
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో దళితులపై దారుణంగా దాడులు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఓ ఆర్‌ఎంపీపై జనసేన నేతలు దాడి చేశారని సుధాకర్‌బాబు నిప్పులు చెరిగారు.
‘‘గతంలో వైఎస్ జగన్ పట్ల లోకేష్, పవన్ అసభ్యంగా మాట్లాడారు. వైఎస్ జగన్ పట్ల అసభ్యంగా మాట్లాడిన లోకేష్, పవన్‌పై ఎందుకు చర్యల తీసుకోలేదు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కూటమి నేతలకు ఉందా’’ అంటూ సుధాకర్‌బాబు నిలదీశారు.
‘‘చంద్రబాబు మాటలకు.. చేతలకు పొంతన ఉండదు. ఎస్పీల సమావేశంలో చంద్రబాబు మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు చేయాలని ఎస్పీలకు సూచించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో అశాంతి కనిపిస్తుంది. ఆయన అసమర్థ పాలన గురించి జనం మాట్లాడుకోకుండా డైవర్షన్స్ చేస్తుంటారు. అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్లకు అనుకూలమైన పోలీసులకే పోస్టింగులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది.
..రెడ్‌బుక్ రాజ్యాంగంలో మీరు రాసుకున్న పేర్లకు లేని ఆధారాలు సృష్టించి కేసులు పెడుతున్నారు. పవన్‌పై ఒక్క మాట జారిన వ్యక్తిపై కేసులు పెట్టారు. మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టారు. గతంలో పవన్ మాట్లాడిన మాటలకు ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలి. వాడు, వీడు.. యూస్ లెస్ ఫెలో అని మాట్లాడిన లోకేష్ పై ఎందుకు కేసులు పెట్టలేదు. మీ ప్రభుత్వంపై ప్రతీ ఒక్కరికీ నమ్మకం పోయింది. బాధితులపై తిరుగు కేసులు పెడుతున్న మీరు పోలీసులను కూర్చోబెట్టుకుని ఏం చెప్తారు’’ అంటూ సుధాకర్‌బాబు ప్రశ్నించారు.