భారత్‌ వ్యతిరేక షరీఫ్ ఉస్మాన్ మృతి.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత | Bangladesh Erupts In Violence After Death Of Sharif Osman Hadi, Protests Turn Violent In Dhaka | Sakshi
Sakshi News home page

Bangladesh Protests: భారత్‌ వ్యతిరేక షరీఫ్ ఉస్మాన్ మృతి.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత

Dec 19 2025 7:42 AM | Updated on Dec 19 2025 9:12 AM

Osman Hadi Issue Protests erupt in Bangladesh And Dhaka

ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది(32) మరణ వార్త బంగ్లాదేశ్‌లో అగ్గి రాజేసింది. డిసెంబర్ 12న ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు హాది తలపై కాల్పులు జరపడంతో సింగపూర్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ హాది మరణించాడని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నిరసనకారులు ఢాకాలో రెచ్చిపోయారు. ఆస్తులను ధ్వంసం చేశారు.

కాగా.. తీవ్రవాద భావజాలం, 2024 బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాది మరణం కారణంగా వేలాది మంది నిరసనకారులు ఢాకా, షాబాగ్ ప్రాంతంలో గుమిగూడారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నిరసనలకు దిగారు. అధికారుల వైఫల్యమే హాది మృతికి కారణమని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. 

దేశంలోని అతిపెద్ద పత్రిక అయిన ‘డైలీ ప్రథమ్ ఆలో’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మొదట ఆఫీసులను ధ్వంసం చేసిన నిరసనకారులు, ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టారు. అలాగే, ఢాకాలోని కవ్రాన్‌ బజార్‌లోని కార్యాలయానికి నిప్పుపెట్టారు. గంటలతరబడి శ్రమించి దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్నికీలల నుంచి కాపాడారు. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. రెండు అంతస్తులు అగ్నికీలల్లో చిక్కుకొన్నాయి. దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూఏజ్‌ పత్రిక ఎడిటర్‌ నూరుల్‌ కబీర్‌పైనా దాడి జరిగింది. దీంతో బంగ్లాదేశ్‌లో ప్రధాన పత్రికలు నేడు తమ కార్యకలాపాలను సస్పెండ్‌ చేశాయి. అయితే, ఆ భవనాల వద్ద సైనికులు, సరిహద్దు భద్రతా బలగాలు మోహరించినప్పటికీ.. నిరసనకారులను చెదరగొట్టలేదు. భద్రతా సిబ్బంది శాంతియుతంగా వెళ్లిపోవాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. 

మరోవైపు.. హాది మరణ వార్త వెలువడిన తర్వాత చిట్టగాంగ్‌లోని భారత ఉప హైకమిషనర్ నివాసం వద్ద సైతం నిరసనకారులు చెలరేగాయి. భారత రాయబార కార్యాలయంపైకి నిరసనకారులు రాళ్లు విసిరారు. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖుల్షీ ప్రాంతానికి చేరుకున్న నిరసనకారులు హాదిని హత్య చేశారంటూ.. అవామీ లీగ్, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే, అవామీ లీగ్‌ ఆఫీసుకు నిప్పంటించారు. దీంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఆస్తులను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

 

ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెలివిజన్‌లో యూనస్‌ ప్రసంగిస్తూ.. షరీఫ్ ఉస్మాన్ హాది మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అతని మరణం దేశానికి తీరని లోటు నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. అలాగే, శుక్రవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించి, దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. అతడి మృతికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

ఇక, బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 2026 జరగబోయే పార్లమెంటరీ ఎన్నికలలో హాది అభ్యర్థిగా ఉన్నారు. అయితే, డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. కా​ల్పుల్లో అతడి తలపై తీవ్ర గాయం కావడంతో హాదిని మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మరణవార్త విన్న అనంతరం ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement