ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావు కావేటిని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అంతర్జాతీయ న్యాయ సేవల్లో విశేష కృషి చేసినందుకు గాను డా. శ్రీనివాస్ రావు కావేటికి ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ ఇంటర్నేషనల్ కౌన్సెల్ లీడర్‌షిప్ ఇన్ ది యూఎస్ ఆఫ్ 2025’ అవార్డు దక్కింది. ‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ డా. శ్రీనివాస్ రావు కావేటికి ఈ అవార్డును అందించింది.
‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ అందించిన ఈ గౌరవం, భారతీయ చట్టాలను అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలతో సమన్వయం చేయడంలో డా. కావేటి చేసిన అసాధారణ కృషికి దక్కిన గుర్తింపు అని చెప్పవచ్చు. అంతర్జాతీయ న్యాయ సేవలలో కావేటి లా సంస్థ ఎంతో పేరొందింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా అడుగుపెట్టిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాలలో సొలిసిటర్‌గా, నోటరీ పబ్లిక్‌గా సేవలందించారు.
ఆయన స్థాపించిన కావేటి లా ఫర్మ్.. అమెరికా, భారతదేశం, యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో సేవలందిస్తోంది. కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, బిజినెస్ ఇమ్మిగ్రేషన్ వంటి కీలక రంగాలలో సరిహద్దులు దాటి క్లయింట్‌లకు సేవలను అందిస్తోంది.
ఒకే గొడుగు కింద స్థానిక, అంతర్జాతీయ న్యాయ సేవలను అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు న్యాయ విద్యతో పాటు ఎంబీఏ, జర్నలిజంలో మాస్టర్స్ పట్టాలను కూడా పొందారు. న్యాయ విద్యార్థులకు, చార్టర్డ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తూ గ్లోబల్ ఎడ్యుకేటర్‌గా కూడా ఆయన గుర్తింపు పొందారు.


