రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగియక ముందే.. చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం కలవరపెడుతోంది. ఇది చివరికి చైనా–అమెరికా ఘర్షణగా మారుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ ద్వీపం పూర్తిగా తనదేనని ముందు నుంచీ చెబుతూ వస్తున్న చైనా ఈ మధ్య దూకుడు పెంచింది. దాన్ని తనలో కలిపేసుకునేందుకు అవసరమైతే బలప్రయోగానికీ వెనకాడేది లేదని హెచ్చరికలు చేస్తోంది.
మరోవైపు.. తైవాన్‌కు రక్షణగా అగ్రరాజ్యం అమెరికా నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా తైవాన్‌కు 1,110 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. ఈ భారీ ఆయుధ విక్రయ ప్యాకేజీలో భాగంగా ఆ దేశానికి మధ్య శ్రేణి క్షిపణులు, శతఘ్నులు, డ్రోన్లను అందించనుంది. ఒకవైపు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగిస్తుండగా మరోవైపు అమెరికా ప్రభుత్వం ఆయుధ విక్రయంపై ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ విక్రయానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వ ఈ ప్రకటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామం తమకు, అమెరికాకు మధ్య కుదిరిన దౌత్య ఒప్పందాలకు విఘాతం కలిగిస్తుందని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఇది చైనా సార్వభౌమాధికారానికి, భద్రతకు, ప్రాంతీయ సమగ్రతకు భంగం కలిగించి ప్రాంతీయ సుస్థిరతను భగ్నం చేస్తుందని పేర్కొంది.
ఏమిటీ వివాదం?
చైనా, తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దాంతో నాటి దేశ పాలకుడు, మావో ప్రత్యర్థి చియాంగ్‌కై షేక్ దేశం విడిచి తైవాన్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచీ తైవాన్ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది. దాదాపు 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్‌ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది. దాన్ని చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా నిత్యం ఒత్తిడి తెస్తుంటుంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది! కేవలం 16 దేశాలు మాత్రమే తైవాన్‌తో అధికారికంగా దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి.
BREAKING; CHINA warns the United States to "immediately stop" arming TAIWAN.
China strongly condemned the United States for approving a massive $11.1 billion arms sale package to Taiwan, with officials urging the US to "immediately stop" arming the island.
Chinese Foreign… pic.twitter.com/bDstNkNDJk— Global Surveillance (@Globalsurv) December 19, 2025
అమెరికాకు సంబంధమేంటి?
చైనాలో విప్లవం నేపథ్యంలో 1970ల దాకా 30 ఏళ్ల పాటు తైవాన్ ప్రభుత్వాన్నే చైనా మొత్తానికీ ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. కానీ 1979లో చైనాతో అమెరికాకు దౌత్య తదితర సంబంధాలు ఏర్పాటయ్యాయి. దాంతో తైవాన్‌తో దౌత్య తదితర బంధాలకు, రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది. కానీ అనధికారంగా మాత్రం తైవాన్‌తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది. చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్‌కు ఆయుధ విక్రయాలను కూడా కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా, తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలన్నది అమెరికా వాదన.
చైనా దాడికి దిగేనా?
తైవాన్‌ను విలీనం చేసుకునేందుకు బలప్రయోగానికి వెనకాడేది లేదని చైనా పదేపదే చెబుతూనే ఉంది. 2049కల్లా ‘అత్యంత శక్తిమంతమైన చైనా’ కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు కూడా. చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారి తీసే అవకాశం లేకపోదని విశ్లేషకులు చెబుతున్నారు.
యుద్ధ సవాళ్లు..
ఒకవేళ చైనా, తైవాన్, అమెరికా మధ్య యుద్ధం జరిగితే.. దీని ప్రభావం ఆసియాపై మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. తైవాన్ ప్రపంచంలోనే అత్యధికంగా సెమీకండక్టర్ ఉత్పత్తి చేసే దేశం. Taiwan Semiconductor Manufacturing Company (TSMC) ప్రపంచంలో అత్యంత ఆధునిక చిప్ తయారీదారుగా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం జరిగితే టెక్నాలజీ రంగం దెబ్బతింటుంది. ఏఐ, స్మార్ట్‌ఫోన్ల తయారీ, రక్షణ రంగంపై ముఖ్యంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే, తైవాన్ సమస్యపై యుద్ధం జరిగితే అది కేవలం ద్వైపాక్షికంగా కాకుండా జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలను కూడా ప్రభావితం చేస్తుంది. తైవాన్ ఆర్థిక వ్యవస్థలో 60% కంటే ఎక్కువ భాగం ఎగుమతులపై ఆధారపడి ఉంది. తైవాన్‌కు అమెరికా, చైనా ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. మొత్తం మీద.. తైవాన్ భవిష్యత్తు కేవలం ఆసియా భద్రతకే కాదు, ప్రపంచ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకంగా ఉంది.


