
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పెద్దల ప్రోత్సహాంతో నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో వైఎస్సార్‌సీపీపై తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్యతో లింక్ చేస్తూ, నకిలీ మద్యం దందాపై ప్రజలకు ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేయిస్తున్న చంద్రబాబుకు నిజంగా దీనిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐ విచారణ కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ దందాలో కిలారు రాజేష్, నారా లోకేష్‌ల దోపడీ వ్యవహారం బయటపడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..
చంద్రబాబు నేతృత్వం లోని ప్రభుత్వం నకిలీ మద్యం రాకెట్‌ను ప్రోత్సహిస్తూ మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున అమ్ముతోంది. ఈ విషయం కాస్తా బయటపడిపోవడం, ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న టీడీపీ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని అసహ్యించుకుంటున్నారు. దీని నుంచి బయటపడటానికి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరమీదికి తీసుకువచ్చి, వైఎస్సార్‌సీపీకి ఆ బురద అందించేందుకు సిద్ధమయ్యాడు.
అందులో భాగంగానే నిందితుడు జనార్థన్‌తో మాజీ మంత్రి జోగి రమేష్‌పై తప్పుడు ఆరోపణలు చేయించాడు. ఈ విషయాలను ప్రజలు నమ్మడం లేదని తెలిసి, పదేపదే ఈ నిందను వైఎస్సార్‌సీపీపై మోపుతూ పెద్ద ఎత్తన ప్రచారం చేయించేందుకు తెగబడ్డాడు. దీనిలో భాగంగా ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు ఫోన్లు చేయించి, ముందుగా రికార్డు చేసిన మెసేజ్‌ను వారి మెదళ్ళలో జొప్పించేందుకు దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు.
ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట
గత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా 'మీ భూమిని వైయస్ జగన్ లాగేసుకుంటున్నారు, మీ భూములకు రక్షణ లేదంటూ' ఒక ఫేక్ న్యూస్‌ను విస్తృతంగా ప్రచారం చేసి లభ్దిపొందారు. తిరిగి ఇప్పుడు టీడీపీ కార్యాలయం నుంచి ప్రజలకు మళ్ళీ అటువంటి ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. నకిలీ మద్యం దందాలో కీలక నిందితుడు జనార్థన్‌రావు వాయిస్‌తో ఉన్న ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో జోగి రమేష్‌పై చేసిన ఆరోపణలను వినిపిస్తూ, నకిలీ మద్యం అంతా కూడా వైయస్ఆర్‌సీపీ వారే చేశారనే ఫేక్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. (టీడీపీ నేతలు చేయిస్తున్న ఐవీఆర్‌ఎస్ కాల్స్ ఆడియోను ప్రదర్శించారు) తెలుగుదేశంకు ఈ నకిలీ మద్యం దందాతో సంబంధం లేకపోతే ఎందుకు పనిగట్టుకుని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా జనార్థన్ వాయిస్‌తో జోగి రమేష్ పేరు చెప్పిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి.
నాణ్యమైన లిక్కర్ అంటూ నకిలీ లిక్కర్ ఇస్తున్నాడు
ప్రజాస్వామ్యంలో ఇటువంటి నికృష్టపు రాజకీయాలు ఒక్క చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేయలేదు. చంద్రబాబు పేరు చెబితే నేడు ప్రజలకు నకిలీ మద్యం దందానే గుర్తుకు వస్తోంది. మందుబాబులకు నాణ్యమైన మద్యంను ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీలు గుప్పించాడు. ప్రబుత్వ ఆధీనంలోని మద్యంను ప్రైవేటువారి చేతికి ఇస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ నకిలీ మద్యం తాగి అనేక మంది చనిపోయారు. నేడు అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నకిలీ మద్యం దందాను ప్రారంభించాడు. నాణ్యమైన మద్యం, తక్కువ రేటుకు ఇస్తానంటూ హామీలు ఇస్తే మద్యం తాగే అలవాటు ఉన్న వారు చంద్రబాబు మాటలపై ఎంతో ఆశలు పెంచుకున్నారు.
కానీ నేడు నాణ్యమైన మద్యం సంగతి పక్కకుపెట్టి, నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకువచ్చాడు. ఈ విషయం ప్రజల ముందు బయటపడిపోవడంతో, దాని నుంచి బయట పడేందుకు తన హయాంలోనే జరిగిన వివేకా హత్యకేసు, సీబీఐ విచారణలో ఉన్న ఆ కేసుపైన కూడా తప్పుడు వక్రీకరణలు చేస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. ఇటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసే బదులు నకిలీ మద్యం దందాపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు కోరాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. వివేకా హత్యకేసు ఇప్పటికే సీబీఐ పరిధిలో ఉంది. నకిలీ మద్యంను, వివేకా హత్య కేసును ఎలా ముడిపెడతారు? ప్రజలను పక్కదోవ పట్టించేందుకే ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం ఏ షాప్‌ల్లో ఉందో ప్రజలను ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా అడగాలి. చంద్రబాబు నకిలీ మద్యం తాగి చనిపోయిన ప్రతి ప్రాణం ఉసురు ఆయనకు తగిలితీరుతుంది.
చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో తప్పుడు ప్రచారాలు మాని… మీకు ధైర్యం, నిజాయితీ ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నారా లోకేష్‌తో అయినా చెప్పించండి. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు? ఏయే షాపుల్లో గుర్తించారు? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీల నుంచి సరఫరా చైన్ ఏంటి? ఎవరెవరు వాటిని కొన్నారు? ఏయే లిక్కర్ షాపులు అమ్మాయి? ఎక్కడెక్కడ బెల్టుషాపులకు సప్లై అయ్యాయి? ఇది బయటకు రావడం లేదంటే.. ఇదంతా మీరు నడిపించిన మాఫియా కదా? అద్దేపల్లి జనార్దన్‌ను మీరు రప్పించారా? తనే వచ్చాడా? తాను వస్తున్నట్టుగా మీకు తెలిస్తే.. ముంబై వెళ్లి ఎందుకు అరెస్టు చేయలేదు? అంతకుముందు రెడ్‌కార్నర్ నోటీసు ఎందుకు జారీచేయలేదు? పరస్పర సహకార ఒప్పందం వెనుక మతలబు ఏమిటో చెప్పాలి.
అద్దేపల్లి జనార్థన్ ఫోన్ ఎక్కడ ఉంది?
అద్దేపల్లి జనార్దన్ తన ఫోను ముంబైలో పోయిందని చెప్పారు. ఆ ఫోన్‌లో జోగిరమేష్‌తో చాట్ చేసినట్టుగా మరోవైపు లీక్ చేయించారు. పోయిన ఫోన్ నుంచి చాటింగ్ స్క్రీన్ షాట్ ఎలా బయటకు తీశారు? ఇదెలా సాధ్యమైంది? జనార్దన్‌ను ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. జనార్దన్ లాయర్ల సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు. మరి మీ కస్డడీలో ఉన్నప్పుడు జనార్దన్ ఎలా వీడియో తీసుకున్నాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగాడు? అదీ అతనికి ఫోన్‌లేకుండా? ఈ మాయా మర్మం ఏంటి మహానుభావా? నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె నుంచి పోటీచేసిన మీ పార్టీ నాయకుడు జయచందరారెడ్డి తనకు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయని, ఆఫ్రికాలో ఉన్నాయని నేరుగా అఫిడవిట్‌లో పెట్టారు.
మీకు ఇవన్నీ తెలిసే గత ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికోసం సీనియర్, మాజీ ఎమ్మెల్యే అయిన శంకర్‌యాదవ్‌ను నట్టేటా ముంచిన మాట వాస్తవం కాదా? ఈ టిక్కెట్లు ఇవ్వడానికి నడిచిన క్యాష్… సూట్‌కేస్… రాజేష్.. లోకేష్.. వ్యవహారం మీద మీకు విచారణ చేసే దమ్ము ఉందా? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబరు 3న బయటపడితే ఇవ్వాళ్టికి 16 రోజులు అయ్యింది. ఇప్పటికీ జయంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. రెడ్‌కార్నర్ నోటీసు జారీచేయలేదు. పాస్ పోర్టు రద్దు చేయాలంటూ మీ జేబులో సిట్ దరఖాస్తు కూడా చేయలేదు. కారణం ఏంటో…? స్తుతి మెత్తని, సానుకూలత పద్ధతులు ఎందుకు? మీకు మీకు ఉన్న ఒప్పందాలు ఏంటి?
కిలారు రాజేష్, లోకేష్‌ల గుట్టు బయటపడుతుందని భయం
జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డి, పీఏ రాజేష్‌లనుకూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? నన్ను ఇబ్బందిపెడితే కిలారు రాజేష్, లోకేష్‌ల గట్టువిప్పుతానని జయంద్రారెడ్డి మీకు గట్టి హెచ్చరిక పంపినట్టుగా తెలుస్తోంది. ఈ స్టోరీపై కాస్త స్పందిస్తారా? కనీసం లోకేష్ అయినా మాట్లాడతాడా? మీ నకిలీ మద్యం అమ్మకానికి అడ్డురాకుండా మీరు అద్భుతమంటూ ప్రచారం చేసిన రూ.99ల లిక్కర్ సప్లైని తగ్గించేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అద్భుతమైన ఈ రూ.99ల సరుకు ఎంత అమ్మారు? నెలల వారీగా… వివరాలు బయటపెట్టగలరా? మీరు డాష్‌బోర్డు సీఎం కదా? కనీసం ఆ ముఖేష్‌కుమార్ మీనా కైనా చెప్పండి. పాపం మిమ్మల్ని కవర్ చేయలేక, ఆయన్ని ఆయన కాపాడుకోలేక తెగ ఇబ్బందిపడుతున్నాడు.
దీంతో పాటు గతంలో ఉన్న బ్రాండ్లు, వాటి రేట్లు, ఇప్పుడున్న బ్రాండ్లు వాటి రేట్లు, మీరు కొత్త పాలసీ తెచ్చిన తర్వాత నెలవారీగా వాటి విక్రయాలు, అలాగే ఆయా డిస్టలరీలకు ఇచ్చిన ఆర్డులు, వాటి నుంచి సప్లై, చెల్లించిన మొత్తాలు.. ఇవి బయటపెడితే బాగుంటుంది. మీరు బయటపెట్టకపోయినా ఎలాగూ.. మేం వచ్చాక బయటపెడతాం. అందులో సందేహం లేదు. చంద్రబాబూ.. రూల్ ప్రకారం బార్లకు సెపరేట్‌గా, లిక్కర్ షాపులకు సెపరేట్‌గా మందును సప్లై చేయాలి. కాని, బార్లు ఏవీకూడా ఆర్డర్లు పెట్టుండా… నేరుగా లిక్కర్ షాపుల నుంచి తెచ్చి అమ్మేస్తున్నారు. ఇందులో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, కిలారు రాజేష్‌కి, తద్వారా లోకేష్‌కి వాటాలు అందుతున్న విషయం వాస్తవం కాదా?