
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, అమరావతి: ‘‘మీరూ.. మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఒక్కటైనా ఈ 18 నెలల కాలంలో వెలిగిందా..? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 2019–24 మధ్య ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులని చంద్రబాబును దుయ్యబడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..
ఇవన్నీ వెలగని దీపాలే కదా...
1. నిరుద్యోగులందరికీ నెలకు రూ.3 వేల చొప్పున భృతి..
2. ప్రతి అక్కచెల్లెమ్మకూ నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18,000..
3. 50 ఏళ్లకే పెన్షన్.. నెల నెలా రూ.4 వేలు...
4. పీఎం కిసాన్ కాకుండా, ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000 ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట..
5. ఎంతమంది పిల్లలున్నా, ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000
6. ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు
7. అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం..ం
8. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు..
⇒ ఇవన్నీ.. వెలగని దీపాలో ంలేక చేశామంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా.. లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?
⇒ వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత.. ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా!
⇒ మా పాలనలో 2019–24 మధ్యం ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు!