడి తనం అవుతుందా? లేదా అన్నది వారే ఆలోచించుకోవాలి. అలాగే వీరు చెప్పే నీతిసూత్రం  ప్రకారం టీడీపీ, జనసేన కూటమి నేతలే జగత్ కిలాడీలు అవ్వాలి కదా! ఆ మాటను ఎందుకు నేరుగా రాయలేకపోయారు!. 

ఎంతసేపు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న  ఈనాడు మీడియా సుద్దులు చెప్పడం ఆశ్చర్యమే. అబద్దాలతో అధికారం గుప్పిట పెడదామనుకుంటున్నారట. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం కూటమి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిలో ఎన్ని నెరవేర్చారు? అవి అబద్దపు హామీలా? కాదా? అన్నదానిపై ఎన్నడైనా ఒక్క వార్త  ఇచ్చారా? ఎన్నికలకు ముందు ఎన్ని రకాల అసత్యాలను ప్రచారం చేశారో ఈనాడు వంటి ఎల్లో మీడియాకు గుర్తు లేదేమో కాని, కాస్త రెగ్యులర్ గా ఫాలో అయ్యే పాఠకులందరికి తెలియకుండా ఉంటుందా! ఈనాడు మీడియా ఒక్కసారి తమను తాము అద్దంలో చూసుకుని ,ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకుంటే వారికే తెలుస్తుంది ఎవరు నకిలీ వార్తలు రాస్తున్నారో,ఎవరు తప్పుడు కధనాలు  ఇస్తున్నారో!.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement